ఆ విషయంలో తప్పు చేశా.. స్టేజ్‌పై పాయల్ రాజ్‌పుత్ కన్నీళ్లు..
తెలుగు ప్రేక్షకులకు RX 100 సినిమాతో సుపరిచితమైన హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ (Payal Rajput). సినిమాలో తన అందం, అభినయంతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది ఈ వయ్యారి. ఆర్ఎక్స్ 100 సినిమాలో పాయల్ బోల్డ్ సీన్స్ లో రెచ్చిపోయి నటించింది. దీంతో ఓవర్‌నైట్ స్టార్‌గా మారింది. ఆతర్వాత ఈ చిన్నది చేసిన సినిమాలన్నీ నిరాశపరిచాయి. ఆర్ఎక్స్ 100తర్వాత వరుసగా ఎన్టీఆర్: కథానాయకుడు, వెంకీ మామా, డిస్కో రాజా, అనగనగా ఓ అతిథి, తీస్ మార్ ఖాన్, జిన్నా, మాయాపేటిక, మంగళవారం, రక్షణ సినిమాలు చేసింది. కానీ అంతగా గుర్తింపు రాలేదు. దీంతో బాలీవుడ్ లో అడుగుపెట్టింది. ఇదిలా ఉంటే .. తాజాగా ఓ సినిమా ఈవెంట్‌లో భావోద్వేగానికి లోనవడం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇంతకీ ఏం జరిగింది?
హేమంత్ ఇప్పలపల్లి దర్శకత్వంలో రూపొందిన 'ఫస్ట్ టైమ్ 01-01-01' సినిమా ట్రైలర్ లాంచ్ వేడుక మంగళవారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ చిత్రంలో పాయల్ రాజ్‌పుత్ చిన్ననాటి స్నేహితుడు సౌరభ్ ధింగ్రా హీరోగా నటిస్తున్నారు. స్నేహితుడికి మద్దతుగా ముఖ్య అతిథిగా హీరోయిన్ పాయల్ హజరయ్యారు. సినిమా విజువల్ ఎఫెక్ట్స్, కథాంశం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ సమయంలో ఓ రిపోర్ట్ ఆమె గతంలో చేసిన విపాసన ధ్యానం గురించి ప్రశ్నించడంతో, పాయల్ తన వ్యక్తిగత జీవితంలోని బాధాకరమైన జ్ఞాపకాల్లోకి వెళ్లిపోయారు.

ముఖ్యంగా తన తండ్రి గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. 'నా జీవితంలో నిజమైన హీరో మా నాన్నే. నేను చేసిన ప్రతి సినిమాను ఆయన ఎంతో శ్రద్ధగా చూసేవారు. నేను ఎంత బోల్డ్ పాత్ర చేసినా ఆయన నన్ను ఎప్పుడూ ప్రోత్సహించేవారు' అని చెప్పింది. ఈ సమయంలో తన భావోద్వేగాన్ని అదుపు చేసుకోలేక వెక్కి వెక్కి ఏడ్చారు. ఇటీవల విడుదలైన తన పంజాబీ సినిమాను కూడా చూడాలని ఆయన ఎంతో ఆసక్తిగా ఉన్నారని, కానీ ఆ కోరిక నెరవేరకుండానే ఆయన ఈ లోకం విడిచిపెట్టారని చెప్పినప్పుడు ఆమె బాధ స్పష్టంగా కనిపించింది.
పాయల్ తండ్రి విమల్ కుమార్ రాజ్ పుత్ గత ఏడాది జూలై 28న కన్నుమూశారు. ఆయన అన్నవాహిక క్యాన్సర్ (Esophageal Carcinoma)తో పోరాడుతూ 67 ఏళ్ల వయసులో మరణించారు. తండ్రి అనారోగ్యం సమయంలో కుటుంబం ఎదుర్కొన్న కష్టాలు,తల్లి బాధ అన్ని కలిసి ఆమె మానసిక ఒత్తిడికి లోనైంది. ఆ బాధను తట్టుకోలేక ఆమె కొంతకాలం డిప్రెషన్‌లోకి వెళ్లినట్లు కూడా వెల్లడించారు. ఆ స్థితి నుంచి బయటపడేందుకు ఆమె జైపూర్‌లో చికిత్స తీసుకోవాల్సి వచ్చింది.
ఈ కఠిన సమయంలో ఆమెకు ఆధారం అయినది విపాసన ధ్యానం ( Vipassana Meditation). సుమారు 2500 ఏళ్ల క్రితం గౌతమ బుద్ద పరిచయం చేసిన ఈ ధ్యాన పద్ధతి. మనస్సును శుద్ధి చేసుకోవడంలో సహాయపడుతుంది. "ఉన్నది ఉన్నట్లుగా చూడటం" అనే సూత్రంపై ఆధారపడిన ఈ సాధనలో, సాధకులు పది రోజుల పాటు మౌనం పాటిస్తూ తమ శ్వాస, భావాలపై దృష్టి కేంద్రీకరిస్తారు. ఈ విధానం ద్వారా ఒత్తిడిని తగ్గించుకుని, భావోద్వేగాలను సమతుల్యంగా స్వీకరించే శక్తి పెరుగుతుందని నమ్మకం. తన తండ్రి మరణంతో కలిగిన దుఃఖాన్ని జీర్ణించుకోవడంలో ఈ ధ్యానం కీలక పాత్ర పోషించిందని పాయల్ తెలిపింది.
ఈ సందర్భంగా ఆమె తన కెరీర్ గురించీ ఓపెన్‌గా మాట్లాడింది. తండ్రి మరణం తర్వాత తాను సరైన నిర్ణయాలు తీసుకోలేకపోయానని, అందుకే తెలుగు సినిమాల్లో కొంత గ్యాప్ వచ్చిందని అంగీకరించింది. టాలీవుడ్ నుంచి వచ్చిన కొన్ని అవకాశాలను వదులుకోవడం తన తప్పేనని ఒప్పుకుంది. ఇకపై కథల ఎంపికలో జాగ్రత్తగా ఉంటానని, మంచి ప్రాజెక్ట్స్ కోసం ఎదురు చూస్తున్నానని వెల్లడించింది.
ఇక ఈ ఈవెంట్‌లో ఆమె ప్రవర్తన చూసి అక్కడున్నవారు కూడా ఎమోషనల్ అయ్యారు. సాధారణంగా చలాకీగా, నవ్వుతూ కనిపించే పాయల్ ఇలా వేదికపై కన్నీళ్లు పెట్టుకోవడం అందరినీ కదిలించింది. ఓదార్చే ప్రయత్నాలు చేసినా, తన భావోద్వేగాన్ని అదుపు చేసుకోలేక చివరకు ఆమె స్టేజ్ నుంచి వెళ్లిపోవాల్సి వచ్చింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications