ఆ ఫీలింగ్ ఓ వ్యసనం.. అలా ధైర్యం చేశా.. సమంత ఎమోషనల్
తెలుగు, తమిళ, మలయాళ సినిమా రంగాల్లో స్టార్ హీరోయిన్ సమంత రుత్ ప్రభు నిర్మాతగా మారి ట్రా లా లా మూవీంగ్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మించిన చిత్రం శుభం. సినిమాబండి ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో సమంత అతిథి పాత్రలో, హర్షిత్ రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పెరీ, శ్రీయా కొంతం, శ్రావణి లక్ష్మీ, శాలిని కొండెపూడి, వంశీధర్ గౌడ్, గంగవ్వ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
సెటైరికల్ కామెడీ, హారర్ ఎలిమెంట్స్ రూపొందిన ఈ సినిమా మే 9వ తేదీన రిలీజైంది. ఈ సినిమా థియేట్రికల్‌గా భారీగా వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఆరు రోజుల్లో 3.75 కోట్లకుపైగా వసూళ్లను ఇండియాలో రాబట్టింది. నార్త్ అమెరికాలో 2.25 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా 5 కోట్ల నెట్ 9 కోట్ల మేర గ్రాస్ వసూళ్లను నమోదు చేసిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమా విజయాన్ని పురస్కరించుకొన్ని జరిగిన సక్సెస్ మీట్‌లో సమంత ఎమోషనల్ అయ్యారు. ఆమె మాట్లాడుతూ..

సినిమా పరిశ్రమలో కేవలం 10 శాతం సక్సెస్ రేట్ ఉంది. శుభం సినిమా తీసిన తర్వాత ఇలాంటి ఇండస్ట్రీలో నిర్మాతగా ఎలా అడుగుపెట్టాను. ఎలా ధైర్యం చేశానని కాసేపు ఆలోచించాను. కానీ నా సినిమా యూనిట్‌లో అందరి ముఖాల్లో నవ్వులు చూసిన తర్వాత నాకు చాలా హ్యాపీగా ఉంది. 24 శాఖల వారితో కలిసి పనిచేసిన తర్వాత వారి నుంచి ఎన్నో కథలు, ఎన్నో అనుభవాలు నేర్చుకొన్నాను. అవన్నీ చూసిన తర్వాత నిర్మాతలు మళ్లీ మళ్లీ ఎందుకు సినిమాలు తీయాలని అనుకొంటారో. ఈ ఫీలింగ్ ఒక వ్యసనం లాంటింది అని సమంత అన్నారు.
ఇండస్ట్రీలో 10 శాతం కూడా సక్సెస్ లేదు. కానీ నిర్మాతలు సినిమాలు తీస్తూనే ఉంటారు. ఈ సినిమా చేస్తున్న సేపు చిన్నప్పుడు సమ్మర్ హాలీడేస్ నాకు గుర్తుకు వచ్చాయి. ముగ్గురు పిల్లలు, వారి ఫ్రెండ్స్‌ను థియేటర్‌కు తీసుకెళ్లి వారికి సినిమా చూపించాలంటే.. మా అమ్మ ఎంత కష్టపడిందో ఇప్పుడు అర్ధం అవుతున్నది. మా అమ్మ కష్టపడి మమ్మల్ని పెంచింది. మా ఆనందం కోసం బాగా కష్టపడింది అని తన చిన్నప్పటి రోజులను ఆమె నెమరు వేసుకొన్నది.
చిన్నప్పుడు నేను థియేటర్‌లో సినిమా చూసిన క్షణాలు ఇప్పటికీ గుర్తు ఉన్నాయి. చీకట్లో క్లాప్ కొడుతూ ఉండే వాళ్లం. థియేటర్‌లో పాప్ కార్న్ కోసం మా అన్నయ్యతో గొడవ పడటం గుర్తుకు చేసుకొంటే.. నిన్ననే జరిగిందనే ఫీలింగ్ కలుగుతుంది. అందుకే మంచి సినిమాలు తీయాలని, ప్రేక్షకులకు తీపి గుర్తులను పంచడానికి ట్రా లా లా బ్యానర్ స్థాపించాం అని సమంత అన్నారు.
వాస్తవానికి యాక్టర్ల లైఫ్ చాలా ఖుషీగా ఉంటుంది. అందరి కంటే లేటుగా సెట్‌కు వస్తాం. ఫస్ట్ వెళ్లిపోతాం. మాకు హ్యాపీ లైఫ్ ఉంటుంది. రివ్యూలు చదివేటప్పుడు కూడా నా గురించి ఏం రాశారని ముందు చదువుతాను. ఆ తర్వాత మిగితా రివ్యూ చదువే అలవాటు ఉంది. కానీ ఇప్పుడు నేను పూర్తిగా మారిన మనిషిని. ఓ సినిమా గురించి ఎంత మంది నిద్రలేని రాత్రులు గడుపుతారో నాకు తెలిసింది. ఈ సినిమా కోసం నా యూనిట్ ఎంత కష్టపడిందో నాకు తెలుసు. ఈ విజయం వారిదే అని సమంత ఎమోషనల్ అయ్యారు.


Click it and Unblock the Notifications











