15 ఏళ్లుగా పిలుపులేదు .. యాంకర్ సుమను పట్టుకుని ఏడ్చేసిన సమంత
సమంత రూత్ ప్రభు.. ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దక్షిణాదిలో తిరుగులేని నటిగా గుర్తింపు తెచ్చుకున్న ఆమె వెబ్‌సిరీస్‌లతో నార్త్‌లోనూ గుర్తింపు తెచ్చుకుంది. సినిమాలు, వ్యక్తిగత జీవితం సహా ఎప్పుడూ ఏదో ఒక అంశంలో హెడ్‌లైన్స్‌లో నానుతుంటుంది. ఆర్ధిక సమస్యలతో ఒకప్పుడు ఇబ్బందిపడ్డ సామ్ ఇప్పుడు కోటీశ్వరురాలు. హేమాహేమీలు వంటి ముద్దుగుమ్మలను ఎదుర్కొని దాదాపు 15 ఏళ్లుగా నెంబర్‌వన్ హీరోయిన్‌గా వెలుగొందుతున్నారు.
నాగచైతన్యతో విడాకులు
ఏమాయ చేశావే సినిమాతో తెలుగువారిని అలరించిన సమంత ఆ తర్వాత వరుస హిట్స్‌తో తన స్థానాన్ని పదిలం చేసుకున్నారు. ఏమాయ చేశావేలో తనతో కలిసి నటించిన అక్కినేని నాగచైతన్యతో సుదీర్ఘకాలం డేటింగ్ చేసి 2017లో ఇద్దరూ ఒక్కటయ్యారు. ఇద్దరూ హ్యాపీగా మ్యారేజ్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్న దశలో ఇద్దరూ విడాకులు తీసుకుని విడిపోయారు. ఏమాత్రం ఊహించని ఈ ఘటనతో ఇండస్ట్రీ, అభిమానులు షాక్ అయ్యారు. చైతూతో విడాకుల తర్వాత డిప్రెషన్‌లోకి వెళ్లిన సమంత ఈ దశలో మయోసైటిస్ వ్యాధి బారినపడి తిరిగి కోలుకున్నారు. చికిత్స తీసుకుంటూనే శాకుంతలం, ఖుషి చిత్రాలు పూర్తి చేసినప్పటికీ ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ కావడంతో బాలీవుడ్‌పైనే ఫోకస్ పెట్టారు.

రాజ్ నిడిమోరుతో డేటింగ్?
ది ఫ్యామిలీమెన్, సిటాడెల్ వంటి వెబ్‌సిరీస్‌లతో దుమ్మురేపారు. ఈ సినిమాల షూటింగ్‌ల సమయంలోనే ఈ చిత్ర దర్శకుడు రాజ్ నిడిమోరుతో సామ్ ప్రేమలో పడినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇద్దరూ కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుండటంతో చిత్రసీమలో రకరకాల గాసిప్స్ వస్తున్నాయి. శ్రీకాళహస్తి, తిరుమల ఆలయాలను జంటగా దర్శించుకోవడం వీటికి బలం చేకూరుస్తోంది. సినిమాలతో పాటు ట్రాలాలా బ్యానర్‌పై నిర్మాతగానూ మారారు సమంత. ఆమె నిర్మించిన శుభమ్ మంచి ప్రయత్నంగా విమర్శకులను మెప్పించింది. ప్రస్తుతం మా ఇంటి బంగారం సినిమాలో, రక్త్ బ్రహ్మాండ్: ది బ్లడీ కింగ్‌డమ్ వెబ్‌సిరీస్‌లోనూ సమంత నటిస్తున్నారు.
తానా సభల్లో సమంత
ఇదిలాఉండగా.. ఉత్తర అమెరికా తెలుగు సంఘం 24వ ద్వైవార్షిక మహాసభలు అమెరికాలోని డెట్రాయిట్‌లో జూలై 3 నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ మెగా ఈవెంట్‌కు దేశ విదేశాల్లోని దాదాపు 12 వేల మందికి పైగా తెలుగువారు తరలివచ్చారు. వీరిలో సినీ, రాజకీయ రంగాల ప్రముఖులు ఉన్నారు. ఈ క్రమంలోనే సమంతకు కూడా తానా సభల్లో పాల్గొనాల్సిందిగా ఆహ్వానం అందింది. దీంతో ఈ ఈవెంట్‌లో పాల్గొనేందుకు అమెరికా చేరుకున్న సమంత తానా సభల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
సుమను పట్టుకుని ఏడ్చేసిన సమంత
ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ.. తానా మహాసభల్లో పాల్గొనడానికి నాకు 15 ఏళ్లు పట్టిందని తెలిపారు. తానా గురించి, ప్రవాస తెలుగువారి గురించి తరచుగా వింటూనే ఉన్నానని, నా తొలి సినిమా నుంచి నేటి వరకు నన్ను మీలో ఒకరిగానే చూసుకున్నారని సమంత అన్నారు. కెరీర్‌లో ప్రస్తుతం పీక్స్‌లో ఉన్నానని, ఇటీవలే నిర్మాతగా మారానని నేను తీసిన శుభంకు అమెరికాలో తెలుగువారి సహకారం లభించిందని సమంత పేర్కొన్నారు. ఏం చేసినా, ఎక్కడికి వెళ్లినా తెలుగువారు నన్ను చూసి గర్వపడతారా? లేదా? అనుకునేదాన్నని చెప్పారు. ఇన్నేళ్ల ప్రయాణంలో నాకు సపోర్ట్ చేయడంతో పాటు ఒక ఐడెంటెటీని, కుటుంబాన్ని ఇచ్చారని సమంత భావోద్వేగానికి గురై కంటతడి పెట్టారు. ప్రసంగం ఆపినా స్టేజ్‌పై ఏడుస్తూనే కనిపించడంతో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సుమ.. సమంతను హత్తుకుని కన్నీళ్లు తుడిచారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











