Ramya Krishnan : ఆ స్టార్ డైరెక్టర్ సెట్‌లోనే అలా.. ఏడుస్తూ ఇంటికెళ్లిపోయిన రమ్యకృష్ణ
90లలో సౌతిండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని ఒక ఊపారు రమ్యకృష్ణ. అందాల ఆరబోతే కాదు అద్భుతమైన నటిగానూ ఆమె పేరు తెచ్చుకున్నారు. పొగరుబట్టిన పాత్రలే కాదు, అమాయకత్వం నిండిన క్యారెక్టర్లను రమ్యకృష్ణ అద్భుతంగా పోషించగలరు. సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ అంతే బిజీగా ఉన్న రమ్యకృష్ణ ఓ దర్శకుడు చేసిన పని వల్ల సెట్స్‌లో ఏడుస్తూనే ఇంటికి వెళ్లారట. ఈ వివరాల్లోకి వెళితే :
1985లో భలేమిత్రులు మూవీతో తెలుగు వారిని పలకరించారు రమ్యకృష్ణ. తొలినాళ్లలో సెకండ్ హీరోయిన్‌గానూ నటించారు. అయితే ఆమెకు సరైన హిట్స్ దొరక్కపోవడంతో రమ్యపై ఐరెన్ లెగ్ ట్యాగ్ వేశారు కొందరు. అయినప్పటికీ మొక్కవోని ధైర్యంతో తనపై వస్తున్న విమర్శలను తట్టుకుని నిలబడ్డారు. ఈ దశలో కళాతపస్వి కే . విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన సూత్రధారులు ఆమెకు బ్రేక్ ఇచ్చింది. ఇందులో భానుచందర్‌కు జోడీగా అమాయకత్వం నిండిన పాత్రలో అద్భుతంగా నటించారు రమ్యకృష్ణ.

ఆ తర్వాత కే రాఘవేంద్రరావు చేతుల్లో పడటంతో రమ్యకృష్ణకు ఎదురులేకుండా పోయింది. అల్లుడుగారు. అల్లరి ప్రియుడు, ముద్దుల ప్రియుడు, అల్లరి మొగుడు, బంగారు బుల్లోడు, మేజర్ చంద్రకాంత్, క్రిమినల్, హలో బ్రదర్, ముగ్గురు మొనగాళ్లు, అమ్మోరు, ధర్మచక్రం, అన్నమయ్య, ఆహ్వానం, కంటే కూతురినే కనాలిరా, ఇద్దరు మిత్రులు వంటి హిట్ చిత్రాల్లో నటించారు. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ చిత్రాల్లో దాదాపు 260కి పైగా చిత్రాలు చేసింది.
అందాల ఆరబోతే కాదు.. ఈ జనరేషన్‌లో పవర్‌ఫుల్ క్యారెక్టర్స్‌కు రమ్యకృష్ణ కేరాఫ్‌గా నిలిచారు. ముఖ్యంగా సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో ఆమె నటించిన నరసింహలో నీలాంబరిగా ఆమె నటన హైలెట్‌గా నిలిచింది. రీసెంట్‌గా ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలిలో శివగామి దేవిగా రమ్య నటన సినిమాకు ప్లస్ అయ్యింది. అతిలోక సుందరి శ్రీదేవి చేయాల్సిన ఆ పాత్ర.. రమ్యకు దక్కడం విశేషం. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీని ప్రేమించి పెళ్లాడారు రమ్యకృష్ణ. ఈ దంపతులకు ఓ బాబు సంతానం. పెళ్లి తర్వాత కొన్నాళ్లు గ్యాప్ ఇచ్చిన రమ్యకృష్ణ.. సెకండ్ ఇన్నింగ్స్‌లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కీలకపాత్రలు పోషిస్తున్నారు. రజనీకాంత్ సరసన జైలర్‌లో కనిపించిన ఆమె.. మహేశ్ బాబుకు తల్లిగా గుంటూరు కారంలో అలరించారు.

ఇదిలాఉండగా.. తెలుగులో ఫ్యామిలీ చిత్రాల స్పెషలిస్ట్ ఎస్వీ కృష్ణారెడ్డి వల్ల రమ్యకృష్ణ సెట్‌లోనే కంటతడి పెట్టారట. ఈ విషయాన్ని స్వయంగా ఓ ఇంటర్వ్యూలో కృష్ణారెడ్డే వెల్లడించారు. మహిళా నటులను తాను ఎంతో గౌరవిస్తానని చెప్పిన ఆయన .. ఆహ్వానం సినిమా షూటింగ్ సమయంలో జరిగిన సంఘటనను పంచుకున్నారు.
షూటింగ్ చివరి రోజున రమ్యకృష్ణ ఇంటికి వెళ్తుండగా.. ఆమెకు వెండి పళ్లెంలో పట్టుబట్టలు పెట్టి, దానిపై రూ.10 వేలు డబ్బులు పెట్టి , కుంకుమ బొట్టు పెట్టి మరి సాగనంపామన్నారు. దాంతో ఆమె తన చేయి పట్టుకుని ఏడ్చేశారని.. కన్నీటితోనే ఇంటికి బయల్దేరారని, ఆ సన్నివేశం ఇప్పటికీ గుర్తుందని ఎస్వీ కృష్ణారెడ్డి చెప్పారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా ఎస్వీ కృష్ణారెడ్డి మంచి మనసుపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.


Click it and Unblock the Notifications











