అద్దె కట్టడానికి కూడా డబ్బు లేదు.. అలాంటి సినిమాలు చేయాల్సి వచ్చిందన్న సోనాలి బింద్రే!
తెలుగువారికి సోనాలి బింద్రే గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగులో 'మురారి', 'ఖడ్గం', 'ఇంద్ర', 'మన్మథుడు', 'శంకర్‌దాదా ఎమ్‌బీబీఎస్' వంటి పలు తెలుగు హిట్ చిత్రాల్లో నటించచిన ఆమె తరువాత కనుమరుగు అయింది. ఇక తాజాగా క్యాన్సర్‌తో పోరాడి గెలిచిన ఆమె ఇటీవలే ది బ్రోకెన్ న్యూస్ అనే వెబ్‌సిరీస్‌లో నటించింది. ఈ బ్రోకెన్ న్యూస్ జూన్ 10 నుంచి జీ5లో ప్రసారం కానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్ లో పాల్గొంటున్న ఆమె అనేక విషయాలను పంచుకుంటోంది. తాజాగా తన కుటుంబం ఎదుర్కొన్న ఇబ్బందులు గురించి ఆమె ఆసక్తికర విషయాలు పంచుకుంది. ఆ వివరాలు

మోడలింగ్ చేస్తూ
ముంబై లో పుట్టి పెరిగిన సోనాలి బింద్రే తొలుత హిందీ పరిశ్రమ ద్వారా సినీ రంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత ఆమె తెలుగు, తమిళ, కన్నడ, మరాఠీ సినిమాలు కూడా చేసి అనేక ప్రశంసలు, అవార్డులు కూడా సంపాదించింది. సినిమాల్లోకి రావడానికి ముందు ఆమె మోడలింగ్ చేస్తూ, కొన్ని అడ్వర్టైజ్మెంట్ లలో నటించిన తర్వాత 94లో ఆగ్ అనే సినిమా ద్వారా ఆమె హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.

మురారి సినిమాతో
అయితే ఆమెకు మంచి గుర్తింపు తీసుకు వచ్చిన సినిమా మాత్రం అజయ్ దేవగన్ హీరోగా నటించిన దిల్జాలే సినిమా. ఆ తర్వాత ఆమె హిందీలో మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం పడలేదు. అలా సుమారు ఆరేళ్ల పాటు హిందీలో వరుస సినిమాలు చేసిన ఆమె మురారి సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఖడ్గం, మన్మధుడు, పల్నాటి బ్రహ్మనాయుడు, శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్, వంటి సినిమాలలో కనిపించి అందరినీ ఆకట్టుకుంది.

గ్యాప్ తీసుకుని
కేవలం 10 ఏళ్ళు మాత్రమే సినిమాల్లో నటించిన ఆమె 2004 సంవత్సరం తర్వాత గ్యాప్ తీసుకుని తర్వాత 2013లో ఒక సినిమాలో చిన్న పాత్రలో కనిపించింది. సినిమాలకు దూరం గానే ఉన్నా టెలివిజన్ ద్వారా ఆమె ప్రేక్షకులకు దగ్గరగానే ఉంది. పలు కార్యక్రమాలకు జడ్జిగా వ్యవహరిస్తూ ఆమె అందరికీ తలలో నాలుకలా వ్యవహరిస్తూ ఉండేది. అలాంటి ఆమె క్యాన్సర్ బారిన పడి కోలుకుంది.

అద్దె కట్టాలన్నా
తాజాగా ఆమె ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకుంది. అవి ఏమిటి అంటే ఒక సమయంలో తనకు చాలా డబ్బులు అవసరం అయ్యాయని, ఇల్లు మొత్తం తానే మెయింటైన్ చేయాలి కాబట్టి, ఇంటి అద్దె కట్టాలన్నా, బిల్లు కట్టాలన్నా ఇబ్బందులు పడాల్సి వచ్చింది అని చెప్పుకొచ్చింది. నా కుటుంబం క్లిష్ట పరిస్థితుల్లో ఉండడంతో ఎలాంటి పాత్రలు వచ్చినా చేసుకుంటూ వెళ్లాను అని ఆమె పేర్కొంది.

డబ్బు కోసమే
కొన్ని పాత్రలు చేసిన తర్వాత మరో సినిమాకు రెడీ అయ్యే టైంలో ఎందుకు ఈ ప్రాజెక్టు ఒప్పుకున్నాను అనే ఆలోచనలో పడేదాన్ని అని ఆమె చెప్పుకొచ్చింది. వెంటనే ఏది ఏమైనా సరే డబ్బులు వస్తే చాలు అని భావిస్తూ ఎలాంటి ప్రాజెక్ట్ అయినా చేయడానికి సిద్ధపడ్డానని ఆమె చెప్పుకొచ్చారు. అతిగా ఆలోచించకుండా కేవలం డబ్బు కోసమే ఆ పాత్రలు చేసుకుంటూ వెళ్లానని ఆ సినిమాలు మీరే కాదు నన్ను నేనే చూసుకోలేను అంటూ సోనాలి బింద్రే చెప్పుకొచ్చారు.


Click it and Unblock the Notifications











