ఆ విషయంలో చాలా బాధపడ్డా.. సాయిపల్లవి ఎమోషనల్ కామెంట్స్!
లేడీ పవర్‌స్టార్, నటి సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టాలీవుడ్, కోలీవుడ్‌లతో తనకంటూ ప్రత్యేక క్రేజ్‌ను సొంతం చేసుకొని ఈ అమ్మడు బాలీవుడ్‌లోనూ పాగా వేసింది. ప్రస్తుతం ప్రస్తుతం హిందీలో రణబీర్ కపూర్ సరసన 'రామాయణ' చిత్రంలో సీతగా నటిస్తున్నారు. అంతే కాకుండా ఆమిర్‌ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ మూవీలోనూ నటిస్తుంది. జునైద్, సాయిపల్లవి జంటగా నటించిన 'ఏక్‌దిన్'తో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. తాజాగా ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న ఈ అమ్మడు నాలుగేళ్ల క్రితం జరిగిన ఓ షాకింగ్ సంఘటనను అభిమానులతో పంచుకున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే?
సాయి పల్లవి తన సహజ నటనతో, డాన్స్‌తో, సింప్లిసిటీతో దేశవ్యాప్తంగా కోట్లాది అభిమానులను సంపాదించుకున్న స్టార్ హీరోయిన్. సౌత్ ఇండియాలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ అందాల నటి, ఇప్పుడు బాలీవుడ్‌లో కూడా తన మార్క్ చూపించేందుకు సిద్ధమవుతోంది. అయితే కెరీర్‌లో విజయాలు అందుకుంటున్న ఈ సమయంలో, తన గురించి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫేక్ న్యూస్‌పై తాజాగా ఆమె స్పందించిన తీరు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

తమిళనాడులోని కోయంబత్తూర్ కు చెందిన సాయి పల్లవి మొదట వైద్య విద్యను పూర్తి చేశారు. తరువాత సినీరంగంలో అడుగుపెట్టి ప్రేమమ్ (Premam) సినిమాతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ చిత్రంలో ఆమె నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అక్కడి నుంచి తెలుగు, తమిళ భాషల్లో వరుస అవకాశాలు అందుకుని అగ్ర కథానాయికగా ఎదిగారు. ఆ తరువాత ఫిదా, లవ్ స్టోరీ, శ్యామ్ సింగరాయ్, విరాట పర్వం వంటి సినిమాలతో నటిగా తన ప్రత్యేకతను చాటుకున్నారు. గ్లామర్ కంటే నటనకే ప్రాధాన్యత ఇచ్చే హీరోయిన్‌గా ఆమెకు ప్రత్యేక గుర్తింపు ఉంది.
ఇప్పుడు హిందీలో కూడా అడుగుపెడుతూ కొత్త ప్రయాణం మొదలుపెట్టారు. ప్రస్తుతం రామాయణ(Ramayana) సినిమాలో సీత పాత్రలో నటిస్తున్న సాయి పల్లవి, మరోవైపు ఏక్ దిన్ (Ek Din)సినిమాతో హిందీ ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సమయంలోనే గతంలో తాను చేసిన ఒక వ్యాఖ్యను వక్రీకరించి సోషల్ మీడియాలో వైరల్ చేయడం తనను తీవ్రంగా బాధించిందని ఆమె చెప్పుకొచ్చారు.
కొన్నేళ్ల క్రితం ఓ ఇంటర్వ్యూలో.. "మీరు మలయాళి కదా.. తెలుగులో ఎలా మాట్లాడగలుగుతున్నారు?" అని అడిగిన ప్రశ్నకు సాయి పల్లవి సమాధానం ఇచ్చారు. అందులో తాను "నేను మలయాళి కాదు.. తమిళ అమ్మాయిని" అని మాత్రమే చెప్పానని తెలిపారు. తన మాతృభాష తమిళం అని, తాను కోయంబత్తుర్ లో పుట్టి పెరిగానని చెప్పడమే తన ఉద్దేశమని వెల్లడించారు.
అయితే అదే వ్యాఖ్యను కొందరు తప్పుగా అర్థం చేసుకుని, "మలయాళి అని పిలిస్తే కోపపడింది", "ఇతర భాషలను అవమానించింది" అంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. "ఆ ఫేక్ న్యూస్ చూసి నేను షాక్ అయ్యాను. నేను ఎప్పుడూ చెప్పని మాటలను నా పేరుతో ప్రచారం చేయడం చాలా బాధ కలిగించింది" అని సాయి పల్లవి పేర్కొన్నారు. ఇంకా మాట్లాడుతూ, 'నేను ఎప్పుడూ ఏ భాషను, ఏ ప్రజలను అవమానించే ఉద్దేశంతో మాట్లాడలేదు. ప్రతి భాషకు, ప్రతి సంస్కృతికి నాకు గౌరవమే ఉంది. నేను తమిళ అమ్మాయిని అని మాత్రమే చెప్పాను'అని క్లారిటీ ఇచ్చారు.
సాయి పల్లవి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చాలా మంది అభిమానులు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. సెలబ్రిటీల మాటలను వక్రీకరించి ప్రచారం చేయడం ఎంత బాధాకరమో ఈ ఘటన మరోసారి చూపించిందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications