హీరో కూతురినైనా తీసేశారు.. నా జీవితానికి అదే శాపం.. శివాత్మిక రాజశేఖర్ ఎమోషనల్
టాలీవుడ్‌లో యాంగ్రీ యంగ్‌మెన్‌గా క్రేజ్ సంపాదించుకున్నారు డాక్టర్ రాజశేఖర్. పోలీస్‌గా పవర్‌ఫుల్ పాత్రలతో పాటు అల్లరి ప్రియుడిగా లవర్‌బాయ్, మా అన్నయ్యగా ఫ్యామిలీ స్టార్ ఇమేజ్ తెచ్చుకున్నారు. వరుస హిట్స్‌తో స్టార్ హీరోలకు ముచ్చెమటలు పట్టించారు. తన సహ నటి జీవితను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు రాజశేఖర్. ఈ దంపతులకు శివాత్మిక, శివానీలు సంతానం. అందరూ హీరోల మాదిరిగానే తన కూతుళ్లను ఇండస్ట్రీకి పరిచయం చేశారు రాజశేఖర్ . కానీ ఎందుకో కానీ వీరికి అనుకున్న స్థాయిలో అవకాశాలు దక్కడం లేదు. తాజాగా రాజశేఖర్ చిన్న కుమార్తె శివాత్మిక ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తమకు అవకాశాలు దక్కకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వివరాల్లోకి వెళితే..
దొరసాని సినిమాతో ఎంట్రీ
దొరసాని సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు శివాత్మిక రాజశేఖర్. ఈ చిత్రానికి విమర్శకుల ప్రశంసలు దక్కినప్పటికీ, బాక్సాఫీస్ వద్ద ఆకట్టుకోలేకపోయింది. ఆపై కోలీవుడ్‌లో అడుగుపెట్టిన శివాత్మిక.. తమిళ్‌లో ఆనందం విలాయుదం వీడు, నితం ఓరు వానం సినిమాలలో నటించారు. తిరిగి టాలీవుడ్‌పై ఫోకస్ పెట్టిన శివాత్మిక పంచతంత్రం, రంగ మార్తాండ సినిమాలో మెరిశారు. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే శివాత్మిక ఎప్పటికప్పుడు తన సినిమాలు, ఇతర వ్యక్తిగత విశేషాలను పంచుకుంటూ ఉంటారు. పద్ధతిగా చీర కట్టులోనే ఫోటోషూట్‌లు చేస్తూ వాటిని షేర్ చేస్తుంటారు.

స్టార్ కిడ్స్‌కు అవకాశాలు రావు
ప్రస్తుతం తమిళంలో అరోమలై, బాంబ్ సినిమాలలో శివాత్మిక నటిస్తున్నారు. తాజాగా ఓ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో శివాత్మిక మాట్లాడుతూ పలు ఆసక్తికర విశేషాలను పంచుకున్నారు. కెరీర్ ప్రారంభించిన కొత్తలో మా అమ్మనాన్న ఇండస్ట్రీకి చెందిన వాళ్లు కాబట్టి తేలికగా అవకాశాలు లభిస్తాయని అనుకున్నానని.. కానీ ఆ తర్వాతే ఇక్కడి పరిస్ధితులు అర్ధమయ్యాయని తెలిపింది. స్టార్ కిడ్స్‌కు కుటుంబ నేపథ్యం అనేది ఇండస్ట్రలో ఈజీగా యాక్సెస్ కావడానికి ఉపయోగపడుతుందని.. కానీ ఆ తర్వాత మన కష్టం మీదే ఆధారపడి కెరీర్ ఉంటుందని శివాత్మిక వెల్లడించారు.
హీరోయిన్‌గా తీసేశారు
పలు సినిమాలలో నటించేందుకు ఒప్పందం చేసుకున్నాక చివరి నిమిషంలో తనను పలు ప్రాజెక్ట్స్ నుంచి తీసేసిన సందర్భాలు ఉన్నాయని శివాత్మిక పేర్కొన్నారు. సినిమాలలో అవకాశాలు రావాలంటే నటనే కాకుండా సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ఉండాలని కూడా ఈ మధ్యే తెలుసుకున్నానని ఆమె షాకింగ్ న్యూస్ చెప్పారు. ఇన్‌స్టాగ్రామ్ సహా ఇతర సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో తనకు ఫాలోయింగ్ లేకపోవడంతో సినిమాలలో అవకాశాలు ఇవ్వలేదని, కొన్నింటి నుంచి తీసేశారని శివాత్మిక ఆవేదన వ్యక్తం చేశారు.
అలా అయితేనే ఛాన్స్
ఏజెంట్స్, మేనేజర్లు ఇలా ఎవరినా కలిసినా సరే ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్స్‌ను పెంచుకోమంటున్నారని శివాత్మిక అన్నారు. తాను ఓ నటిని మాత్రమేనని అంతే తప్ప కంటెంట్ క్రియేటర్‌ను కాదని ఆమె తేల్చిచెప్పారు. అయితే ఇటీవలి కాలంలో సోషల్ మీడియా స్టార్స్, ఇన్‌ఫ్లూయెన్సర్లు వరుస అవకాశాలు దక్కించుకుంటున్నారు. వైష్ణవి చైతన్య, నిహారిక ఎన్ఎమ్, కుషిత కల్లపు వంటి వారు మంచి అవకాశాలు అందుకుంటున్నారు. ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకునే శివాత్మిక రాజశేఖర్ పై విధంగా వ్యాఖ్యానించారని ఫిలింనగర్‌లో చర్చ జరుగుతోంది.


Click it and Unblock the Notifications











