Naga Chaityana 1st Wedding Anniversary: చైతూ గురించి శోభిత ధూళిపాళ ఎమోషనల్ వీడియో
టాలీవుడ్ అగ్ర కథానాయిక సమంత రూత్ ప్రభు- రాజ్ నిడిమోరు వివాహంతో గడిచిన నాలుగు రోజుల నుంచి సమంత, నాగచైతన్యలు ట్రెండింగ్‌లో ఉన్నారు. వీరిద్దరూ ఏం చేసినా, ఏం మాట్లాడినా క్షణాల్లో వైరల్ అవుతోంది. సమంత- నాగచైతన్యల ప్రేమ, పెళ్లి, విడాకులు, వీరిద్దరి వైవాహిక జీవితం, విడాకులకు దారితీసిన పరిస్ధితులపై మీడియాలో విస్తృతంగా కథనాలు వస్తున్నాయి. ఈ క్రమంలో నాగచైతన్య సతీమణి, సినీనటి శోభిత ధూళిపాళ్ల విడుదల చేసిన వీడియో వైరల్ అవుతోంది. ఈ వివరాల్లోకి వెళితే...
శోభితతో ప్రేమలో పడ్డ చైతూ
సమంతతో విడిపోయిన తర్వాత కొన్నాళ్లు ఒంటరిగానే ఉంటూ కెరీర్‌పై ఫోకస్ పెట్టారు నాగచైతన్య. ఈ దశలో శోభిత ధూళిపాళ్లతో ఆయన ప్రేమలో పడ్డారు. వీరిద్దరి మధ్య ఏడో నడుస్తోందని మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే అప్పట్లో ఎవ్వరూ దీనిని పెద్దగా పట్టించుకోలేదు. కానీ పుకార్లు మాత్రం ఆగలేదు.. కనీసం ఒక్క సినిమా కూడా కలిసి నటించకుండా వీరి మధ్య ఎప్పుడు? ఎలా పరిచయం ఏర్పడింది? అంటూ పలువురు ప్రశ్నించారు. అసలు వీరిద్దరూ కలవడానికి కారణం నాగచైతన్య తండ్రి, కింగ్ అక్కినేని నాగార్జున అని చాలామందికి తెలియదు.

ఎంగేజ్‌మెంట్‌తో షాకిచ్చిన చైతూ- శోభిత
అక్కినేని కుటుంబానికి చెందిన అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌లో శోభిత ఓ సినిమాలో నటించారు. అప్పటి నుంచి అక్కినేని ఫ్యామిలీతో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఓ డిన్నర్‌లో శోభితను స్వయంగా నాగార్జునే కొడుక్కి పరిచయం చేశారట. అలా వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి చివరికి పెళ్లికి దారితీసింది. ఈ ఊహాగానాల మధ్యే 2024 ఆగస్ట్ 4వ తేదీన శోభిత- నాగచైతన్యలు సైలెంట్‌గా ఎంగేజ్‌మెంట్ చేసుకుని షాకిచ్చారు. దీనికి సంబంధించిన ఫోటోలను నాగార్జున స్వయంగా విడుదల చేసే వరకు ఎవ్వరికీ ఈ విషయం తెలియదంటే చైతూ, శోభితలు ఎంత గుట్టుగా వ్యవహరించారో చెప్పొచ్చు. అనంతరం గతేడాది డిసెంబర్ 4వ తేదీన అన్నపూర్ణ స్టూడియోలో శోభిత - నాగచైతన్యల వివాహం ఘనంగా జరిగింది.
పెళ్లయిన తండేల్‌తో బిజీగా
శోభితతో పెళ్లయిన వెంటనే హనీమూన్‌కు సైతం వెళ్లకుండా తన కొత్త సినిమా తండేల్ కోసం శ్రమించారు నాగచైతన్య. షూటింగ్, ప్రమోషనల్ కార్యక్రమాలలో పాల్గొన్నారు. సినిమా రిలీజ్ అయి హిట్ టాక్ అందుకున్న తర్వాత సక్సెస్ సెలబ్రేషన్స్‌లో పాల్గొని ఆ తర్వాత శోభితను తీసుకుని ఫారిన్ ట్రిప్ వేశారు. నాటి నుంచి టాలీవుడ్ స్టార్ కపుల్స్‌లో ఒకరిగా.. పార్టీలు, సినిమా ఈవెంట్స్‌లో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తున్నారు నాగచైతన్య - శోభిత. ఇటీవల నాగచైతన్య పుట్టినరోజు సందర్భంగా హ్యాపీ బర్త్ డే లవర్ అంటూ ఓ ఫోటో విడుదల చేశారు శోభిత. అలా భర్తకు సంబంధించిన ప్రతి సందర్భాన్ని పంచుకుంటున్నారు అక్కినేని వారి కోడలు.
నాగచైతన్యకు శ్రీమతిగా ఏడాది
కాగా.. డిసెంబర్ 4న నాగచైతన్య - శోభితల వివాహం జరిగి ఏడాది పూర్తయ్యింది. తమ మొదటి వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు శోభిత ధూళిపాళ. శ్రీమతిగా ఒక సంవత్సరం అంటూ తమ పెళ్లి వీడియోను పంచుకున్నారు శోభిత. గాలి ఎప్పుడూ తన సొంతింటి వైపు వీస్తుందని... తన భర్తతో కలిసి అప్పుడే ఏడాది ప్రయాణాన్ని పూర్తి చేశానని పేర్కొన్నారు. ఇక ఈ వీడియోలో పెళ్లికూతురిగా శోభిత, పెళ్లికొడుకుగా నాగచైతన్య ముస్తాబు కావడం, తలంబ్రాలు, నాగార్జున సంతోషంగా ఉండటం వంటి మధుర క్షణాలను ప్రస్తావించారు. అలాగే తన భార్య గురించి నాగచైతన్య గొప్పగా చెప్పుకొచ్చారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుండగా.. సమంత- రాజ్ నిడిమోరుల వివాహం నేపథ్యంలో శోభిత వీడియో హాట్ టాపిక్‌గా మారింది.


Click it and Unblock the Notifications











