బాధగా ఉంది.. మిమ్మల్నీ చాలా మిస్ అవుతున్నా: రష్మిక ఎమోషనల్
టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న నటి రష్మిక మందన్నా (Rashmika Mandanna). ప్రస్తుతం ఇండియన్ సినీ ఇండస్ట్రీలో అత్యంత బిజీ హీరోయిన్‌గా కొనసాగుతోంది. ఇటీవలే ఆమె నటించిన "థామా" చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా విజయవంతం కావడంతో, ఇప్పుడు రష్మిక మరో ప్రత్యేక చిత్రంతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైంది. నవంబర్ 7న విడుదల కాబోతున్న "ది గర్ల్‌ఫ్రెండ్" మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో రష్మిక మందాన కు సంబంధించిన ఓ ఎమోషనల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంతకీ ఆ వీడియాలో ఏముందంటే?
"ది గర్ల్‌ఫ్రెండ్" అనే మూవీ లేడీ ఓరియెంటెడ్ ఎమోషనల్ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కింది. ఇందులో మహిళల ప్రేమ, ఆత్మగౌరవం, బ్రేకప్ బాధ, రిలేషన్‌లోని ఒత్తిడులు వంటి వాస్తవానికి దగ్గరగా చూపించినట్టు తెలుస్తోంది. ఈ సినిమాకు యువ దర్శకుడు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించారు. ఆయన గతంలో చి ల సౌ, మన్మధుడు 2 వంటి సినిమాలతో క్లాస్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈసారి మాత్రం ఆయన ఓ బోల్డ్, ఎమోషనల్ కాన్సెప్ట్‌ను ఎంచుకున్నారు.

ఈ సినిమాలో హీరోగా దసరా ఫేమ్ దీక్షిత్ శెట్టి, హీరోయిన్‌గా రష్మిక మందన్నా నటించగా, అను ఇమ్మాన్యుయేల్, రావు రమేష్, రోహిణి వంటి నటులు కీలక పాత్రల్లో నటించారు. గీతా ఆర్ట్స్ సమర్పణలో ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలు ప్రేక్షకుల్లో మంచి స్పందన రాబట్టాయి. "ఇంత క్యారెక్టర్‌లెస్ కూతురు" అనే డైలాగ్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయ్యి సినిమా పట్ల ఆసక్తిని మరింత పెంచింది.
విడుదల తేదీ దగ్గరపడుతున్న కొద్దీ మూవీ మేకర్స్ ప్రమోషన్స్ లో బిజీబిజీగా ఉన్నారు. ఈ నేపధ్యంలో "ది గర్ల్‌ఫ్రెండ్" ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ బుధవారం హైదరాబాద్ లో జరిగింది. అయితే రష్మిక మందన్నా ప్రస్తుతం వేరే సినిమా షూట్ షెడ్యూల్ కారణంగా ఈ ఈవెంట్‌కు హాజరుకాలేకపోయింది. కానీ అభిమానుల కోసం ఆమె ఒక స్పెషల్ వీడియో మెసేజ్ పంపింది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఆ వీడియోలో రష్మిక మాట్లాడుతూ, "హాయ్ అందరికీ నమస్కారం... నవంబర్ 7న నా సినిమా 'ది గర్ల్‌ఫ్రెండ్' విడుదల కాబోతోంది. కానీ ఈరోజు జరుగుతున్న ప్రెస్ మీట్‌లో పాల్గొనలేకపోవడం నాకు కొంచెం బాధగా ఉంది. అందర్నీ చాలా మిస్ అవుతున్నా.. ప్రస్తుతం నేను వేరే సినిమా షూట్‌లో ఉన్నాను.నేను ఇక్కడ ఉన్నప్పటికీ నా మనసు మాత్రం 'ది గర్ల్‌ఫ్రెండ్' సినిమాతోనే ఉంది. ఇది నా కెరీర్‌లో ఒక మైలురాయి అవుతుందని నాకు తెలుసు" అని చెప్పింది.
రష్మిక మాట్లాడుతూ, "ది గర్ల్‌ఫ్రెండ్ నా మొదటి సోలో ఫిలిం. ఈ సినిమాలో ప్రతి సీన్ నాకు కొత్త అనుభవం ఇచ్చింది. డబ్బింగ్ చేసేటప్పుడు కూడా నాకు చాలా ఎమోషనల్ ఫీలయ్యాను. ఒక అమ్మాయి మనసులోని భావాలను అంత నిజాయితీగా చూపించే స్క్రిప్ట్ దొరకడం చాలా అరుదు. అలాంటి అవకాశం రావడం నాకు అదృష్టం. ఈ కథ ప్రతి అమ్మాయికి, ప్రతి యువకుడికి కనెక్ట్ అవుతుంది," అని చెప్పింది.
