Doctor Sreeleela: ఎన్నో కన్నీళ్లు, త్యాగాల ఫలితం... ఎంబీబీఎస్ డిగ్రీపై శ్రీలీల ఎమోషనల్ పోస్ట్
డాక్టర్ కాబోయి యాక్టర్ అయినవాళ్లు సినీ పరిశ్రమలో ఎందరో ఉన్నారు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఈ లిస్ట్ చాలా పెద్దది. పలువురు నటీనటులు చాలా ఇంటర్వ్యూలలో ఈ విషయాన్ని చెప్పుకుని బాధపడ్డారు. అయితే కొందరు స్టార్స్ మాత్రం ఆల్రెడీ డాక్టర్ చదివి నటనపై పిచ్చితో సినీ ఇండస్ట్రీ వైపు అడుగులు వేశారు. అయితే యాక్టర్‌గా సినీ రంగంలో అడుగుపెట్టి తర్వాత డాక్టర్ అయిన నటీనటులు అరుదు. తాజాగా ఈ ఘనత సాధించారు యంగ్ బ్యూటీ శ్రీలీల. ఇటీవల ఎంబీబీఎస్ పట్టా అందును అందుకున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా ఎమోషనల్ అయ్యారు. ఈ వివరాల్లోకి వెళితే..
24 వయసులోనే స్టార్ హీరోయిన్ అనిపించుకున్నారు శ్రీలీల. ఎందరో ముద్దుగుమ్మలు ఏళ్లుగా కష్టపడుతున్న ఈ క్రేజ్‌ను శ్రీలీల ఈజీగా అందుకున్నారు. చేసిన సినిమాలు వరుసపెట్టి ఫ్లాప్స్ అవుతున్నా శ్రీలీలకు మాత్రం అవకాశాలు క్యూకడుతూనే ఉన్నాయి. మహేశ్ బాబు, అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ వంటి అగ్రనటుల సరసన నటించే అరుదైన అవకాశాన్ని అందుకున్నారు శ్రీలీల. ఇటీవల తమిళంలో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మకు తొలి చిత్రం శివకార్తీకేయన్‌తో చేసే అవకాశం వచ్చింది. ఆ వెంటనే మరో స్టార్ హీరో ధనుష్‌తో నటించే ఛాన్స్ కొట్టేసింది. ఇక హిందీలో కార్తీక్ ఆర్యన్ సినిమా ద్వారా బాలీవుడ్‌లో అడుగుపెట్టనుంది.

కెరీర్ పరంగా ప్రస్తుతం పీక్స్‌లో ఉన్న శ్రీలీల.. చిన్న వయసులోనే సామాజిక కార్యక్రమాల్లోనూ ముందుంది. ఇప్పటికే ముగ్గురు చిన్నారుల బాధ్యతను తీసుకుని.. తల్లిలా వారి ఆలనా పాలనా చూస్తున్నారు శ్రీలీల. చిన్నప్పటి నుంచి చదువులో ముందుండే ఈ ముద్దుగుమ్మకు డాక్టర్ కావాలన్నది కల.. అనుకోకుండా నటన వైపు వచ్చిన చదువును నిర్లక్ష్యం చేయలేదు. షూటింగ్స్, సినిమాలు, ఇతర కార్యక్రమాలతో బిజీగా ఉన్నా.. వీలున్నప్పుడల్లా చదువుకుంటూనే వచ్చింది. సినీ జీవితాన్ని, చదువును బ్యాలెన్స్ చేస్తూ ముందుకెళ్లింది. ఈ క్రమంలో శ్రీలీల తన డాక్టర్ కలను నెరవేర్చుకున్నారు.
ఫిబ్రవరి 10న ముంబైలోని డీవై పాటిల్ యూనివర్సిటీలో జరిగిన స్నాతకోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీలీల.. అధికారికంగా ఎంబీబీఎస్ పట్టాను అందుకున్నారు. మెరూన్ రంగు గౌను ధరించి వేదికపై శీలీల వెళ్తుండగా.. ఆమె తల్లి ఎమోషనల్ అయ్యారు. అనంతరం తన సహచరులతో కలిసి ప్రమాణ స్వీకారం చేశారు. పట్టా అందుకున్న తర్వాత తన కుటుంబసభ్యులను హత్తుకుని ఎమోషనల్ అయ్యారు శ్రీలీల. 2020 బ్యాచ్‌తో కలిసి శ్రీలీల డాక్టర్‌గా ఈ ఎంబీబీఎస్ పట్టా పుచ్చుకున్నారు. దాంతో పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు శ్రీలీల డెడికేషన్, పట్టుదలను ప్రశంసిస్తూ విషెస్ తెలియజేశారు.
తాజాగా తాను డాక్టర్ కావడం పట్ల శ్రీలీల ఎమోషనల్ అయ్యారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టారు. ఒక ప్రయాణం - తెలిసినో తెలియకనో మీరు అందులో భాగమైన ప్రయాణం. నేను ప్రశాంతంగా ఉండే పవిత్ర స్థలం.. నేను నేనుగా ఉండగలిగే ప్రదేశం. మీ అమ్మాయి తన మాట నిలబెట్టుకుంది. ఇది కేవలం ఒక డిగ్రీ గురించి కాదు.. ఇది ఎదుగుదల, విశ్వాసం, కన్నీళ్లు, మార్పు వంటి ఎన్నో అంశాల మేళవింపు. నా కుటుంబానికి, నా స్నేహితులకు, నా సహోద్యోగులకు ముఖ్యంగా.. నా పరీక్షల సమయంలో సహాయం చేసినందుకు, కన్‌ఫ్యూజన్‌లో నాకు అండగా నిలిచినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. నన్ను నేను నమ్ముకోవడం నేర్చుకుంటున్నప్పుడు.. నన్ను నమ్మిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ఈ పోస్ట్ చదువుతున్న పాఠకులకు.. మీరు నాకు కేటాయించిన సమయానికి, ప్రతి చిరునవ్వుకు, మీ ప్రోత్సహానికి, మీ ప్రార్ధనలకు మీ పట్ల నాకు కృతజ్ఞత ఉంది. ఈ కొత్త అధ్యాయం నన్ను తీర్చిదిద్దింది, ఇది నన్ను వినయంగా చేసింది, మరింత బలపరిచింది. కాబట్టి నన్ను నేను మీకు తిరిగి పరిచయం చేసుకుంటున్నా.. ప్రేమతో మీ డాక్టర్ శ్రీలీల అంటూ ఆమె రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా శ్రీలీలకు నెటిజన్లు, సినీ ప్రముఖులు విషెస్ తెలియజేస్తున్నారు.


Click it and Unblock the Notifications











