బిగ్‌బాస్‌కు వెళ్లాలంటే చాలా గట్స్ ఉండాలి.. అలా ఉండటం నావల్ల కాదు
తెలుగు బుల్లితెరపై అత్యంత ప్రజాదరణ పొందిన రియాలిటీ షో బిగ్‌బాస్ తెలుగు (Bigg Boss Telugu) పదో సీజన్‌కు రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే స్టార్ మా విడుదల చేసిన టీజర్‌తో ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది. ఈసారి కూడా అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించనుండగా, "ఆటలో సవాల్ కాదు... ఆటే సవాల్" అనే క్యాప్షన్‌తో షోపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇలాంటి సమయంలో బిగ్‌బాస్ గురించి టాలీవుడ్ హీరోయిన్ రేఖ వేదవ్యాస్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
'ఆనందం'సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన రేఖ వేదవ్యాస్.. తక్కువ సినిమాలే చేసినా తన అందం, నటనతో ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. ఒకటో నెంబర్ కుర్రాడు, జానకి వెడ్స్ శ్రీరామ్, దొంగోడు, అనగనగా ఓ కుర్రాడు వంటి పలు సినిమాల్లో హీరోయిన్‌గా నటించారు. తెలుగు మాత్రమే కాకుండా తమిళం, కన్నడ భాషల్లోనూ సినిమాలు చేశారు. అయితే 2014 తర్వాత ఆమె సినిమాలకు దూరమయ్యారు. ఇటీవల మళ్లీ రీఎంట్రీకి సిద్ధమైన రేఖ వేదవ్యాస్ వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ మంచి అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం, సినీ కెరీర్, ఆరోగ్య పరిస్థితి, అలాగే బిగ్‌బాస్ షో గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఇంటర్వ్యూలో "బిగ్‌బాస్ నుంచి ఆఫర్ వస్తే వెళ్తారా?" అని అడగగా రేఖ వేదవ్యాస్ ఆసక్తికర సమాధానం ఇచ్చారు. "బిగ్‌బాస్‌లో పాల్గొనాలంటే చాలా గట్స్ ఉండాలి. ఇన్ని రోజులు కెమెరాల మధ్య జీవించడం, టాస్కులు ఆడటం, గొడవలు, భావోద్వేగాలు, ఎంటర్‌టైన్‌మెంట్ అన్నీ ఒకేసారి చేయడం అంత ఈజీ కాదు. ఆ షోలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ నా హ్యాట్సాఫ్. కానీ కంటెస్టెంట్‌గా మాత్రం నేను వెళ్లలేను'అని చెప్పారు. అయితే గెస్ట్‌గా ఆహ్వానం వస్తే మాత్రం తప్పకుండా వెళ్తానని తెలిపారు. "ఏదైనా మంచి క్రియేటివ్ ఐడియాతో పిలిస్తే తప్పకుండా పాల్గొంటాను. కానీ హౌస్‌లో కంటెస్టెంట్‌గా ఉండడం మాత్రం నా వల్ల కాదు" అని తేల్చి చెప్పారు.
బిగ్‌బాస్ ఒక్కటే టెలివిజన్ కాదని, ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు ఉన్నాయని రేఖ అన్నారు. ప్రేక్షకులతో మళ్లీ కనెక్ట్ అయ్యే అవకాశం దొరికితే ఏ షో అయినా చేసేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. 'నాకు ముఖ్యంగా ప్రేక్షకులతో మళ్లీ కనెక్ట్ కావాలి. ఏ వేదిక అయినా సరే... ప్రేక్షకులను అలరించే అవకాశం వస్తే తప్పకుండా చేస్తాను. అలాంటి మంచి అవకాశాల కోసం ఎదురు చూస్తున్నాను'అని పేర్కొన్నారు. ఇక వ్యక్తిగత జీవితానికి గురించి మాట్లాడుతూ.. "నేను నా కెరీర్ ఆపిన తర్వాత నుంచి మళ్లీ ప్రారంభించే వరకు చాలా కష్టాలు అనుభవించాను. ఆ రోజులు మళ్లీ నా జీవితంలో రావద్దని కోరుకుంటాను. ఆ బాధలు నాకు మాత్రమే తెలుసు" అంటూ ఎమోషనల్ అయ్యారు.
అలాగే భవిష్యత్తులో మాత్రం గతంలో ఉన్న మంచి రోజులే మళ్లీ రావాలని కోరుకుంటున్నానని చెప్పారు. "ప్రేమ, పని, మనశ్శాంతి, ఆర్థిక స్థిరత్వం ఇవన్నీ కలిసి ఉన్న రోజులు మళ్లీ రావాలని కోరుకుంటున్నాను. అదే నా కోరిక" అని తెలిపారు. ఇటీవల తన ఆరోగ్య సమస్య గురించి కూడా పలు వార్తలు వచ్చిన నేపథ్యంలో యాంకర్ ప్రశ్నించగా, ఆ విషయం గురించి మాట్లాడేందుకు ఆమె ఇష్టపడలేదు. "ఆ విషయం ఇప్పుడు బయట చెప్పాలని అనుకోవడం లేదు. అది నా జీవితంలో ముగిసిపోయిన అధ్యాయం. మళ్లీ ఆ రోజులను గుర్తు చేసుకుని బాధపడాలనుకోవడం లేదు. ప్రస్తుతం నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను" అని చెప్పారు.
అయితే తన ఆరోగ్యం కోసం ప్రార్థించిన అభిమానులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. "ఇప్పటికీ సోషల్ మీడియాలో చాలామంది నా ఆరోగ్యం గురించి అడుగుతుంటారు. నా కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ నేను జీవితాంతం రుణపడి ఉంటాను. వాళ్లందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు" అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. రేఖ వేదవ్యాస్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా "బిగ్‌బాస్‌లో పాల్గొనాలంటే చాలా గట్స్ ఉండాలి", "కంటెస్టెంట్‌గా మాత్రం నావల్ల కాదు" అనే వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.


Click it and Unblock the Notifications




