Sai Pallavi: సాయిపల్లవి ముందు కుప్పిగంతులా... లేడీ పవర్‌స్టార్ సూపర్ ఎస్కేప్!
100 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన భారతీయ చిత్ర పరిశ్రమలో నాటి నుంచి నేటి వరకు ఎందరో హీరోయిన్లు వచ్చారు, వెళ్లారు. కానీ కొందరు మాత్రమే ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేశారు. ఇలాంటి వారిలో లేడీ పవర్‌స్టార్ సాయిపల్లవి కూడా ఒకరు. ఎక్స్‌పోజింగ్, గ్లామర్ షోకు దూరంగా కేవలం నటనకు ప్రాధాన్యమున్న పాత్రల్లో నటిస్తూ విలక్షణ నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు సాయిపల్లవి. ఆమె ఓ సినిమా చేసిందంటే ఖచ్చితంగా అందులో ఏదో ఒక విషయం ఉంటుందని ప్రేక్షకులు అనుకుంటారంటే సాయిపల్లవి వేసిన ముద్రను అర్ధం చేసుకోవచ్చు. నటనలోనూ తెలివి, సమయస్పూర్తి విషయంలోనూ తాను టాప్ ప్లేస్‌లో ఉన్నానని రుజువు చేసుకున్నారు. ఈ వివరాల్లోకి వెళితే..
సాయిపల్లవి మల్టీ టాలెంటెడ్.. డ్యాన్సర్‌గా, నటిగానే కాదు ఆమె స్వతహాగా డాక్టర్. ఎంబీబీఎస్ పూర్తి చేసి సినీరంగంలోకి అడుగుపెట్టారు. డాక్టర్ కాబోయి యాక్టర్ అయినవాళ్లకు రివర్స్‌లో డాక్టర్ అయి ఇండస్ట్రీలోకి వచ్చిన అరుదైన నటి సాయిపల్లవి. డ్యాన్స్ అంటే ఎంతో ఇష్టపడే సాయిపల్లవి తొలుత విజయ్ టీవీలో ఓ డ్యాన్స్ షోలో పార్టిసిపేట్ చేశారు. ఆ తర్వాత 2009లో ఈటీవీలో ప్రసారమైన పాపులర్ డ్యాన్స్ ఢీ అల్టిమేట్ డ్యాన్స్ షో పాల్గొన్నారు. అంతకుముందు కస్తూరి మాన్, ధామ్ ధూమ్ అనే సినిమాల్లో చిన్న పాత్రల్లో మెరిశారు.

2015లో వచ్చిన మలయాళ చిత్రం ప్రేమమ్‌తో వెండితెరపైకి అడుగుపెట్టారు సాయిపల్లవి. తర్వాత పిదా మూవీతో తెలుగువారిని పలకరించిన ఆమె.. అనంతరం పడిపడి లేచే మనసు, లవ్‌స్టోరీ, శ్యామ్ సింగరాయ్, విరాటపర్వం, తండేల్, అమరన్, ఏక్ దిన్ చిత్రాలతో నటనలోనూ, డ్యాన్స్‌లోనూ తనకు తిరుగులేదని నిరూపించుకున్నారు. ప్రస్తుతం హిందీలో రామాయణ సిరీస్‌తో పాటు ధనుష్ 55వ చిత్రంలో నటిస్తున్నారు సాయిపల్లవి. అలాగే ప్రభాస్- నాగ్ అశ్విన్‌ల పాన్ ఇండియా మూవీ కల్కి 2లోనూ దీపిక పదుకొనె పోషించిన పాత్ర కోసం సాయిపల్లవిని తీసుకునే అవకాశాలు లేకపోలేదు.
ఇకపోతే... ఫిలింఫేర్ సౌత్ అవార్డ్స్ వేడుకలో భాగంగా అమరన్ చిత్రానికి గాను ఉత్తమ నటిగా అవార్డ్ అందుకున్నారు సాయిపల్లవి. దాంతో ఆమె ఖాతాలో 7 ఫిలింఫేర్ అవార్డులు చేరాయి. ఒకే నటి వేర్వేరు భాషల్లో ఫిలింఫేర్ అవార్డులు అందుకోవడం అరుదైన రికార్డ్. చేసింది తక్కువ సినిమాలే అయినా ఏకంగా 7 ఫిలింఫేర్ అవార్డ్‌లు అందుకోవడం నిజంగా సంచలనమే. ఆమె ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కూడా భారీ చిత్రాలు కావడంతో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మరిన్ని ఫిలింఫేర్‌లో సాయిపల్లవి ఖాతాలో పడతాయి అనడంలో అతిశయోక్తి లేదు.
కాగా.. సినీతారలను అభిమానులు మనదేశంలో ఎలా ఆదరిస్తారో తెలిసిందే. అలాంటిది పబ్లిక్ ప్లేస్‌లో తమ ఫేవరెట్ స్టార్స్ కనిపిస్తే ఏమైనా ఉందా? వారితో సెల్ఫీ దిగేందుకు, ఆటోగ్రాఫ్ తీసుకునేందుకు ఎగబడతారు. అయితే ఇటీవలి కాలంలో బహిరంగ ప్రదేశాల్లో నటీనటులతో కొందరు అభిమానులు అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఘటనలు ఎక్కువ అవుతున్నాయి. తాజాగా తనను చుట్టుముట్టిన అభిమానుల నుంచి సాయిపల్లవి తెలివిగా తప్పించుకున్నారు. ఇటీవల ఓ ఎయిర్‌పోర్ట్‌లో సాయిపల్లవి కనిపించగానే కొందరు ఆమెను రౌండప్ చేశారు. ఈ సందర్భంగా వారితో ఆమె సరదాగా ముచ్చటిస్తూ ఉంది. ఇంతలో మరింత మంది అక్కడ గుమిగూడుతున్నారు.
అయితే మీడియా కెమెరాలతో పాటు చుట్టుపక్కల వారు తనను ఫోటోలు తీయడం, వీడియోలు తీయడం వంటివి చేస్తుండటంతో సాయిపల్లవి అప్రమత్తమయ్యారు. తొలుత వాటికి ఫోజులు ఇస్తున్నట్లుగా నటించి అదను చూసి ఒక్కసారిగా అక్కడి నుంచి కారు వైపు పరుగులు తీసి ఆలస్యం చేయకుండా కారులో కూర్చొని డోర్ లాక్ చేసేసింది. అయినప్పటికీ అభిమానులు వదలకుండా ఆమెను వెంబడిస్తూ పరుగులు తీసి సాయిపల్లవి కారులోకి వెళ్లిపోవడంతో నిరాశ వ్యక్తం చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. సెల్ఫీలు దిగుతున్నవారిపై ఏమాత్రం చిరాకు పడకుండా, అక్కడ ఎలాంటి న్యూసెన్స్‌కు తావు ఇవ్వకుండా సాయిపల్లవి తెలివిగా వ్యవహరించారని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.


Click it and Unblock the Notifications











