8 ఏళ్లుగా టార్చర్.. ఇక సహించలేను.. వైరల్ ఆడియోపై రష్మిక మందన్నా ఫైర్..
స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా (Rashmika Mandanna) తాజాగా షాకింగ్ ట్విట్ చేసింది. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ పాత ప్రైవేట్ సంభాషణకు సంబంధించి ఆమె తీవ్రంగా స్పందించింది. ఈ సమయంలో దాదాపు 3 పేజీల ఎమోషనల్ సోర్టీని రాసుకొచ్చింది. 8 ఏళ్ల క్రితం జరిగిన ఓ సంభాషణను అనుమతి లేకుండా రికార్డు చేసి, దాన్ని సందర్భం నుంచి వేరుచేసి ప్రచారం చేస్తున్నారని పేర్కొంది. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది. ఇంతకీ ఏం జరిగింది?
8 ఏళ్లుగా టార్చర్
రష్మిక మందన్నా తన అధికారిక ప్రకటనలో 'గత ఎనిమిదేళ్లుగా కొంతమంది వ్యక్తులు, మీడియా వర్గాలు తనపై తప్పుడు ప్రచారం, తనని వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకున్న దాడులు కొనసాగిస్తున్నాయని పేర్కొన్నారు. తన మాటలను వక్రీకరించడం, తాను చెప్పని విషయాలను కూడా తన పేరుతో ప్రచారం చేయడం వంటి చర్యలు తరచుగా జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది. 'వ్యూస్, రీచ్, ఎంగేజ్‌మెంట్ కోసం నాకు వ్యతిరేకంగా కథనాలు సృష్టించారు. ఇది నన్ను చాలా బాధపెట్టినా నేను ఇప్పటి వరకు సహనంతో మౌనం పాటించాను. విమర్శలు వస్తాయని భావించి వాటిని పట్టించుకోకుండా ముందుకు సాగాను" అని ఆమె పేర్కొన్నారు.

పాత ఆడియోపై స్పందన
అయితే గత 24 గంటల్లో జరిగిన పరిణామాలు మాత్రం తాను ఇక మౌనం వహించలేని స్థితికి తీసుకువచ్చాయని రష్మిక తెలిపారు. సుమారు ఎనిమిదేళ్ల క్రితం జరిగిన ఒక వ్యక్తిగత సంభాషణను ఎవరో రికార్డు చేసి, సంబంధిత వ్యక్తుల అనుమతి లేకుండా ప్రచారం చేశారని రష్మిక ఆరోపించారు. అంతేకాకుండా ఆ సంభాషణలోని చిన్న భాగాన్ని మాత్రమే తీసుకుని దాన్ని వేరే అర్థం వచ్చేలా సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని పేర్కొన్నారు.
ఇటీవల తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను తప్పుగా చిత్రీకరించి, ఉద్దేశపూర్వకంగా బయటకు తీసుకొచ్చారని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. ఈ ప్రక్రియలో తన కుటుంబ సభ్యులను, అలాగే తనకు మంచి సంబంధాలు ఉన్న ఇతర వ్యక్తులను కూడా ఈ వివాదంలోకి లాగడం తాను తీవ్రంగా బాధపడేలా చేసిందని చెప్పారు.
ఈ ఘటనను రష్మిక గోప్యతపై తీవ్రమైన దాడి గా పేర్కొన్నారు. అనుమతి లేకుండా రికార్డు చేసిన వ్యక్తిగత సంభాషణను ప్రచారం చేయడం మాత్రమే కాకుండా, దాన్ని వక్రీకరించి ప్రచారం చేయడం కూడా దుష్ప్రచారమేనని ఆమె స్పష్టం చేశారు. గత ఎనిమిదేళ్లుగా తనపై వచ్చిన దాడులు తనకే పరిమితమయ్యాయి కాబట్టి తాను మౌనం పాటించానని రష్మిక చెప్పారు. కానీ ఇప్పుడు ఇతర వ్యక్తులను కూడా ఈ వివాదంలోకి లాగడంతో ఇక మౌనం ఉండలేనని స్పష్టం చేశారు.
ఈ నేపథ్యంలో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు, ఇన్‌ఫ్లుయెన్సర్లు, అలాగే ఈ కంటెంట్‌ను పంచుతున్న వ్యక్తులందరికీ ఆమె ఒక గట్టి హెచ్చరిక జారీ చేశారు. ఈ ప్రకటన విడుదలైన 24 గంటలలోపు ఆ కంటెంట్‌ను తొలగించాలని ఆమె కోరారు. అలా చేయని పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటాననీ, అవసరమైతే వ్యక్తులు, ఇన్‌ఫ్లుయెన్సర్లు, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు, మీడియా సంస్థలకు లీగల్ నోటీసులు పంపుతామని ఆమె తెలిపారు.
ఈ విషయంలో తనకు మద్దతుగా నిలిచిన అభిమానులకు రష్మిక కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిర్ణయం తేలికగా తీసుకోలేదని, కానీ పరిస్థితులు అలాంటి చర్య తీసుకోవాల్సిన అవసరం తీసుకొచ్చాయని ఆమె అన్నారు. ఈ ప్రకటనతో ప్రస్తుతం సోషల్ మీడియాలో రష్మిక వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











