నా భర్తతో గొడవలు నిజమే... నా జట్టు పట్టుకుని... సోనాక్షి సిన్హా షాకింగ్ కామెంట్స్
ప్రస్తుతం సెలబ్రిటీలు విడాకుల వార్తలతో కలకలం రేపుతున్నారు. ఎప్పుడు? ఎవరు? విడాకుల బాంబు పేలుస్తారోనని ఇండస్ట్రీ జనాలు టెన్షన్ పడుతున్నారు. ఈ ఏడాది టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు వెండితెర, బుల్లితెరకు చెందిన పలువురు స్టార్ కపుల్స్ విడాకులు తీసుకున్నారు. మరికొందరు అదే పనిలో ఉన్నట్లుగా గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. వీరిలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా - జహీరో ఇక్బాల్ కపుల్ కూడా ఉంది. తాజాగా హీరోయిన్ సోహా అలీఖాన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సోనాక్షి సిన్హా తన వైవాహిక జీవితంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వివరాల్లోకి వెళితే..
కాస్ట్యూమ్ డిజైనర్ టూ హీరోయిన్
బాలీవుడ్ రెబల్ స్టార్ శతృఘ్న సిన్హా నట వారసురాలిగా ఎంట్రీ ఇచ్చారు సోనాక్షి సిన్హా. తొలినాళ్లలో కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేసిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత తండ్రి బాటలో సినీరంగం వైపు అడుగులు వేశారు. 2010లో కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా వచ్చిన దబాంగ్‌లో హీరోయిన్‌గా నటించారు. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ కావడంతో సోనాక్షి రాత్రికి రాత్రి స్టార్ హీరోయిన్ అయిపోయారు. బొద్దుగా, ముద్దుగా కనిపించే సోనాక్షి డేట్స్ కోసం దర్శక నిర్మాతలు క్యూకట్టారు. ఈ సినిమా తర్వాత రౌడీ రాథోడ్, జోకర్, సన్ ఆఫ్ సర్దార్, దబాంగ్ 2, లూటేరా, బాస్, బుల్లెట్ రాజా, ఆర్ రాజ్‌కుమార్, యాక్షన్ జాక్షన్ తదితర చిత్రాల్లో నటించారు.

జహీర్ ఇక్బాల్‌తో డేటింగ్, పెళ్లి
హిందీతో పాటు తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ సరసన హీరోయిన్‌గా నటించారు. గ్లామర్ షోకు దూరంగా కథా ప్రాధాన్యమున్న పాత్రల్నే ఎంచుకుంటూ నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు సోనాక్షి సిన్హా. డబుల్ ఎక్స్ఎల్ సినిమా సమయంలో నటుడు జహీర్ ఇక్బాల్‌తో ప్రేమలో పడిన సోనాక్షి సిన్హా దాదాపు ఏడేళ్ల పాటు డేటింగ్ చేశారు. అనంతరం పెద్దల అంగీకారంతో 2024 జూన్ 23న వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వేర్వేరు మతాలకు చెందిన వీరి పెళ్లిపై పలు విమర్శలు రాగా సోనాక్షి వాటిని ఎదుర్కొని నిలిచారు. భర్త, అత్తమామలు కూడా ఈ విషయంలో సోనాక్షికి అండగా నిలిచారు.
జహీర్‌తో విడాకులంటూ గాసిప్స్
పెళ్లయిన కొద్దిరోజులకే సోనాక్షి సిన్హా గర్భం దాల్చినట్లుగా వార్తలు వచ్చాయి. అలాగే వీరి వైవాహిక జీవితం పైనా రకరకాల ఊహాగానాలు వినిపించాయి. వీరిద్దరూ వేర్వేరుగా ఉంటున్నారని, త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నారని కథనాలు వచ్చాయి. తాజాగా సోహా అలీఖాన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో విడాకుల వార్తలపై సోనాక్షి సిన్హా స్పందించారు. ఇదొక న్యూసెన్స్.. ఇలాంటి వచ్చిన తొలి వ్యక్తిని నేను కాదు, నేనే చివరి వ్యక్తి కూడా కాదు. ఎదిగిన స్త్రీ తన జీవితాన్ని తనకు నచ్చినట్లుగా ఎంపిక చేసుకుంటుంది. ఏదో ఒక కారణం చేత ప్రతి ఒక్కరూ తమ అభిప్రాయాన్ని పంచుకున్నారు. జీవితాన్ని గడపటం మాకు చాలా ఆనందంగా ఉంది అని సోనాక్షి తెలిపారు.
మా మధ్య గొడవలు జరిగాయి
మనం సోషల్ మీడియా ప్రపంచంలో జీవిస్తున్నాం. అందువల్ల నా జీవిత భాగస్వామి గురించి, నా కుటుంబం గురించి ప్రతికూల విషయాలను చదవాలని నేను అనుకోవడం లేదు. అందరి ప్రేమకథల మాదిరిగానే నాకు, ఇక్బాల్‌కి గొడవ జరిగింది. మూడేళ్ల పాటు ప్రేమలో ఉన్నాక ఒకరినొకరం జుట్టు పట్టుకుని పీక్కునేంతగా గొడవపడ్డాం. ఒకరి అభిప్రాయాలను, ఆలోచనలను మరొకరం అర్ధం చేసుకోలేకపోయాం. గొడవలు జరుగుతున్నాయని బ్రేకప్ చెప్పేసుకోవాలని అనుకోలేదు.. సమస్యను పరిష్కరించుకోవాలని అనుకున్నాం. దీనిలో భాగంగా కపుల్స్ థెరపీకి వెళ్లాలనే ప్రతిపాదనను జహీర్ తీసుకొచ్చాడు అని సోనాక్షి వెల్లడించారు.
ఆ థెరపీ మా జీవితాల్ని మార్చింది
ఆయనతో బంధాన్ని కొనసాగించాలని నేను కోరుకుంటున్నాను. అందుకే ఈ ప్రతిపాదనకు వెంటనే ఒకే చెప్పి ఒకసారి ప్రయత్నిద్దామని అనుకున్నాం. రెండు సెషన్స్‌లోనే మా ఆలోచనల్లో మార్పు వచ్చింది. ఇది అవతలి వ్యక్తి ఆలోచించే విధానాన్ని అర్ధం చేసుకోవడానికి సహాయపడింది. చిన్న చిన్న విషయాల గురించి కాదు.. విషయాలను వ్యక్తిగతంగా తీసుకోవడం గురించి కూడా కాదు.. వ్యక్తిని అర్ధం చేసుకోవడానికి కపుల్స్ థెరపీ సాయపడింది. మేమిద్దరం ఒకరినొకరు అర్ధం చేసుకోవడంలో చాలా అంశాలు కీలకపాత్ర పోషించాయి. ఇక్కడ గౌరవం ఇచ్చిపుచ్చుకోవడం అనేది చాలా ముఖ్యమైనది. నేను నా భాగస్వామిని గౌరవించాలి, నా భాగస్వామి నన్ను గౌరవించాలి. చుట్టూ ఉన్న వ్యక్తులను జహీర్ బాగా గౌరవిస్తారు. నేను ఆయనలో మొదట గమనించిన విషయం అదే. భావోద్వేగాలను ఆయన నియంత్రించుకుంటాడు.. అలాగే నా భావాలను, భావోద్వేగాలను కూడా అర్ధం చేసుకుంటాడు. ఇలాంటి వారు అరుదు అంటూ జహీర్‌తో విడాకుల వార్తలను ఖండించారు సోనాక్షి సిన్హా.


Click it and Unblock the Notifications