టీమ్‌కి రష్మిక ప్రత్యేక థాంక్స్
గీతా ఆర్ట్స్ ప్రొడక్షన్ హౌస్ గురించి మాట్లాడుతూ, "గీతా ఆర్ట్స్ లాంటి బ్యానర్‌లో పని చేయడం చాలా అదృష్టం. అల్లు అరవింద్ సర్, నిర్మాత ధీరజ్ గారు ఈ సినిమాకు ఇచ్చిన సపోర్ట్ అద్భుతం. వారు చూపించిన నమ్మకమే నాకు ఈ పాత్ర చేయడానికి ధైర్యం ఇచ్చింది. అలాగే సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వాహాబ్ మ్యూజిక్ చాలా బాగా చేశారు. ఆయన ఇచ్చిన పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రాణం పోశాయి," అని రష్మిక పేర్కొంది.
అదే విధంగా సినిమాటోగ్రాఫర్ (DOP) కృష్ణన్ వసంత్ గారిని ప్రశంసిస్తూ.. "డి ఓ పి గారు ప్రతి ఫ్రేమ్‌ని ఎంతో అందంగా తీశారు. ఈ సినిమా విజువల్స్ చూస్తే, ఎంత శ్రద్ధ పెట్టారో అర్థమవుతుంది. నా పాత్రను ఎంత సెన్సిటివ్‌గా చూపించాలో ఆయన అద్భుతంగా చూపించారు" అని చెప్పింది.
హీరో దీక్షిత్‌పై రష్మిక ప్రశంసలు
రష్మిక సహ నటుడు దీక్షిత్ శెట్టి గురించి మాట్లాడుతూ "దీక్షిత్ గారి నటన చాలా నేచురల్‌గా ఉంది. ఆయన చాలా డెడికేటెడ్ నటుడు. సెట్‌లో ఆయన ప్యాషన్ చూసి నేను ఇంప్రెస్ అయ్యాను. ఇలాంటి కో-స్టార్‌తో పని చేయడం చాలా సంతోషంగా ఉంది. తెలుగులో ఆయన ఇంకా చాలా దూరం వెళ్తారని నమ్ముతున్నాను" అని రష్మిక చెప్పింది.
రాహుల్ రవీంద్రన్‌పై రష్మిక ఎమోషనల్ కామెంట్స్
డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ గురించి మాట్లాడిన రష్మిక మాటలు సోషల్ మీడియాలో హైలైట్‌గా మారాయి. "రాహుల్ గారు కేవలం దర్శకుడు మాత్రమే కాదు, ఒక సెన్సిటివ్ మైండ్. ఒక అమ్మాయి ఫీలింగ్స్‌ని ఇంత అర్థం చేసుకున్న డైరెక్టర్ నేను చూడలేదు. ఆయన ఎంత కేర్ తీసుకున్నారు అంటే, ప్రతి సీన్‌లో మహిళల భావోద్వేగాలు నిజంగా కనపడతాయి. ఆయన డైరెక్షన్ లేకపోతే ఈ సినిమా నేనే చేసేదాన్ని కాదు. ఆయనతో పని చేయడం నాకు గౌరవంగా ఉంది. రాహుల్ గారు ఈ సినిమాతో ఖచ్చితంగా ఇండస్ట్రీలో కొత్త స్థాయికి వెళ్తారు" అని ఆమె తెలిపింది.
"ది గర్ల్‌ఫ్రెండ్"పై రష్మిక ఆశలు
తన ప్రసంగం చివరగా రష్మిక మాట్లాడుతూ "ఈ సినిమా కోసం టీమ్ మొత్తం ఎంతో కష్టపడ్డారు. ఇది నా కెరీర్‌లో చాలా ఇంపార్టెంట్ మూవీ. ప్రతి ఒక్కరూ ఈ సినిమాను థియేటర్‌లో చూసి సపోర్ట్ చేయాలి. నేను ఈ సినిమా కోసం ఎన్నో రోజులు వెయిట్ చేశాను. ఇప్పుడు ఆ రోజు దగ్గర్లోనే ఉంది.మీ ప్రేమ, మద్దతు ఎప్పటిలానే ఉంటుందని నమ్ముతున్నాను " అంటూ అభిమానులకు స్పెషల్ థాంక్స్ తెలిపింది రష్మిక.


Click it and Unblock the Notifications











