రేణు దేశాయ్.. ఒక్క నైట్ కి నీ రేటు ఎంత? నెటిజన్ ప్రశ్నకు దిమ్మ తిరిగేలా..
టాలీవుడ్ హీరోయిన్, సామాజిక కార్యకర్త రేణూ దేశాయ్ (Renu Desai) సంచలన వ్యాఖ్యలు చేశారు. సామాజిక మాధ్యమాల్లో తనపై వస్తున్న అసభ్యకర కామెంట్లపై నటి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లోకి వచ్చిన ఆమె, తన వ్యక్తిగత జీవితం నుంచి సామాజిక సేవల వరకూ ప్రతి విషయంలో తాను లక్ష్యంగా మారుతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపై బూతులు పెట్టే వారిని వదిలిపెట్టనని, అవసరమైతే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
'మీకు ఈ దేశంలో ఉన్న హక్కులే నాకు ఉన్నాయి. నేను సినిమా పరిశ్రమలో ఉన్నాననే కారణంతో నా వ్యక్తిత్వాన్ని కించపరచే హక్కు మీకు ఎక్కడిది?' అని రేణు దేశాయ్ ప్రశ్నించారు. సెలబ్రిటీలు కూడా మనుషులేనని, వారికి కూడా గౌరవం అవసరమని గుర్తు చేశారు. ట్రోలింగ్ చేసే వారిని ఆమె 'నీచ రాక్షస మనుషులు'గా అభివర్ణించారు. సోషల్ మీడియాలో అజ్ఞాతంగా ఉండి వ్యక్తిత్వ హననం చేయడం సంస్కారం కాదన్నారు. 'మీరు వాడే భాష మమ్మల్ని కాదు... మీ పెంపకాన్ని బయటపెడుతుంది' అని ఘాటుగా స్పందించారు.

జనవరిలో కుక్కల సంరక్షణపై నిర్వహించిన ప్రెస్ మీట్‌లో తాను మాట్లాడిన విషయాన్ని వక్రీకరించారని ఆమె ఆరోపించారు. 'వంద కుక్కల్లో పది పిచ్చి కుక్కలు ఉంటే, మిగిలిన 90 మంచివి ఎందుకు చంపాలి అన్నాను. ఇందులో తప్పేంటి?' అని ప్రశ్నించారు. తాను జంతువుల కోసం ఎన్జీవో నడుపుతున్నానని, మనుషుల సమస్యలపై ప్రభుత్వాలను ప్రశ్నించాల్సిందని ప్రజలకు సూచించారు. 'మీకు సమస్య ఉంటే మీరు ఓటేసిన నాయకులను అడగండి. నన్ను కాదు'అని సూచించారు.
కాశీ ఫోటోలపై 'నీచ' కామెంట్లు
కాశీ పర్యటన సందర్భంగా సంప్రదాయబద్ధంగా దిగిన ఫోటోలపై సోషల్ మీడియాలో షేర్ చేస్తే.. వాటిపై కూడా అసభ్యకర వ్యాఖ్యలు వచ్చాయని రేణు దేశాయ్ ఆవేదన వ్యక్తం చేశారు. అమ్మవారి దుస్తుల్లో ఉన్న ఫోటో కింద 'ఒక రాత్రికి రేటెంత?' అని అడిగారు. అసలు ఆ కామెంట్స్ రాయడానికి మీకు చేతులు ఎలా వచ్చాయి? అంటూ మండిపడ్డారు. తనపై మాత్రమే కాకుండా, ఏ సెలబ్రిటీ లేదా రాజకీయ నాయకుడి గురించైనా ఇలాంటి భాష వాడటం మానవత్వానికి విరుద్ధమని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇకపై సోషల్ మీడియాలో బూతులు రాస్తే స్క్రీన్‌షాట్లు తీసుకుని వారి ఇంటివరకు వెళ్తానని రేణు దేశాయ్ హెచ్చరించారు. 'మీ అమ్మానాన్నలకు చూపించి ఇదేనా మీరు నేర్పిన సంస్కారం అని అడుగుతాను' అని తీవ్రంగా స్పందించారు. 'నన్ను తిట్టడం వల్ల ఒక ప్రాణం అయినా నిలబడుతుందా? నిజంగా సమాజంపై బాధ ఉంటే రోడ్లు, ఆసుపత్రుల పరిస్థితిపై ఎమ్మెల్యేలను నిలదీయండి' అంటూ సవాల్ విసిరారు.
ఒక కుల వివాదంలో చిన్నారి మరణం జరిగిన సందర్భంలో కూడా తనను అనవసరంగా లాగడం బాధాకరమని ఆమె పేర్కొన్నారు. నాకేం సంబంధం? నేరం చేసిన వారిని అరెస్ట్ చేయించండని తెలిపారు. రేణు దేశాయ్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. సెలబ్రిటీలపై జరుగుతున్న ఆన్‌లైన్ వేధింపుల అంశం మరోసారి చర్చకు దారితీసింది. సోషల్ మీడియా స్వేచ్ఛ ఎంతవరకు? బాధ్యత ఎంతవరకు? అనే ప్రశ్నలు మళ్లీ ముందువస్తున్నాయి.


Click it and Unblock the Notifications











