ఆ హీరోయిన్‌కి బిగుస్తోన్న ఉచ్చు .. ఆ చట్టంతో దారులన్నీ క్లోజ్, జైళ్లోనే?
దుబాయ్ నుంచి దొడ్డిదారిలో స్మగ్లింగ్ చేస్తూ బెంగళూరు విమానాశ్రయంలో డీఆర్ఐ అధికారులకు దొరికిపోయిన కన్నడ సినీ నటి రన్యా రావు వ్యవహారం రోజుకొక మలుపు తిరుగుతోంది. మార్చి 3 నుంచి ఆమె అధికారుల కస్టడీలోనే ఉన్నారు. బెయిల్ కోసం పలుమార్లు ప్రయత్నించినా రన్యా రావుకు ఊరట లభించడం లేదు. ఆమెను అరెస్ట్ చేసిన నాటి నుంచి ఈ కేసులో చిక్కు ముడులు విప్పేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. తాజాగా రన్యా రావు బెయిల్ వ్యవహారంలో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ వివరాల్లోకి వెళితే..
కర్ణాటకలోని చిక్ మగళూరుకు చెందిన రన్యా రావు 2014లో సుదీప్ దర్శకత్వంలో వచ్చిన మాణిక్యలో హీరోయిన్‌గా నటించారు . తర్వాత వాఘా, పటాకీ సినిమాలలో నటించారు. రన్యా రావు సవతి తండ్రి , కర్ణాటకలో డీజీపీ ర్యాంక్ అధికారి కె రామచంద్రరావు అధికార హోదాను అడ్డుపెట్టుకుని ఆమె స్మగ్లింగ్‌కు పాల్పడినట్లుగా అధికారులు అనుమానిస్తున్నారు. అయితే ఆమె చేసే పనులతో తమకు ఎలాంటి సంబంధం లేదని రామచంద్రరావు ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. అప్పట్లో ఈ కేసు విచారణాధికారులపై రన్యా రావు సంచలన ఆరోపణలు చేశారు. తనపై చేయి చేసుకున్నారని, భారీ సంఖ్యలో తెల్ల కాగితాలపై బలవంతంగా సంతకాలు చేయించారని ఆరోపించారు.

ఈ కేసులో రన్యా రావుతో పాటు మరో ఇద్దరు అధికారులను అరెస్ట్ చేయగా వారు బెంగళూరు సెంట్రల్ జైళ్లో ఉన్నారు. సినీ, రాజకీయ రంగాల్లో చర్చనీయాంశంగా మారిన ఈ కేసును డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)లు దర్యాప్తు చేస్తున్నాయి. అటు కర్ణాటక ప్రభుత్వం కూడా రన్యా రావు కేసును సీరియస్‌గా తీసుకుంది. విపక్షాల ఆరోపణలు నేపథ్యంలో ఈ కేసులో డీజీపీ రామచంద్రరావు ప్రమేయంపై సీనియర్ ఐఏఎస్ అధికారి నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది.
సిట్ దర్యాప్తు సమయంలో రన్యా రావు స్మగ్లింగ్‌తో హవాలా వ్యవహారాలు నడిపించినట్లు తేలింది. దీంతో ఈడీ రంగ ప్రవేశం చేసింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న ఓ వ్యక్తికి కూడా ఈ హవాలా రాకెట్‌తో సంబంధం ఉన్నట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. అయితే అరెస్ట్ అయిన నాటి నుంచి బెయిల్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తోంది రన్యా రావు. కానీ న్యాయస్థానంలో ఆమె వాదనలు వీగిపోతున్నాయి. ఇటీవల బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా.. బెంగళూరులోని ఆర్ధిక నేరాల కోర్ట్ దానిని తిరస్కరించింది.
ఇప్పటికే ఈ కేసులో దర్యాప్తు బృందాలు పలు ఆధారాలు సేకరించడం, హవాలా, మనీలాండరింగ్ అంశాలు తెరపైకి రావడంతో ఈడీ అధికారులు రన్యారావును కస్టడీలోకి తీసుకున్నారు. ఈ క్రమంలో హీరోయిన్ చుట్టూ మరింత ఉచ్చు బిగిస్తున్నట్లుగా తెలుస్తోంది. రన్యారావుపై అత్యంత కఠినమైన విదేశీ మాదక ద్రవ్యం, స్మగ్లింగ్ కార్యకలాపాల నిరోధక చట్టం -1974ను ప్రయోగించినట్లుగా మీడియాలో కథనాలు వస్తున్నాయి. డీఆర్ఐ సిఫార్సు మేరకు కేంద్ర ఆర్ధిక మంత్రిత్వ శాఖ పరిధిలోని నోడల్ ఏజెన్సీ అయిన సెంట్రల్ ఎకనామిక్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఈ చట్టాన్ని ప్రయోగించింది. దీని కింద కేసు నమోదైతే ఏడాది పాటు బెయిల్ వచ్చే అవకాశం ఉండదని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రన్యా రావు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.


Click it and Unblock the Notifications











