‘డబ్బు కోసం శృంగార చిత్రాలకు ఒప్పుకున్నానని... 3 రోజులు అదే పని ’
మలయాళ చిత్ర పరిశ్రమలో నటీనటులకు ప్రాతినిథ్యం వహిస్తోన్న అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ (అమ్మ) అధ్యక్షురాలిగా గెలిచి.. ఈ ఘనత సాధించిన తొలి మహిళగా రికార్డుల్లోకెక్కారు నటి శ్వేతా మీనన్. దేవన్ వంటి బలమైన, సీనియర్ నటుడిపై గెలవడం అంటే ఆషామాషీ కాదు. కానీ శ్వేతా మీనన్ ఎంతో కష్టపడి ఈ విజయం సాధించారు. జస్టిస్ హేమ కమిటీ .. మలయాళ చిత్ర పరిశ్రమలోని చీకటి కోణాలను, మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులను బయటపెట్టిన తర్వాత అమ్మ అధ్యక్ష పదవికి మోహన్‌లాల్ రాజీనామా చేశారు. దాంతో ఎన్నికలు అనివార్యమయ్యాయి.
శ్వేత మీనన్ నిర్ణయాలపై ఉత్కంఠ
మోహన్‌లాల్ వంటి దిగ్గజం తప్పుకున్న తర్వాత ఈ బాధ్యతలు చేపట్టిన శ్వేతా మీనన్ ఈ అసోసియేషన్‌ను ఎలా నడిపిస్తారన్నది ఆసక్తిగా మారింది. అమ్మ అధ్యక్షురాలిగా గెలిచిన తర్వాత శ్వేతా మీనన్ ఏం చేసినా? ఏం మాట్లాడినా హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్, జీవితంలో ఎదుర్కొన్న ఇబ్బందులపై శ్వేతా మీనన్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఈ వివరాల్లోకి వెళితే..

మోడల్ నుంచి నటిగా
చండీగఢ్‌లో మలయాళీ కుటుంబంలో జన్మించారు శ్వేతా మీనన్. చదువు తర్వాత మోడలింగ్ వైపు వెళ్లిన శ్వేత.. 1994లో ఫెమినా మిస్ ఇండియా ఏషియా పసిఫిక్ కాంటెస్ట్‌లో గెలుపొందారు. ఆ తర్వాత సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ... 1991లో అనస్వరం అనే సినిమాలో తొలిసారిగా నటించారు. కీర్తి చక్ర, పరదేశి, మధ్య వెనల్ తదితర చిత్రాల్లో నటించారు. అయితే బోల్డ్ కంటెంట్‌తో వచ్చిన రతి నిర్వేదం ఆమె కెరీర్‌ను మలుపు తిప్పింది. 34 ఏళ్ల కెరీర్‌లో మలయాళంతో పాటు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో పలు చిత్రాల్లో నటించారు శ్వేతా మీనన్. సినిమాలతో పాటు బుల్లితెరపైనా శ్వేతా మీనన్ తిరుగులేని ముద్ర వేశారు. సీరియల్స్‌తో పాటు అనేక కార్యక్రమాలకు హోస్ట్‌గా వ్యవహరించారు. 2024లో బిగ్‌బాస్ మలయాళం సీజన్ 6లో కంటెస్టెంట్‌గానూ పాల్గొన్నారు.
మొదటి భర్తతో విడాకులు
సినిమాలతో పాటు వ్యక్తిగత జీవితంలో పలు వివాదాల్లోనూ ఆమె పేరు వినిపించింది. తొలుత బాలీవుడ్‌కి చెందిన మోడల్ బాబీ భోంస్లేను పెళ్లాడారు శ్వేత. అయితే కొద్దికాలానికే వీరిద్దరూ విడిపోయారు. ఈ క్రమంలో 2011లో శ్రీవాల్సన్ మీనన్‌ను రెండో పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు కుమార్తె ఉన్నారు. ఈ పాపను ప్రసవిస్తుంచే దృశ్యాలను సినిమా షూటింగ్ కోసం రికార్డ్ చేశారన్న అభియోగాలపై శ్వేతా మీనన్ పలు అభియోగాలను ఎదుర్కొన్నారు.
5 పైసలు కూడా ఇవ్వను
తాజా ఇంటర్వ్యూలో శ్వేతా మీనన్ మాట్లాడుతూ... నా కూతురికి ఎలాంటి ఆస్తులు కూడబెట్టలేదని.. మంచి ఆరోగ్యం, చదువు ఇవ్వగలిగితే చాలు. కానీ అప్పుడప్పుడూ విహారయాత్రలకు తీసుకెళ్తున్నా. కొన్నిసార్లు మేం నివసించే ఫ్లాట్‌ని నా కూతురు తనదేనని అంటుంది. కానీ 5 పైసలు కూడా ఆమెకు ఇవ్వను. తల్లిదండ్రులపై ఆధారపడకుండా తను ఎదగాలన్నదే నా లక్ష్యం. పిల్లలు పెరిగి పెద్దయ్యే వరకు వాళ్లకు అన్నీ సమకూర్చి ఇవ్వకూడదని శ్వేత మీనన్ అన్నారు.
డబ్బు కోసం ఆ చిత్రాల్లోకి
ఇక అమ్మా ఎన్నికల సమయంలో శ్వేతా మీనన్‌పై నమోదైన కేసు.. సినీ వర్గాలను షాక్‌కు గురిచేసింది. డబ్బు సంపాదనే ధ్యేయంగా అశ్లీల, అసభ్యకరమైన కంటెంట్ ఉన్న సినిమాల్లో శ్వేత నటించిందని మార్టిన్ మెనాచేరి అనే సామాజిక కార్యకర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. డబ్బు కోసం బీగ్రేడ్ సినిమాలలో నటిస్తూ యువతను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై తాజా ఇంటర్వ్యూలో శ్వేత స్పందించారు. 12 ఏళ్ల క్రితం నాటి సినిమాపై ఇలా కేసులు పెట్టడం సరికాదు.. ఆ సినిమాలు నాకు గుర్తింపును, అవార్డులను తెచ్చిపెట్టాయి. ఈ ఘటనతో మూడు రోజుల పాటు ఇంట్లోనే ఏడుస్తూ కూర్చొన్నా.. కానీ నా కుటుంబం నన్ను నడిపించింది. ఆ సమయంలో అందరికంటే ఎక్కువగా బాధపడింది నా కూతురి గురించే. నాలోని తల్లి, నాలోని ఒక భార్య నిరాంతరాయంగా ఏడుస్తూనే ఉంది. అతను నన్ను నరికేయొచ్చు.. కానీ నేను తిరిగి ఎదుగుతాను. ఆ సమయంలో నా తండ్రి బతికి ఉంటే అతనిని చంపి వేసేవాడు. అని శ్వేతా మీనన్ ఆవేదన వ్యక్తం చేశారు.


Click it and Unblock the Notifications











