Rashmika Mandanna: పన్ను చెల్లింపుల్లో అగ్రస్థానంలో రష్మిక మందన్న... ఎన్ని కోట్లంటే?
కిర్రాక్ పార్టీ అనే సినిమాతో వెండితెరపై అడుగుపెట్టిన రష్మిక మందన్న ప్రస్తుతం నేషనల్ క్రష్ స్థాయికి చేరుకున్నారు. వరుస బ్లాక్ బస్టర్స్‌తో ఇండస్ట్రీలో లక్కీ హ్యాండ్ అనిపించుకున్నారు. సినిమా సినిమాకు వెరియేషన్స్ చూపిస్తూ... గ్లామర్ షోతో పాటు నటనలోనూ తనకు తిరుగులేదని నిరూపించుకున్నారు రష్మిక మందన్న. ప్రస్తుతం టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఆమెకు దరిదాపుల్లో నిలబడే హీరోయిన్ లేదంటే అతిశయోక్తి కాదు. సక్సెస్‌రేట్ పరంగా రష్మిక ఎక్కడో ఉన్నారు. తాజాగా నేషనల్ క్రష్ మరో అరుదైన ఘనతను సాధించారు.
కర్ణాటకలోని కొడగు జిల్లా విరాజ్‌పేటలో 1996 ఏప్రిల్ 5న జన్మించారు రష్మిక మందన్న. వీరి కుటుంబానికి స్థానికంగా కాఫీ ఎస్టేట్ ఉంది. రష్మిక చిన్నతనంలో వీరి ఫ్యామిలీ ఆర్ధికంగా ఎన్నో ఇబ్బందులు పడింది. తనకు ఆడుకోవడానికి బొమ్మలు కొనడానికి కూడా తన తల్లిదండ్రులు ఎంతో ఇబ్బందిపడ్డారని రష్మిక పలుమార్లు తెలిపారు. బెంగళూరులోని ఎంఎస్ రామయ్య కాలేజీలో గ్రాడ్యుయేషన్ చేశారు. ఆ తర్వాత మోడలింగ్‌లోకి దిగిన రష్మిక.. అనంతరం రిషబ్ శెట్టి దర్శకత్వంలో రక్షిత్ శెట్టి హీరోగా నటించిన కిర్రాక్ పార్టీ సినిమాతో వెండితెరపై అడుగుపెట్టారు. తర్వాత అంజనీపుత్ర, చమ్మక్ సినిమాలలో నటించారు.

అనంతరం కన్నడ ఇండస్ట్రీకి దూరమైన రష్మిక... ఛలో చిత్రం ద్వారా తెలుగువారిని పలకరించారు. తర్వాత గీత గోవిందం సినిమా హిట్ కావడంతో ఆమె వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఆ వెంటనే డియర్ కామ్రేడ్, సరిలేరు నీకెవ్వరు, భీష్మలతో మంచి హిట్స్ అందుకున్నారు. ఈ దశలో సుకుమార్- అల్లు అర్జున్‌ల పుష్ప ది రైజ్ సినిమా... రష్మిక మందన్నకు దేశవ్యాప్తంగా గుర్తింపు తీసుకువచ్చింది. ఆ తర్వాత యానిమల్, పుష్ప 2 ది రూల్, ఛావా చిత్రాలతో ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది రష్మిక మందన్న. బ్యాక్ టూ బ్యాక్ మూడు 500 కోట్లు కలెక్ట్ చేసిన సినిమాల్లో నటించిన హీరోయిన్‌గా నిలిచారు. తెలుగుతో పాటు హిందీలోనూ నెంబర్‌వన్ హీరోయిన్‌గా నిలిచారు.
గతేడాది ఏకంగా 5 సినిమాలలో నటించిన రష్మిక మందన్న.. ఈ ఏడాది కాక్‌టెయిల్, మైసా సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇక టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండతో ఈ ముద్దుగుమ్మ ప్రేమాయణం సాగిస్తున్నట్లుగా కొద్దినెలలుగా గాసిప్స్ వినిపిస్తున్నాయి. గతేడాది అక్టోబర్‌లో రష్మిక - విజయ్‌ల ఎంగేజ్‌మెంట్ జరిగినట్లుగా పుకార్లు షికారు చేశాయి. కానీ తమకు నిశ్చితార్ధం జరిగిందని కానీ, జరగలేదని కానీ ఈ జంట క్లారిటీ ఇవ్వలేదు. సమయం వచ్చినప్పుడు మేమే అసలు విషయం చెబుతామని తప్పించుకున్నారు. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఈ ఏడాది ఫిబ్రవరిలో రష్మిక - విజయ్‌ల పెళ్లి జరుగుతుందని గాసిప్స్ వస్తున్నాయి.
పదేళ్ల కెరీర్‌లో ఎన్నో రికార్డులు, రివార్డులు, అవార్డులు సొంతం చేసుకున్న రష్మిక మందన్న తాజాగా మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నారు. తన సొంత జిల్లా కొడగులో అత్యధిక ఆదాయపు పన్ను చెల్లించిన వ్యక్తిగా రష్మిక సరికొత్త రికార్డ్ సృష్టించారు. 2025-26 ఆర్ధిక సంవత్సరానికి గాను మూడు త్రైమాసికాలలో దాదాపు 4.69 కోట్ల రూపాయల ఆదాయపు పన్ను చెల్లించిన రష్మిక.. కొడగు జిల్లాలోని మొత్తం పన్ను చెల్లింపుదారులలో అగ్రస్థానంలో నిలిచారు. నటిగానే కాకుండా.. పౌరురాలిగా తన బాధ్యత నిర్వర్తించిన రష్మిక మందన్నపై అభిమానులు, నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.


Click it and Unblock the Notifications











