చేతులు జోడించి వేడుకుంటున్నా.. హద్దులు దాటొద్దంటూ హీరోయిన్ శ్రీలీల..
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ శ్రీలీల (Sreeleela) మరోసారి వార్తల్లో నిలిచింది. ఈసారి సినిమా అప్డేట్‌తో కాదు, సోషల్ మీడియాలో ఆమె ఓ ఎమోషనల్ పోస్టు చేసింది. కృత్రిమ మేధస్సు (AI) పేరుతో సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారం, అభ్యంతరకర కంటెంట్‌పై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. ఈ సమయంలో శ్రీలీల రెండు చేతులు జోడించి చేసిన విజ్ఞప్తి ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకీ ఏమన్నారంటే..?
'పెళ్లి సందడి' సినిమాతో తెలుగు వెండితెరకు పరిచయమైన శ్రీలీల, తొలి సినిమాతోనే కుర్రకారును ఆకట్టుకుంది. ఆ సినిమా విజయం సాధించకపోయినా.. ఆమె ఎనర్జీ, స్క్రీన్ ప్రెజెన్స్ కారణంగా వరుస అవకాశాలు అందుకున్న ఈ బ్యూటీ. అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్‌గా మారింది. ఒకేసారి తొమ్మిది సినిమాలకు సైన్ చేసి ఇండస్ట్రీలో రికార్డ్ క్రియేట్ చేసిన శ్రీలీల, సక్సెస్ ఫెల్యూర్ అనే తేడా లేకుండా తన కెరీర్‌ను దూకుడుగా ముందుకు తీసుకెళ్తోంది. ఇటీవల బాలీవుడ్ పై కూడా కన్నేసింది.

అయితే ఇటీవల సోషల్ మీడియాలో ఏఐ పేరుతో వైరలవుతున్న కొన్ని అభ్యంతరకర వీడియోలు, ఫొటోలు, ట్రోలింగ్ కంటెంట్ తనను తీవ్రంగా కలచివేశాయని శ్రీలీల వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఆమె చేసిన పోస్ట్ అందరినీ ఆలోచింపజేసేలా ఉంది. ఆ పోస్ట్ లో 'నేను రెండు చేతులు జోడించి ప్రతి సోషల్ మీడియా యూజర్‌ను వేడుకుంటున్నాను. ఏఐతో క్రియేట్ చేసిన అభ్యంతకర, అసభ్యకర కంటెంట్‌కు సపోర్టు ఇవ్వకండి. టెక్నాలజీ అభివృద్ధి మన జీవితాలను సులభతరం చేయడానికి ఉండాలి. కానీ, వాటిని మరింత సంక్లిష్టం చేయడానికి కాదు'అంటూ గట్టిగా హెచ్చరించింది శ్రీలీల.
ఏఐ టెక్నాలజీని వినియోగించడానికీ, దుర్వినియోగం చేయడానికీ మధ్య స్పష్టమైన తేడా ఉందని శ్రీలీల పేర్కొన్నారు. వినోదం పేరుతో మహిళలను లక్ష్యంగా చేసుకుని చేసే ట్రోలింగ్, మానసిక వేధింపులు ఎంతటి నష్టాన్ని కలిగిస్తాయో ఆమె మాటల్లో స్పష్టంగా కనిపించింది.
'ప్రతి అమ్మాయి ఎవరికో ఒకరికి కూతురు, మనవరాలు, సోదరి, స్నేహితురాలు లేదా సహచరురాలు. కళను ఒక వృత్తిగా ఎంచుకున్నందుకే ఆమెను అవమానించడం, లక్ష్యంగా చేసుకోవడం ఎంతమాత్రం సమంజసం కాదు'అంటూ ఆమె ఎమోషనల్ గా స్పందించారు.
ఇండస్ట్రీ గురించి కూడా ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. 'మేము మా ప్రేక్షకులకు ఆనందాన్ని అందించాలని భావిస్తాం.. అదే సమయంలో ఇది మాకు సురక్షితమైన వాతావరణం అనే నమ్మకం కూడా ఉండాలి' అని చెప్పారు. ఈ వ్యాఖ్యలు మహిళా నటీమణుల భద్రతపై జరుగుతున్న చర్చకు మరింత బలం చేకూర్చాయి. 'ఈ విషయాలన్నీ నా దృష్టికి తీసుకువచ్చిన నా శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు. ఇప్పటివరకు చిన్న విషయాలను పెద్దగా పట్టించుకోకుండా నా ప్రపంచంలో నేనే జీవించాను. కానీ ఈ ఘటన మాత్రం నన్ను తీవ్రంగా కలచివేసింది. ఇది నిజంగా బాధాకరమైనది, మనసును నొప్పించేదీ' అని ఆమె వేదన వ్యక్తం చేశారు.
ఇది తన ఒక్కడి సమస్య కాదని, చాలా మంది ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ఆమె వెల్లడించారు. 'నా తరఫునే కాదు, ఇలాంటి దాడులకు గురవుతున్న నా సహచరుల తరఫున కూడా నేను మాట్లాడుతున్నాను. మా వెంట నిలబడి మాకు మద్దతివ్వండి. ఇకపై ఈ విషయాన్ని సంబంధిత అధికారులు చూసుకుంటారు' అని స్పష్టం చేశారు.
శ్రీలీల చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతోంది. అనేక మంది నెటిజన్లు, సినీ ప్రముఖులు ఆమెకు మద్దతుగా నిలుస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ఏఐ టెక్నాలజీని బాధ్యతాయుతంగా ఉపయోగించాలన్న సందేశాన్ని శ్రీలీల వ్యాఖ్యలు మరోసారి బలంగా గుర్తు చేస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


Click it and Unblock the Notifications











