17 ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్న రంభ .. ఆ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్!
ఏళ్లకు ఏళ్లు సినీరంగంలో ఉండి .. పెళ్లి తర్వాత ఇండస్ట్రీకి దూరమైన ఒకప్పటి స్టార్ హీరోయిన్లు నేడు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తున్నారు. తల్లి, అక్క, వదిన ఇతర క్యారెక్టర్ ఆర్టిస్ట్‌ల వేషాలతో మళ్లీ బిజీ అవుతున్నారు. రమ్యకృష్ణ, నగ్మా, మీనా, నదియా, ఖుష్బూ, మీరా జాస్మిన్ , లయ, భూమిక తదితరులు సెకండ్ ఇన్నింగ్స్‌లో ఇరగదీస్తున్నారు. ఇప్పుడు ఇదే లిస్ట్‌లోకి రాబోతున్నారు ఒకప్పటి టాప్ హీరోయిన్ రంభ.
90వ దశకంలో దక్షిణాదిలోని నాలుగు భాషల్లో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందారు రంభ. విజయవాడకు చెందిన రంభ అసలు పేరు విజయలక్ష్మీ. ఇండస్ట్రీలో అడుగుపెట్టాక తన స్క్రీన్ నేమ్‌ను రంభగా మార్చుకున్నారు. రెండు దశాబ్ధాలకు పైగా కెరీర్‌లో తెలుగు సహా దాదాపు 8 భారతీయ భాషల్లో 100కు పైగా సినిమాల్లో నటించారు రంభ. అయితే దివంగత దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో రాజేంద్రప్రసాద్ హీరోగా నటించిన ఆ ఒక్కటి అడక్కు రంభ తొలి చిత్రం.

తొలి సినిమాతోనే లుక్స్, అందాల ఆరబోతతో ఆమె సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకున్నారు. దీనికి తోడు అప్పటి టాప్ హీరోయిన్ దివ్యభారతి పోలికలు ఉండటంతో రంభ క్రేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. దక్షిణాదిలోని అగ్ర కథానాయకులు రజనీకాంత్, కమల్ హాసన్, మోహన్‌లాల్, చిరంజీవి, బాలకృష్ణ , నాగార్జున, వెంకటేష్ సహా జగపతిబాబు, శ్రీకాంత్, జేడీ చక్రవర్తి, విజయ్, అజిత్ వంటి స్టార్స్‌తో ఆడిపాడారు రంభ. అందాల ఆరభోతే కాదు, నటనలోనూ తనకు తిరుగులేని నిరూపించుకున్నారు ఈ బెజవాడ బ్యూటీ.
వయసు పైబడుతుండటం, కొత్త అమ్మాయిల రాకతో రంభకు అవకాశాలు తగ్గాయి. దీంతో ఒకదశలో ఐటెం సాంగ్స్‌కి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దేశముదురు, యమదొంగ సినిమాలలో ఆమె చేసిన స్పెషల్ సాంగ్స్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. 2008లో దొంగ సచ్చినోళ్లు తెలుగులో రంభకు చివరి సినిమా. ఈ నేపథ్యంలో 2010లో మలేషియాకు చెందిన ఇంద్రకుమార్ అనే పారిశ్రామికవేత్తను పెళ్లాడి లైఫ్‌లో స్థిరపడ్డారు రంభ. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.
పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన రంభ.. బుల్లితెర ద్వారా ప్రేక్షకులను అలరించారు. మనీలా మయిలా, ద్వయం నెంబర్ 1, ఏబీసీబీ వంటి షోలకు జడ్జిగా చేశారు. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే రంభ .. ఎప్పటికప్పుడు తన వ్యక్తిగత విషయాలను పంచుకుంటూనే ఉన్నారు. ఇక ఈ వయసులోనూ హాట్ హాట్ ఫోటో షూట్‌లతో సెగలు రేపుతున్నారు. అయితే తన వయసు, ఇమేజ్‌కు తగ్గ క్యారెక్టర్ లభిస్తే ఖచ్చితంగా రీ ఎంట్రీ ఉంటుందని రంభ పలుమార్లు చెప్పారు.
తాజాగా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రంభ తన సెకండ్ ఇన్నింగ్స్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. సినిమా నా ఫస్ట్ లవ్ అని కథాబలం ఉన్న పాత్రలు, బరువైన పాత్రలు చేయడానికి తానెప్పుడూ వెనుకాడలేదన్నారు. రీ ఎంట్రీలోనూ ప్రేక్షకులకు దగ్గరవ్వాలన్నదే తన ఉద్దేశ్యమని రంభ చెప్పారు. దీంతో ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. రంభ రీ ఎంట్రీ ఎప్పుడు? ఏ సినిమాతో ఉంటుంది ? అనేది తెలియాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











