ఆ రోజు నాన్న ఆసుపత్రిలో.. ఆ బాధను ఎలా దిగమింగానంటే..సమంత ఎమోషనల్
హీరోయిన్ సమంత త్వరలో 'ఓ బేబీ' సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. నందీని రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం జులై 5న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తన కెరీర్లో చేసిన అద్భుతమైన సబ్జెక్టుల్లో ఇదీ ఒకటని, పుల్ లెంత్ కామెడీతో ఈ చిత్రం ప్రేక్షకులకు వినోదం పంచుతుందని ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు సామ్.
తాజాగా ప్రేమ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమంత... 'ఓ బేబీ' గురించి మరిన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు. నిర్మాత సునీతా తాటి నా దగ్గరకు వచ్చి కొరియన్ మూవీ సినిమా చూపించారు. అది చూసినపుడే ఇదొక యూనివర్శల్ అప్పీల్ ఉన్న సబ్జెక్ట్ అనిపించింది.' అన్నారు.

కచ్చితంగా ఈ సినిమా చేయాలని డిసైడ్ అయ్యాను
‘‘ఒక మంచి సబ్జెక్టును కామికల్ వేలో చూపించిన విధానం చాలా నచ్చింది. అందుకే కచ్చితంగా ఈ సినిమా చేయాలని డిసైడ్ అయ్యాను. నాకు ఎప్పటి నుంచో ఫుల్ లెంత్ కామెడీ మూవీ చేయాలని ఉండేది. ‘అ..ఆ' మూవీలో లైట్‌గా కామెడీ చేశాను. ఫుల్ లెంత్ కామెడీ చేయడానికి ఈ మూవీ బెస్ట్ ఆప్షన్ అనిపించింది.'' అని సమంత చెప్పుకొచ్చారు.

ఆమె మాత్రమే బాగా హ్యాండిల్ చేయగలరు అనిపించింది
‘‘కొరియన్ మూవీ చూసిన వెంటనే నాకు నందినీ రెడ్డి గుర్తుకు వచ్చారు. ఆమె ఈ సబ్జెక్టును బాగా హ్యాండిల్ చేయగలరు అనిపించింది. ఎందుకంటే ఇది లేడీస్‌కు సంబంధించిన సబ్జెక్ట్. ఆమె అయితే ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ప్రేక్షకులకు నచ్చే విధంగా ప్రజంట్ చేస్తారు అనిపించింది.'' అని తెలిపారు.

పాత్రలో ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యా... ధనరాజ్‌ను కొట్టేశాను
సినిమా షూటింగులో ఓ సీన్ చిత్రీకరిస్తుండగా ధనరాజ్ గారిని నిజంగా కొట్టారంటకదా... అనే ప్రశ్నకు సమంత స్పందిస్తూ ‘‘కావాలని కొట్టలేదు.. అనుకోకుండా నేను పాత్రలో ఇన్వాల్వ్ అయిపోవడంతో నా దెబ్బకు అతడి గ్లాసెస్ ఎగిరిపోయాయి.'' అన్నారు.

ఆ రోజు బాధను దిగమింగాను
టైటిల్ సాంగ్ షూటింగ్ సమయంలో మా ఇంటి నుంచి నాన్నకు ఆరోగ్యం బాగోలేదు, ఆసుపత్రిలో చాలా సీరియస్‌గా ఉన్నారనే ఫోన్ వచ్చింది. కానీ ఆరోజు వెళ్లలేని పరిస్థితి ఉంది. ఒక మాల్‌లో చాలా మంది జూనియర్ ఆర్టిస్టులతో కలిసి షూటింగ్ జరుగుతోంది. నిర్మాతలు ఆ రోజు షూటింగ్ మీద చాలా డబ్బు ఇన్వెస్ట్ చేశారు. బాధను దిగమింగి షూటింగులో పాల్గొన్నట్లు... సమంత గుర్తు చేసుకున్నారు.

ఇక్కడ మధ్యలో వెళ్లిపోవడం కుదరదు
సినిమా షూటింగ్ జరుగుతుంటే నాకు ఒంట్లో బాగోలేదు, మూడ్ బాగోలేదు అని వెళ్లపోవడం వీలు కాదు. ఒక రోజు షూటింగ్ మొదలైందంటే ఎంతో డబ్బు ఇన్వెస్ట్ చేస్తారు. మనం షూటింగ్ నిలిపి వేస్తే చాలా నష్టం ఉంటుంది. పైగా ఇది చిన్న బడ్జెట్ సినిమా... నాకు వెళ్లడం వీలు కాలేదు. సినిమా షూటింగ్ చేస్తూనే మధ్యలో ఫోన్ ద్వారా నాన్న ఆరోగ్యం గురించి తెలుసుకోవడం, డాక్టర్లతో మాట్లాడటం చేశాను. నాన్న ఆరోగ్యం ఇపుడు బావుంది... అని సమంత తెలిపారు.


Click it and Unblock the Notifications











