అంబటి రాంబాబుకు షాకిచ్చిన రేణుదేశాయ్.. మీ రాజకీయ ప్రయోజనాల కోసం మా జీవితాలను లాగొద్దు అంటూ వీడియో
బ్రో సినిమాలోని కొన్ని సీన్లు ఏపీ రాజకీయాలను కుదిపేసిన సంగతి తెలిసిందే. తనను టార్గెట్ చేస్తూ ఓ సీన్‌లో ఓ వ్యక్తితో డ్యాన్సులు చేయడంపై మంత్రి అంబటి రాంబాబు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అంతేకాకుండా సమాజంలో పెద్ద హోదాలో ఉన్న ఓ అన్నయ్య.. ఆయన తమ్ముడి నాలుగు పెళ్లిళ్ల గురించి మేము సినిమా తీయబోతున్నాం. ఆ సినిమాకు టైటిల్స్ ఇవే అంటూ అంబటి ప్రెస్‌మీట్‌లో ప్రకటించారు. అయితే అంబటి తీయబోయే సినిమా గురించి రేణుదేశాయ్ మాట్లాడుతూ..
నేను క్లిష్టమైన పరిస్థితుల్లో ఈ వీడియో చేయాల్సి వచ్చింది. బ్రో సినిమా రిలీజ్ తర్వాత కొన్ని సీన్లపై అభ్యంతరాలు వ్యక్తమై వివాదంగా మారాయి. ఆ సినిమాలో సీన్లు ఏమున్నాయో నాకు తెలియదు. ఎందుకంటే నేను విదేశాల్లో పర్యటిస్తున్నాను. అయితే ఆ వివాదం నా దృష్టికి వచ్చింది. ఎవరు ఒప్పుకొన్నా.. ఒప్పుకోకపోయినా నా మాజీ భర్త (పవన్ కల్యాణ్)తో నాకు అభిప్రాయ బేధాలు ఉన్నాయి అని రేణుదేశాయ్ వీడియోలో చెప్పారు.

అయితే మా దాంపత్య జీవితం, మా పిల్లల జీవితం ఆధారంగా కొంత మంది వెబ్ సిరీస్, లేదా సినిమా తీయాలనే ప్రయత్నాల్లో ఉన్నట్టు తెలిసింది. అయితే మా జీవితాలను టార్గెట్ చేస్తూ సినిమా గానీ వెబ్ సిరీస్ తీయకూడదు అని రేణు దేశాయ్ తాజా వీడియోలో చెప్పారు. కొద్ది రోజుల క్రితం మంత్రి అంబటి రాంబాబు ప్రెస్ మీట్ పెట్టి ఓ వ్యక్తికి సంబంధించిన నాలుగు వివాహాలపై సినిమా తీస్తున్నాం అంటూ కొన్ని టైటిల్స్ ప్రకటించడంపై ఈ వీడియోలో రేణు దేశాయ్ అభ్యంతరం వ్యక్తం చేసింది.
అయితే పవన్ కల్యాణ్‌పై కొందరు తీయబోయే సినిమాపై ఓ తల్లిగా నాకు అభ్యంతరాలు ఉన్నాయి. నా పిల్లలను మీ సొంత ప్రయోజనాల కోసం లాగకండి. మీ సినిమాల్లో మా పిల్లల ప్రస్తావనను, వారి జీవితాల గురించి జోక్యం చేసుకోకండి. వారి తండ్రి యాక్టర్, రాజకీయ నాయకుడైనంత మాత్రాన నా పిల్లల గురించి ప్రస్తావన తీసుకు రావోద్దు. వారు అభంశుభం తెలియని పిల్లలు అని రేణుదేశాయ్ అన్నారు.
ఫ్యాన్స్, ట్రోలర్స్, హేటర్స్‌కు నా రిక్వెస్ట్ ఏమిటంటే.. మా పిల్లల విషయాన్ని లాగకండి. మీ రాజకీయాల కోసం ఏ రాజకీయ నేత, సినీ నటుడి పిల్లల్ని లాగకండి. మీకు ఏవైనా ప్రొఫెషనల్ విభేదాలు ఉంటే అక్కడి వరకే చూసుకొండి అని రేణు దేశాయ్ అన్నారు.
మా మధ్య ఎన్ని విభేదాలు ఉన్నా.. మొదటి రోజు నుంచి నా మాజీ భర్త పవన్ కల్యాణ్‌కు అండగా ఉన్నాను. సామాజిక కార్యక్రమాలు గానీ, రాజకీయ జీవితానికి, రాజకీయ సిద్దాంతాలకు నేను ప్రోత్సాహం ఇస్తూనే ఉన్నాను. నేను ఇంతకు ముందు కూడా నా సపోర్టును చాలా క్లారిటీగా చెప్పాను అని రేణు దేశాయ్ చెప్పారు.


Click it and Unblock the Notifications











