చిరంజీవి కారణంగా ఎన్నోసార్లు ఏడ్చా .. ఆ బాధ పోయేది కాదు : ఆమని సంచలన వ్యాఖ్యలు
ఒకప్పటి స్టార్ హీరోయిన్లలో ఆమని ఒకరు. అందాల ఆరబోతకు దూరంగా నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలే చేస్తూ మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అప్పట్లో హోమ్లీగా కనిపిస్తూ మిడిల్ క్లాస్ ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అయ్యారు. కుటుంబ కథా చిత్రాలంటే ఖచ్చితంగా ఆమని ఉండాల్సిందే అన్నట్లుగా ప్రేక్షకుల చేత ప్రశంసలు పొందారు. ముఖ్యంగా మావిచిగురు, శుభలగ్నం, జంబలకిడిపంబ, మిస్టర్ పెళ్లాం, శుభమస్తు, వంశానికొక్కడు, శుభసంకల్పం వంటి హిట్ చిత్రాలతో ఆమని తనదైన ముద్ర వేశారు.
హీరోయిన్‌గా అవకాశాలు తగ్గుతున్న దశలో పెళ్లి చేసుకుని లైఫ్‌లో సెటిలవ్వాలని భావించింది. తమిళ నిర్మాత ఖాజా మోహియుద్దీన్‌ని వివాహం చేసుకుంది. అంతా అనుకున్నట్లుగా వీరిది ప్రేమ వివాహం కాదు, పెద్దలు కుదిర్చిన పెళ్లి కూడా కాదు. కేవలం అభిప్రాయాలు కలవడంతోనే ఆమని- ఖాజాల పెళ్లి జరిగింది. ఈ దంపతులకు ఒక కుమార్తె, కుమారుడు . వివాహం తర్వాత ఫ్యామిలీ లైఫ్‌కు అంకితమైన ఆమని, సినిమాలకు దూరమయ్యారు.

అయితే అనూహ్య కారణాలతో ఆమని తన భర్తతో విడిపోయారు. ఆపై సినిమాల్లో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆమె క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా బిజీ అయ్యారు. ఈ నేపథ్యంలో తను హీరోయిన్‌గా ఉన్నప్పుడు ఎదురైన అనుభవాలు, సంఘటనలను పలు ఇంటర్వ్యూలలో పంచుకుంటున్నారు ఆమని. తాజాగా ఓ ఛానెల్‌తో మాట్లాడుతూ.. కెరీర్‌లో ఎంతో మంది స్టార్ హీరోలతో నటించిన ఆమని తనకు ఎంతో ఇష్టమైన, మెగాస్టార్ చిరంజీవితో కలిసి పనిచేయకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు.
చిరంజీవి పేరుని దేవుడిని జపించినట్లుగా జపించేదాన్నని, ఆయనంటే అంత పిచ్చి అని ఆమని తెలిపారు. రొమాన్స్ సాంగ్ ఏదైనా డ్రీమ్‌లో ఆలోచిస్తే ఖచ్చితంగా ఆ ప్లేస్‌లో చిరంజీవి ఉంటారని ఆమని తెలిపారు. మెగాస్టార్‌తో నటించే ఛాన్స్ వచ్చిందని.. శుభలగ్నం తర్వాత రిక్షావోడు సినిమాకు తొలుత నన్నే సంప్రదించారని, డేట్స్ కూడా తీసుకున్నారని ఆమె గుర్తుచేసుకున్నారు. ఈ విషయంపై చిరంజీవితో మాట్లాడానని, షూట్‌కు వెళ్తున్నామని చెప్పారని ఆమని అన్నారు. సౌందర్య కూడా ఈ మూవీలో నటిస్తున్నట్లు తెలిసిందని, తను కూడా చాలా సంతోషించడంతో పాటు మళ్లీ కలిసి చేస్తున్నామే అందన్నారు.

కానీ ఏం జరిగిందో ఏమో కానీ కొద్దిరోజుల తర్వాత సదరు ప్రాజెక్ట్‌లో నగ్మా హీరోయిన్ అని ఓ పేపర్‌లో చూశానని , దీనిపై మేనేజర్‌ను ఆరా తీయమని చెప్పినట్లు ఆమని పేర్కొన్నారు. డైరెక్టర్ మారారని, కోదండరామిరెడ్డికి బదులుగా కోడి రామకృష్ణ చేతుల్లోకి సినిమా వెళ్లిందని అలా ఛాన్స్ మిస్సయ్యిందని ఆమె తెలిపారు. ఇది జరిగిన కొన్నేళ్లకు చిరంజీవితో కలిసి నటించే అవకాశం వచ్చింది. కానీ అది హీరోయిన్ క్యారెక్టర్ కాదు, సిస్టర్ రోల్. అదే స్టాలిన్ మూవీ.
చిన్నతనం నుంచి చిరు తన డ్రీమ్ హీరో .. అలాంటిది ఆయన పక్కన సిస్టర్‌గా అస్సలు ఊహించుకోలేనని.. అందుకే నో చెప్పినట్లు ఆమని వెల్లడించారు. చిత్ర యూనిట్ 10 సార్లు ఫోన్ చేసి బతిమలాడిందని, అయినా కుదరదని కరాఖండీగా చెప్పేశానన్నారు. చిరంజీవితో సినిమా చేయలేకపోయాననే విషయం గుర్తొచ్చినప్పుడల్లా ఏడ్చేదాన్నని ఆమని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే కే . విశ్వనాథ్ అంత్యక్రియల సమయంలో చిరంజీవి దగ్గరుండి కార్యక్రమం నిర్వహించారని, అప్పుడు ఓ అభిమానిగా ఆయనతో ఓ ఫోటో దిగానని తెలిపారు.


Click it and Unblock the Notifications











