రేపో మాపో చనిపోతా.. కానీ పిల్లల పరిస్థితి ఏంటి? రేణుదేశాయ్ వీడియో వైరల్
తెలంగాణ ప్రభుత్వంపై విద్యార్థి సంఘాలు, సినీ తారలు, సామాజిక కార్యకర్తలు భగ్గుమంటున్నాయి. ప్రఖ్యాత హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిసర ప్రాంతాల్లోని 400 ఎకరాల అటవీ, జంతువులు, పక్షులు ఉన్న భూమిని చదును చేయడంపై అన్ని వర్గాల నుంచి నిరసన వ్యక్తమవుతున్నది. సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు ధర్నాలు చేపట్టారు. వారిని ప్రభుత్వం అరెస్ట్ చేస్తున్నది. ఈ క్రమంలో సినీ తారలందరూ రేవంత్ రెడ్డికి విన్నపాలు చేస్తూ వీడియోలు పెడుతున్నారు. తాజాగా రేణు దేశాయ్ విడుదల చేసిన వీడియో వివరాల్లోకి వెళితే..
అందరికి నమస్తే.. ప్రజల నుంచి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హృదయపూర్వకమైన వినతి. రియల్ ఎస్టేట్ కోసం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోని 400 ఎకరాల్లోని అరుదైన చెట్లు నరికివేస్తూ, జంతువులు, పక్షులను గూడు లేకుండా చేస్తున్న తీరు గురించి నా దృష్టికి వచ్చింది. ఆ సంఘటన గురించి కొన్ని విషయాలు తెలుసుకొన్నాను. ఆ తర్వాతే ఈ వీడియో చేస్తున్నాను అని రేణు దేశాయ్ అన్నారు.

హెచ్‌సీయూలో చెట్ల నరికివేతను ఆపాలని నేను ఓ తల్లిగా అభ్యర్థిస్తున్నాను. నా వయసు 44 సంవత్సరాలు. నేను రేపో మాపో చనిపోతాను. మన భవిష్యత్ తరాలకు నీరు, ఆక్సిజన్ కావాలి. అభివృద్ది అనేది అవసరమే. అందులో ఎలాంటి సందేహం అక్కర్లేదు. మనకు సాఫ్ట్ వేర్ కంపెనీలు కావాలి. ఎత్తైన భవనాలు ఉండాలి. కానీ ఈ 400 ఎకరాలను వదిలేసి మరో చోట భూమిని కేటాయించండి అని రేణు దేశాయ్ రిక్వెస్ట్ చేశారు.
తెలంగాణ రాష్ట్ర పౌరురాలిగా నేను ప్రాధేయపడుతున్నాను. ఈ ప్రాజెక్టు పనులను దయచేసి ఆపేయండి. మీరు ఏదో ఒక నిర్ణయం తీసుకొని ఈ పనులు నిలిపివేయండి. మన రాష్ట్రంలో, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో బీడు భూములు చాలానే ఉన్నాయి. వాటిని కేటాయించండి. మా కంటే మీకే అనుభవం ఎక్కువ. డెవలప్‌మెంట్ తప్పనిసరిగా కావాలి. సిటీ అభవృద్ది కావాల్సిందే అని రేణు దేశాయ్ అన్నారు.
హైదరాబాద్ నగరానికి ఆక్సిజన్ కావాలి. పర్యావరణం అత్యంత అవసరం. గ్రీన్ ఎన్విరాన్‌మెంట్ ఉన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను వదిలేయాలని నేను కోరుతున్నాను. ఇది ముఖ్యమంత్రి, మంత్రులు, ఉన్నతాధికారులకు ఓ తల్లిగా, భవిష్యత్ తరాల మంచిని కోరే వ్యక్తిగా నా హృదయపూర్వక విన్నపం అని రేణు దేశాయ్ వీడియోను రిలీజ్ చేశారు.
ఇదిలా ఉండగా, హెచ్‌సీయూ వివాదంపై పలువురు సినీ తారలు వీడియోలు రిలీజ్ చేసి ప్రభుత్వానికి సలహాలు, సూచనలు అందిస్తున్నారు. సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలోని భూముల్లో అరుదైన జంతు, జీవాలు ఉన్నాయి. అరుదైన ఔషద మొక్కలు ఉన్నాయి. వాటిని నిర్ధాక్షిణ్యంగా నరికివేతకు పాల్పడకూడదని రష్మీ గౌతమ్, నాగ్ అశ్విన్ తదితరులు రిక్వెస్ట్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











