‘రాధే శ్యామ్’లో మిస్ ఇండియా యూనివర్శ్: ఎనిమిదేళ్ల తర్వాత టాలీవుడ్‌లోకి రీఎంట్రీ
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి' సిరీస్ తర్వాత తన పంథాను మార్చుకున్నాడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. అప్పటి నుంచి వరుసగా పాన్ ఇండియా చిత్రాల్లోనే నటిస్తున్నాడు. రెండేళ్ల క్రితం 'సాహో' అనే యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో నటించిన అతడు.. ప్రస్తుతం జిల్ మూవీ డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్ తెరకెక్కిస్తోన్న 'రాధే శ్యామ్'లో నటిస్తున్నాడు. అప్పుడెప్పుడో షూటింగ్ ప్రారంభించిన ఈ చిత్రం ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. త్వరలోనే విడుదల కాబోతుంది అనగా.. తాజాగా ఈ మూవీ నుంచి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది.
తాజా సమచారం ప్రకారం.. 'రాధే శ్యామ్'లో మాజీ మిస్ ఇండియా యూనివర్శ్ అయిన సిమ్రన్ కౌర్ ముండి కీలక పాత్రను పోషిస్తోందట. కథను నడిపించే రోల్‌లో ఆమె అద్భుతంగా నటించిందని తెలుస్తోంది. ఎంతో ప్రాధాన్యం ఉన్న ఈ పాత్ర సినిమా మొత్తం ట్రావెల్ అవుతుందని సమాచారం. మోడలింగ్ రంగంలో రాణించి పలు పోటీల్లో విజయం సాధించిన ఆమె.. హిందీ పరిశ్రమలో కొన్ని చిత్రాల్లో నటించింది. అదే సమయంలో మంచు మనోజ్ నటించిన 'పోటుగాడు'తో హీరోయిన్‌గా తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఎనిమిదేళ్ల తర్వాత అంటే ఇప్పుడు ప్రభాస్ సినిమా ద్వారా టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇవ్వబోతుంది.

ప్రభాస్ కెరీర్‌లోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'రాధే శ్యామ్'ను కృష్ణంరాజు సమర్పణలో యువీ క్రియేషన్స్, గోపీకృష్ణా మూవీస్ పతాకాలపై వంశీ, ప్రమోద్, ప్రశీద ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా చేస్తోంది. జస్టిన్ ప్రభాకరన్ మ్యూజిక్ అందిస్తున్నారు. 1960 దశకం నాటి కథతో రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోందీ సినిమా. కొద్ది రోజుల క్రితం విడుదలైన గ్లిమ్స్‌కు భారీ రెస్పాన్స్ వచ్చింది. ఇక, ఈ సినిమాను జూలై 30న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లు వెల్లడించారు.


Click it and Unblock the Notifications











