ఆ పాత్రకు నేను సెట్ కాలేదనిపించింది.. సాయి పల్లవి ప్రశ్చాత్తాపం..
లేడీ సూపర్ స్టార్, న్యాచులర్ బ్యూటీ సాయి పల్లవి (Sai Pallavi) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గ్లామర్ షోలకు దూరంగా ఉంటూనే కేవలం తన నటన, డ్యాన్స్, భావోద్వేగాల ప్రదర్శనతో కోట్లాది అభిమానులను సంపాదించుకున్నది ఈ నటి. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. అయితే సౌత్‌లో అద్భుతమైన ఇమేజ్ సంపాదించిన సాయి పల్లవి, బాలీవుడ్ ఎంట్రీ విషయంలో మాత్రం అనుకున్న ఫలితం అందుకోలేకపోయింది. ఆమె తొలిసారి హిందీలో నటించిన ఏక్ దిన్ (Ek Din) సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఈ ఫెయిల్యూర్ పై హీరోయిన్ సాయి పల్లవి తొలి సారి స్పందించారు. ఇంతకీ ఏమన్నారంటే?
ఏక్ దిన్ (Ek Din) సినిమాలో జూనైద్ ఖాన్ (Junaid Khan)హీరోగా నటించారు. ముఖ్యంగా ఆమీర్ ఖాన్ ప్రొడక్షన్ హౌస్ నిర్మించిన సినిమా కావడంతో 'ఏక్ దిన్'పై ప్రారంభం నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే విడుదల తర్వాత ఈ సినిమా మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. కథ, కథనంపై విమర్శలు రావడంతో పాటు, ముఖ్యంగా సాయి పల్లవి పాత్రను చాలా పేలవంగా డిజైన్ చేశారనే కామెంట్స్ వినిపించాయి. సహజ నటిగా పేరున్న సాయి పల్లవి కూడా ఆ పాత్రలో పూర్తిగా మెరవలేకపోయిందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

ఈ నేపథ్యంలో ఈ సినిమా గురించి సాయి పల్లవి చేసిన వ్యాఖ్యలు మరింత హాట్ టాపిక్‌గా మారాయి. సాధారణంగా హీరోయిన్లు తమ సినిమాల వైఫల్యాలపై బహిరంగంగా మాట్లాడటానికి వెనుకాడుతుంటారు. కానీ సాయి పల్లవి మాత్రం తనకు అనిపించిన విషయాన్ని నిజాయితీగా ఒప్పుకోవడం అభిమానులను ఆకట్టుకుంటోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె, 'ఏక్ దిన్' సినిమా ఎందుకు అంగీకరించాల్సి వచ్చిందో వివరంగా చెప్పుకొచ్చారు.
ఆమె మాట్లాడుతూ.. "ఆ సమయంలో నేను వరుసగా చాలా ఎమోషనల్ సినిమాలు చేస్తున్నాను. మానసికంగా కూడా కాస్త ఒత్తిడిగా అనిపించింది. అందుకే హాయిగా ఉండే, తేలికపాటి ప్రేమకథలో నటించాలని అనుకున్నాను. అప్పుడు 'ఏక్ దిన్' కథ నా దగ్గరకు వచ్చింది. ఈ స్క్రిప్ట్ విన్నప్పుడు నాకు హాలీవుడ్ క్లాసిక్ బిఫోర్ సన్ రైజ్ (Before Sunrise) గుర్తుకు వచ్చింది. ఆ సినిమా అంటే నాకు చాలా ఇష్టం. అందుకే వెంటనే ఈ ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పాను" అని వెల్లడించారు.
అయితే సినిమా ప్రీమియర్ చూసిన తర్వాత మాత్రం తనకు పెద్ద షాక్ తగిలిందని సాయి పల్లవి చెప్పడం ఇప్పుడు వైరల్ అవుతోంది. "సినిమా మొత్తం చూసాక ఈ పాత్రకు నేను పూర్తిగా సరిపోలేదేమో అనిపించింది. ఇదే విషయాన్ని ఆమిర్ ఖాన్‌కి కూడా చెప్పాను. నా బదులు చురుగ్గా, హుషారుగా ఉండే మరో కొత్త హీరోయిన్‌ను తీసుకుని ఉంటే ఆ పాత్రకు మరింత న్యాయం జరిగేదేమో అనిపించింది" అని ఆమె నిజాయితీగా చెప్పుకొచ్చారు.
ఇదే ఇంటర్వ్యూలో పాల్గొన్న జునైద్ ఖాన్ మాత్రం సాయి పల్లవికి పూర్తి మద్దతు ఇచ్చారు. "ఈ పాత్రకు సాయి పల్లవే సరైన ఎంపిక. ఆమె అద్భుతంగా నటించింది" అని ప్రశంసించారు. అయినప్పటికీ సాయి పల్లవి మాత్రం తన నటనపై తానే విమర్శలు చేసుకోవడం ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి సాయి పల్లవికి హిందీ నుంచి ఇది తొలి ఆఫర్ కాదు. గతంలో కూడా అనేక బాలీవుడ్ అవకాశాలు వచ్చినా, కథలు నచ్చకపోవడం వల్ల ఆమె వాటిని తిరస్కరించినట్లు సమాచారం.
అయితే ఆమిర్ ఖాన్ బ్యానర్, మంచి కథ అనే నమ్మకంతోనే ఈ సినిమాకు అంగీకరించిందని తెలుస్తోంది. కానీ చివరికి ఫలితం మాత్రం ఆశించిన విధంగా రాకపోవడంతో ఇప్పుడు ఆమె కూడా కొంత నిరాశకు గురైనట్లు కనిపిస్తోంది. అయితే ఈ మొత్తం వ్యవహారంలో సాయి పల్లవి నిజాయితీ మాత్రం అందరినీ ఆకట్టుకుంటోంది.
చాలా మంది నటీనటులు సినిమా ఫ్లాప్ అయితే ప్రేక్షకులపై లేదా ఇతర కారణాలపై నెపం వేస్తుంటారు. కానీ సాయి పల్లవి మాత్రం తనకు తాను సరిపోలేదని ఓపెన్‌గా ఒప్పుకోవడం ఆమె వ్యక్తిత్వానికి నిదర్శనంగా అభిమానులు భావిస్తున్నారు. ఇకపై తన ఇమేజ్, నటనకు సరిపోయే పాత్రలనే మరింత జాగ్రత్తగా ఎంపిక చేసుకుంటే సాయి పల్లవి బాలీవుడ్‌లోనూ టాప్ ఫ్లేస్ లో నిలిచే అవకాశం ఉందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.


Click it and Unblock the Notifications






