జమున కంటే శ్రీలీల గొప్పదా? ఎక్స్‌పోజింగ్ చేయాల్సిందే
ప్రస్తుతం టాలీవుడ్‌లో బిజీ హీరోయిన్ ఎవరైనా ఉన్నారంటే అది శ్రీలీలేనని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హీరో ఎవరైనా, డైరెక్టర్ ఎంతటి స్టార్ అయినా.. ఫిమేల్ లీడ్ రోల్ మాత్రం శ్రీలీలదే. సక్సెస్ వెంట నడిచే సినీలోకంలో ఆమె మాత్రం స్పెషల్ అని నిరూపించుంది. గతేడాది ఆమె నటించిన 4 సినిమాలు విడుదలైతే అందులో ఒక్క భగవంత్ కేసరి మినహా మిగిలిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయ్యాయి. ఈ గుంటూరు కారం హిట్ అయినా క్రెడిట్ మొత్తం సూపర్‌స్టార్ మహేశ్ బాబు ఖాతాలోకి వెళ్లిపోయింది. ప్రస్తుతం పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ - హరీశ్ శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న 'ఉస్తాద్ భగత్ సింగ్ ' సినిమాలో శ్రీలీల నటిస్తున్నారు.
అందాల అరబోత కన్నా కథ, సినిమాలో తన క్యారెక్టర్‌కు ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తానని చాలామంది హీరోయిన్ల మాదిరే శ్రీలీల చెబుతున్నారు. ఆమె వ్యాఖ్యలపై సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు స్పందించారు. అవన్నీ మాట వరసకు చెప్పేవనని, అందం లేకుంటే ఆర్టిస్ట్ అనేవాడికి మనుగడ ఉండదన్నారు. ఆ అందం వల్లే జయలలిత, శ్రీదేవి, మాధవిలకు హీరోయిన్‌గా అవకాశాలు దక్కాయని, వాళ్లతో స్విమ్మింగ్ సూట్ కూడా వేయించారని రామారావు అన్నారు. వీరంతా శ్రీలీల కంటే పెద్ద పెద్ద మాటలే మాట్లాడారని, తాము మోడ్రన్ డ్రెస్సులు వేసుకోమని చెప్పారని ఆయన గుర్తుచేశారు. దీనిని బట్టి అందం లేకుండా సినిమా ఆర్టిస్ట్ కాలేరని, పరిశ్రమలోనూ రాణించలేరని రామారావు వెల్లడించారు.

జమున కంటే రిజర్వ్‌డ్‌గా ఉన్నవాళ్లు ఎవరూ లేరని ఆయన తెలిపారు. హీరోయిన్లు మాట వరసకి షరతులు వర్తిస్తాయని చెబుతారని రామారావు వ్యాఖ్యానించారు. బ్రాంది షాపుల్లో బ్రాంది అమ్మబడును అని తాటికాయంత అక్షరాలతో రాస్తారని, దాని కింద చిన్నగా డాక్టర్ చీటీపై అని ఉంటుందని ఆయన తెలిపారు. సినిమా అంటేనే గ్లామర్ ఫీల్డ్.. ఇందులో గ్లామర్ లేకుంటే ఎలా అని రామారావు ప్రశ్నించారు.
ప్రేక్షకులు సినిమా చూసే విధానం పూర్తిగా మారిపోయిందని, లేకుంటే అర్జున్ రెడ్డి వంటి చిత్రాలు ఎందుకు హిట్ అవుతాయని ఆయన నిలదీశారు. సాయిపల్లవి లాంటి డాక్టర్ చదివిన అమ్మాయి నాగచైతన్యని ముద్దు పెట్టుకుంటుందా అని ప్రశ్నించారు. తమ రోజుల్లో ఆడదంటే అలుసా అనే ఓ సినిమా వచ్చిందని .. కాంచన , ప్రభ వంటి వాళ్లతో రాత్రి 10 గంటల తర్వాత చాలా దారుణంగా షూటింగ్ చేశారని రామారావు తెలిపారు. జనం ఆ సినిమాను తిప్పికొట్టారని.. ఇదే బాటలో ముగ్గురు మూర్ఖురాళ్లు అంటూ విజయలలిత, రామాప్రభ, జయమాలినిలతో హైదరాబాద్‌లో ఆరోజుల్లో నైట్ టైమ్ ఔట్‌డోర్ షూటింగ్ చేశారని ఆయన గుర్తుచేశారు.
రామాప్రభ, జయమాలిని, విజయలలితలను ఏటో తీసుకెళ్లి గంట రెండు గంటల తర్వాత తిరిగి పంపించారని రామారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈలోగా షూటింగ్‌కి ప్యాకప్ చెప్పేసి మిగిలిన యూనిట్ సభ్యులు వారిని వెతుకుతున్నారని ఆయన తెలిపారు. ఆడదంటే అలుసాలలో ప్రభ, కాంచనమాలలు వోడ్కా అనుకున్నారో లేక లిమ్కా అనుకున్నారో గానీ తాగేశారని రెచ్చిపోయి యాక్ట్ చేశారని రామారావు చెప్పారు. మలయాళ సినిమా మాదిరిగా బిట్స్‌లాగా ఆ సీన్లను ఉపయోగించుకున్నారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. క్యారెక్టర్ డిమాండ్ చేస్తే లిప్‌లాక్ అయినా చేయాల్సిందేనని రామారావు చెప్పారు. కథ, కథనం మేరకు నటీనటులు క్లోజ్‌గా మూవ్ అవుతారని ఆయన వెల్లడించారు.

సినిమా అన్నాక జనాలను ఆకట్టుకునే ప్రయత్నాలు జరుతాయని.. దానిని ఒప్పుకుని తీరాల్సిందేనని రామారావు తెలిపారు. కథాబలం ఉన్న సినిమాల్లో నటిస్తానని హీరోయిన్లు ఎప్పుడూ చెబుతూనే ఉంటారని, కానీ వయసులో ఉన్న వారు అందాల ఆరబోత చేయాల్సిందేనని ఆయన అన్నారు. అంతేకానీ షరతులు వర్తిస్తాయి, ఎక్స్‌పోజింగ్‌కు తాము దూరమనే మాటలు మాట్లాడొద్దన్నారు. డాక్టర్ చదివి, రిజర్వ్‌డ్‌గా ఉండే సాయిపల్లవి .. ఎక్స్‌పోజింగ్‌కు దూరంగా ఉంటానని చెప్పుకునే సాయిపల్లవి 'లవ్‌స్టోరీ' సినిమాలో నాగచైతన్యని ఎందుకు ముద్దు పెట్టుకుందని రామారావు ప్రశ్నించారు. అక్కడ అవసరం కాబట్టే.. వయసులో ఉన్న ఆడది, మగాడు ప్రేమించుకుంటున్నప్పడు అలాగే ఉంటారని ఆయన వ్యాఖ్యానించారు.


Click it and Unblock the Notifications











