ఒకే వేదికపై పాత మిత్రుల కలయిక.. కాజల్‌ని చూసి సమంత భావోద్వేగం
వ్యక్తిగత సమస్యలు, ఇతర కారణాలతో గత కొంతకాలంగా టాలీవుడ్‌కు దూరంగా ఉన్న అగ్రనటి సమంత తిరిగి తెలుగు చిత్ర పరిశ్రమపై ఫోకస్ పెట్టారు. తన సొంత నిర్మాణ సంస్థ ట్రాలాలా మూవీంగ్ పిక్చర్స్ బ్యానర్‌పై స్వయంగా నిర్మించిన మా ఇంటి బంగారం సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించనున్నారు సమంత. రాజ్ నిడిమోరు, సమంత, హిమాండ్ దువ్వూరులు కలిసి మా ఇంటి బంగారం సినిమాను నిర్మిస్తున్నారు. శ్రీముఖి, గుల్షన్ దేవయ్య, దిగంత్ మంచాలే, గౌతమి తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. సంతోష్ నారాయణన్ సంగీత దర్శకత్వం వహించగా.. ధర్మేంద్ర కాకర్ల ఎడిటర్‌గా వ్యవహరించారు. జూన్ 19న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషనల్ కార్యక్రమాల్లో సామ్ బిజీగా గడుపుతున్నారు.
సినీరంగంలో స్నేహ బంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎంతోమంది దర్శకులు, హీరోలు, హీరోయిన్ల మధ్య మంచి ఫ్రెండ్‌షిప్ ఉంది. సందర్భం వచ్చినప్పుడల్లా వీరు తమ మిత్రుల గురించి గొప్పగానే చెప్పుకుంటూ ఉంటారు. సమంతకు కూడా ఇండస్ట్రీలో కొందరు బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు. సింగర్ చిన్మయి, దర్శకురాలు బీవీ నందినీ రెడ్డి తదితరులతో ఆమె స్నేహం గురించి తెలిసిందే. అలాగే పలువురు హీరోయిన్లతోనూ సమంత సన్నిహితంగా ఉంటారు. వీరిలో కీర్తి సురేష్, కాజల్ అగర్వాల్ కూడా ఉన్నారు.

సమంత - కాజల్‌లు కూడా తమ ఫ్రెండ్‌షిప్ గురించి పలుమార్లు బయటపెట్టారు. వీరిద్దరూ కలిసి బ్రహ్మోత్సవం, బృందావనం, మెర్సెల్ తదితర చిత్రాల్లో కలిసి నటించారు. వీరిద్దరూ సినిమాలతో పాటు వ్యక్తిగతంగానూ ఒకరిపై ఒకరు అభిమానాన్ని బయటపెట్టడంతో పాటు అండగా నిలిచేవారు. గతంలో కాజల్ అగర్వాల్ గర్బం దాల్చినప్పుడు ఆమెపై కొందరు నెటిజన్లు బాడీ షేమింగ్‌కు పాల్పడ్డారు.
దీనికి కాజల్ కూడా ఘాటుగానే బదులిచ్చారు. కడుపులో బిడ్డ పెరుగుతున్న కొద్దీ పొట్ట పెద్దదవుతుంది.. శరీరం సాగుతుంది. ఈ సమయంలో నాపై బాడీ షేమింగ్‌కు పాల్పడటం సరికాదని ఫైర్ అయ్యారు. కాజల్‌కు సపోర్ట్‌గా సమంత వెంటనే రంగంలోకి దిగి కామెంట్స్‌ను తిప్పికొట్టారు. ఇక తన భర్తకు సమంత నటన అంటే చాలా ఇష్టమని కాజల్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అలా సమయం వచ్చినప్పుడల్లా ఒకరిపై ఒకరు అభిమానాన్ని చాటుకుంటూనే వచ్చారు.
కాగా.. చాలాకాలం తర్వాత సమంత, కాజల్ అగర్వాల్‌లు ఒకే వేదికపై కలుసుకున్నారు. ప్రస్తుతం సమంత నటించి నిర్మించిన మా ఇంటి బంగారం ప్రమోషనల్ కార్యక్రమాలలో భాగంగా ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో దర్శకురాలు నందినీ రెడ్డితో కలిసి హాజరయ్యారు సమంత. సరిగ్గా అదే సమయంలో ఆ కార్యక్రమానికి హాజరైన కాజల్.. ఫోటోలకు ఫోజులిస్తున్నారు. నందినీ రెడ్డితో మాట్లాడుతుండగా.. కాజల్‌ను చూసిన సమంత ఎమోషనల్ అయ్యారు. వెంటనే తన మిత్రురాలి దగ్గరికి వెళ్లి హత్తుకున్నారు. అనంతరం ఇద్దరూ కలిసి కాసేపు కష్టసుఖాలు పంచుకున్నారు. ఆ తర్వాత సమంత కూడా ఈ ఈవెంట్‌లో ఫోటోలకు ఫోజులిచ్చారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. సమంత- కాజల్ అగర్వాల్‌ల స్నేహబంధంపై నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.


Click it and Unblock the Notifications


