నేను వదిలేయలేదు.. పవన్ కల్యాణ్ వదిలేశాడు.. రేణు దేశాయ్ సంచలన వ్యాఖ్యలు
విడిపోయారన్న మాటే గానీ.. పవన్ కళ్యాణ్ - రేణూ దేశాయ్‌లు అలా వ్యవహరించరు. తన మాజీ భార్య ఎక్కడున్నప్పటికీ పిల్లల యోగ క్షేమాలను తెలుసుకుంటూనే ఉంటారు పవన్ . ఆమె కూడా మాజీ భర్త సంగతులను కనుక్కుంటూ ముఖ్యమైన సందర్భాల్లో పవన్‌కు అభినందనలు తెలుపుతూ ఉంటారు రేణు దేశాయ్. అయితే కొందరు పవన్ ఫ్యాన్స్ మాత్రం వీరిద్దరి సత్సంబంధాలను చెడగొడుతూ ఉంటారు. ప్రతిసారి రేణు గడ్డిపెట్టిన ఏమాత్రం బుద్ధి తెచ్చుకోకుండా ఆమె చేత చీవాట్లు తినడానికి రెడీగా ఉంటారు. మరోసారి పవన్ అభిమానులపై రేణూ దేశాయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలేం జరిగిందంటే..?
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయం సాధించింది. బలమైన వైఎస్సార్‌సీపీని ఓడించి ఏపీలో అధికారంలోకి రావడంలోనూ, కేంద్రంలో నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానిగా బాధ్యతలు అందుకోవడంలోనూ పవన్ కళ్యాణ్‌ది కీలకపాత్ర. జనసేనాని అనే వ్యక్తి లేకుంటే వార్ వన్ సైడ్ అయ్యేది కాదనేది ప్రతి ఒక్కరి మాట.

అందుకే మోడీ అంతటి వాడు పవన్‌ను తుఫాన్ అంటూ పార్లమెంట్ వేదికగా ప్రశంసల వర్షం కురిపించారు. అలాగే పదేళ్ల నిరీక్షణకు తెరదించుతూ, ప్రత్యర్ధుల విమర్శలకు ఘాటుగా బదులిచ్చేలా పిఠాపురం నుంచి ఘన విజయం సాధించారు. పోటీ చేసిన 21 స్థానాల్లోనూ గెలుపొందిన పార్టీగా భారత రాజకీయ చరిత్రలోనే అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు.
ఈ పరిణామాలతో ఫ్యాన్స్‌కు పట్టపగ్గాలు లేకుండా ఉంది. ఫలితాలు విడుదలై రోజులు గడుస్తున్నా సోషల్ మీడియా ఇంకా పవన్ నామస్మరణతో హోరెత్తుతూనే ఉంది. ఎన్నికల ప్రచారంలోని పవన్ ప్రసంగాలు, పాత వీడియోలు విపరీతంగా ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు. అంతా బాగానే ఉంది కానీ కొందరు ఫ్యాన్స్ అత్యుత్సాహంతో రేణూ దేశాయ్‌ను వివాదంలోకి లాగుతున్నారు. తన మానాన తనదైన లోకంలో బతుకుతున్న ఆమెను వదిలివేయక.. పదే పదే వేధింపులకు గురిచేస్తున్నారు. మా అన్నతో ఉంటే బాగుండేది కదా.. అసలు అన్నయ్యని ఎందుకు వదిలేశావ్ అంటూ విసుగు తెప్పిస్తున్నారు.
తాజాగా రేణూ దేశాయ్ తన ఇంట్లో జరిపిన పండుగ, హోమం గురించి సోషల్ మీడియాలో పంచుకుంది. తానే స్వయంగా ప్రసాదాన్ని తయారుచేశానని, ఇలా చేయడం తనకు ఇష్టమని చెప్పుకుని సంబరపడింది. ఆ పోస్ట్‌కు ఓ పవన్ వీరాభిమాని ఇలా కామెంట్ పెట్టాడు. ''వదినగారు మీరు కొన్ని ఇయర్స్ ఓపిక పట్టుంటే బాగుండేది.. ఒక దేవుడ్ని పెళ్లి చేసుకుని ఆయన అంతరంగా తెలియకుండా వెళ్లిపోయారు. కానీ ఈరోజు ఆయన విలువ మీకు తెలిసింది. ఏది ఏమైనా విధి అంతా నిర్ణయిస్తుంది. ఈరోజు పిల్లలు అన్నయ్యతో ఉన్నారు , చాలు వదిన.. మేం మిమ్మల్ని మిస్ అవుతున్నాం వదిన '' అంటూ రాసుకొచ్చాడు.

ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కాగా.. దీనికి ఇంకొందరు పవన్ ఫ్యాన్స్ జత కలిసి ఇదే రకమైన కామెంట్లు పెట్టారు. దీంతో చిర్రెత్తుకొచ్చిన రేణూ దేశాయ్ ఘాటుగా రిప్లయ్ ఇచ్చారు. ''మీకు కొంచెమైనా బుద్ధి ఉంటే ఇలా అనేవారు కాదు.. ఆయనే నన్ను వదిలేసి వేరే పెళ్లి చేసుకున్నారు. నేను కాదు. దయచేసి ఇలాంటి కామెంట్లు పెట్టి నన్ను ఇంకా టార్చర్ చేయొద్దు '' అని ఆమె విజ్ఞప్తి చేశారు. అప్పటికి కూడా బుద్ధి తెచ్చుకోకుండా ఇంకోకడు '' సూపర్ అమ్మ మీరు.. అన్న దగ్గర లేకపోయినా బాగా పూజలు చేస్తున్నారని కామెంట్ చేశాడు.
దానికి కూడా రేణూ దేశాయ్ బదులిచ్చారు. ''అన్న దగ్గర లేకపోయినా.. అంటే అర్ధం ఏంటీ..? నాకు సొంత లైఫ్ ఉండదా..? మీరు ఇలాంటి కామెంట్లు పెట్టి నన్ను బాధపెడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో సోషల్ మీడియాలో కొందరు రేణూ దేశాయ్‌కి బాసటగా నిలబడుతున్నారు. పవన్ ఈ విషయంలో అభిమానులను వారించాలని , లేనిపక్షంలో రేణూదేశాయ్‌పై మాటల దాడికి ఫుల్‌స్టాప్ పడదని సూచిస్తున్నారు.


Click it and Unblock the Notifications











