అందుకే సినిమాలకు దూరమయ్యా.. అతడే లేకపోతే.. స్నేహ ఎమోషనల్
సినీ పరిశ్రమకు ప్రతియేటా ఎంతోమంది హీరోయిన్లు వస్తుంటారు.. వెళ్తుంటారు. కానీ కొందరు మాత్రమే ప్రజలకు హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. నటీమణుల్లో గ్లామర్ షో చేసేవారు కొందరైతే, హోమ్లీ క్యారెక్టర్లు వేసే వారు కొందరు. ఈ సెకండ్ కేటగిరీలోకే వస్తారు స్నేహ. ఒకప్పుడు ఫ్యామిలీ క్యారెక్టర్లకు, కుటుంబ కథా చిత్రాలకు కేరాఫ్‌గా నిలిచిన స్నేహ.. సౌందర్య తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి అంతటి మన్ననలు పొందారు. హీరోయిన్‌గా పీక్స్‌లో ఉన్న దశలో ఒక్కసారిగా వెండితెరకు దూరమయ్యారు. సెకండ్ ఇన్నింగ్స్‌లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటిస్తున్నప్పటికీ ఒకటి ఆరా చిత్రాలు తప్పించి పెద్దగా యాక్టీవ్‌గా లేరు. తాజాగా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్‌కు సంబంధించిన కీలక విషయాలను వెల్లడించారు. ఈ వివరాల్లోకి వెళితే..
స్నేహ పూర్తి పేరు సుహాసినీ రాజారాం నాయుడు. ముంబైలో స్థిరపడిన తెలుగు కుటుంబంలో 12 అక్టోబర్ 1981న ఆమె జన్మించారు. ఈమె చిన్నతనంలోనే వీరి కుటుంబం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)కి వలస వెళ్లడంతో స్నేహ అక్కడే పెరిగారు. ఓ రోజున షార్జాలో క్రికెట్ మ్యాచ్ చూడటానికి వెళ్లిన ఓ మలయాళీ నిర్మాత స్నేహను చూసి సినిమాల్లో నటిస్తావా అని అడిగారు. దీనికి తన తల్లిదండ్రులు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో స్నేహ అనుకోకుండా చిత్ర పరిశ్రమలో అడగుపెట్టారు.

అలా 2000వ సంవత్సరంలో వచ్చిన ఇంగానే ఓరు నీలపక్షి అనే మలయాళ చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు స్నేహ. అనంతరం తరుణ్ హీరోగా వచ్చిన ప్రియమైన నీకు సినిమాతో తెలుగువారిని పలకరించారు. అనంతరం హనుమాన్ జంక్షన్, వెంకీ, రాధా గోపాలం, సంక్రాంతి, శ్రీరామదాసు, ఏవండోయ్ శ్రీవారు, మహారథి, మధుమాసం, నీ సుఖమే నే కోరుకున్నా, పాండురంగడు, అమరావతి, రాజన్న వంటి చిత్రాలతో ఆకట్టుకున్నారు స్నేహ.
హీరోయిన్‌గా కెరీర్ పీక్స్‌లో ఉండగానే తమిళ నటుడు ప్రసన్నతో ప్రేమలో పడిన స్నేహ పెద్దల అంగీకారంతో ఆయనను 2012లో పెళ్లాడారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు. పెళ్లి పిల్లల కారణంగా కొంత గ్యాప్ తీసుకున్నప్పటికీ తిరిగి సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి సన్నాఫ్ సత్యమూర్తి, రాజాధి రాజా, వినయ విధేయ రామ వంటి చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం తమిళంలో మూకుతి అమ్మన్ 2 చిత్రంలో స్నేహ నటిస్తున్నారు. 50కి చేరువ అవుతున్నా చెక్కు చెదరని అందంతో కుర్ర హీరోయిన్లకు పోటీ ఇస్తున్నారు స్నేహ. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే స్నేహ.. ఎప్పటికప్పుడు తన సినిమాలు, వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఇటీవల స్నేహాలయ పేరుతో వస్త్ర వ్యాపారాన్ని ప్రారంభించి దానిని విజయవంతంగా నిర్వహిస్తున్నారు.
ఇటీవల ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్నేహ మాట్లాడుతూ... హీరోయిన్‌గా, నటిగా క్షణం తీరిక లేకుండా సాగుతున్న దశలో నాకు ప్రమాదం జరిగింది. కాళ్లు, చేతులు, వీపుకు గాయాలయ్యాయి. లేచి నడవటానికి కనీసం 8 నెలలకు పైగా సమయం పడుతుందని డాక్టర్లు చెప్పారు. ఆ సమయంలో దర్శకుడు కరు పళనియప్పన్ .. పార్థిబన్ కనవు కథతో నా దగ్గరికి వచ్చారు. అనారోగ్యం కారణంగా కనీసం కదల్లేని స్థితిలో ఇంట్లో పడిఉన్నాను.. ఈ స్థితిలో నన్ను సినిమా కోసం పిలుస్తున్నారా అని నేను ఆశ్చర్యపోయాను. కానీ పళనియప్పన్ మాత్రం.. నువ్వు ఖచ్చితంగా కోలుకుని మళ్లీ లేస్తావని చెప్పి నాలో ధైర్యం, ఆత్మవిశ్వాసం నూరిపోశాడు. ఆ ప్రోత్సాహం, నమ్మకం నేను కోలుకోవడానికి సాయపడ్డాయి. కష్ట సమయంలో మనం పొందే ధైర్యం, ప్రేరణ.. ఖచ్చితంగా మంచి ఫలితాలను ఇస్తాయని స్నేహా పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మీ జీవితం ఎందరికో ఆదర్శమంటూ స్నేహపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.


Click it and Unblock the Notifications











