Sridevi Death Anniversary: స్పిల్‌బర్గ్‌కే షాకిచ్చిన శ్రీదేవి.. అతిలోక సుందరిని మిస్ చేసుకున్న హాలీవుడ్!
ప్రపంచంలోని నటీనటుల కల ఏదైనా ఉందంటే అది హాలీవుడ్‌లో నటించడమే. ఇందుకోసం ఎన్నో ప్రణాళికలు, త్యాగాలు చేయాల్సిందే. అన్నింటికి మించి అక్కడ అడుగుపెట్టాలంటే టాలెంట్‌తో పాటు ప్రతిభ ఉండి.. ఎన్నో అడ్డంకులను దాటాల్సిందే. అలాంటిది హాలీవుడ్ నుంచి దిగ్గజ దర్శకుడు స్వయంగా వచ్చి పిలిచి తన సినిమాలో ఆఫర్ ఇస్తే.. ఎవరైనా వద్దంటారా? ఆ సాహసం కూడా ఎవరూ చేయరు. కానీ దివంగత అతిలోక సుందరి శ్రీదేవి ఇలాంటి ఆఫర్‌ను రిజెక్ట్ చేశారు. ఫిబ్రవరి 24వ తేదీన శ్రీదేవి వర్ధంతి సందర్భంగా ఆమె జీవితంలోని కొన్ని విషయాలను పరిశీలిస్తే..
అందమే అసూయపడే అందంతో, తన అద్భుతమైన అభినయంతో భారతీయ సినీ పరిశ్రమను మకుటం లేని మహారాణిలా ఏలారు శ్రీదేవి. భారతదేశం గర్వించదగ్గ గొప్ప నటీమణుల్లో ఒకరిగా శ్రీదేవి చరిత్రలో నిలిచిపోయారు. 50 ఏళ్ల సినీ ప్రస్థానంలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో వందలాది చిత్రాల్లో నటించి అలరించారు. చిన్న వయసులోనే తిరిగిరాని లోకాలకు తరలిపోయి కోట్లాది మంది అభిమానులను విషాదంలోకి నెట్టారు. ఆమె చనిపోయారంటే ఇప్పటికీ నమ్మలేని పరిస్ధితుల్లో అభిమానులు ఉన్నారు.

13 ఆగస్ట్ 1963న తమిళనాడులోని శివకాశీ జిల్లా మీనంపట్టిలో జన్మించారు శ్రీదేవి. ఆమె పూర్తి పేరు శ్రీ అమ్మాయంగర్ అయ్యప్పన్. నాలుగేళ్ల వయసులోనే తమిళ చిత్రం కాందహన్ కరుణై (1967) ద్వారా వెండితెరపై అడుగుపెట్టారు. తన స్క్రీన్ నేమ్‌ను శ్రీదేవిగా మార్చుకుని 1976లో మూండ్రు ముడిచు అనే సినిమాలో 13 ఏళ్ల వయసులోనే హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత 16 ఏళ్ల వయసు సినిమాతో ఆమె హీరోయిన్‌గా తొలి బ్రేక్ అందుకున్నారు. ఆ తర్వాత దాదాపు నాలుగు దశాబ్ధాల పాటు భారతీయ చిత్ర పరిశ్రమకు కేరాఫ్ అడ్రస్‌గా మారారు.
దక్షిణాదిలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు, చిరంజీవి, కమల్ హాసన్, రజనీకాంత్ వంటి అగ్రనటుల సరసన నటించి సౌతిండియన్ ఇండస్ట్రీలో తిరుగులేని నటి అనిపించుకున్న శ్రీదేవి హిందీలో అడుగుపెట్టి అక్కడా సత్తా చాటారు. హిమ్మత్ వాలా, తోఫా, కర్మ, నాగినా తదితర చిత్రాలతో ఆ తరంలో కుర్రాళ్ల కలల రాకుమారిగా గుర్తింపు తెచ్చుకున్నారు. రాజేష్ ఖన్నా, జితేంద్ర, ధర్మేంద్ర, అమితాబ్ బచ్చన్, అనిల్ కపూర్, మిథున్ చక్రవర్తి వంటి నాటి అగ్రనటుల సరసన నటంచారు శ్రీదేవి.
హిందీ చిత్ర నిర్మాత బోనీకపూర్‌ని 1996లో పెళ్లి చేసుకున్నారు శ్రీదేవి. ఈ దంపతులకు ఖుషికపూర్, జాన్వీ కపూర్ సంతానం. వీరి కెరీర్ కోసం ఎంతో కష్టపడిన శ్రీదేవి.. వీరి ఎదుగుదల చూడకుండానే తిరిగిరాని లోకాలకు తరలిపోయారు. దుబాయ్‌లో బంధువుల ఇంట్లో పెళ్లికి వెళ్లిన శ్రీదేవి 2018 ఫిబ్రవరి 24వ తేదీన అక్కడి హోటల్‌లో ప్రమాదవశాత్తూ బాత్‌టబ్‌లో పడి ప్రాణాలు కోల్పోయారు. ఆమె మరణం భారతీయ చిత్ర పరిశ్రమను దిగ్భ్రాంతికి గురిచేసింది. కోట్లాది మంది అభిమానుల అశ్రు నయనాలు, ప్రభుత్వ లాంచనాల మధ్య శ్రీదేవి అంత్యక్రియలు జరిగాయి.
శ్రీదేవి తన వృత్తి పట్ల ఎంతో అంకితభావంతో ఉండేవారని సన్నిహితులు చెబుతారు. 1989లో చాల్‌బాజ్ మూవీలోని రెయిన్ సాంగ్ ఎంతో పాపులర్ అన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సమయంలో శ్రీదేవి 103 డిగ్రీల జ్వరంతో బాధపడుతున్నారు. కనీసం నిలబడటానికి కూడా ఓపిక లేకపోయినప్పటికీ.. తన వల్ల నటీనటుల కాల్షీట్స్, నిర్మాతల డబ్బు వృథా కాకూడదని అంతటి బాధను పంటి బిగువున భరించి చల్లటి నీటిలో డ్యాన్స్ చేస్తూ షూటింగ్ పూర్తి చేశారు. శ్రీదేవిలో మంచి సింగర్ కూడా ఉన్నారు. సాద్మా, చాందిని, ఘర్జన, క్షణ క్షణం సినిమాలలో పాడారు.
భారతీయ చిత్ర పరిశ్రమలో తొలి లేడీ సూపర్‌స్టార్‌గా క్రేజ్ దక్కించుకున్న శ్రీదేవి.. హాలీవుడ్ సినిమాలలో ఎందుకు నటించలేదని ఆమె అభిమానులకు సందేహం. అయితే శ్రీదేవికి ఏనాడో హాలీవుడ్‌లో నటించే అవకాశం దక్కింది. అది కూడా దిగ్గజ దర్శకుడు స్టీవెన్ స్పిల్‌బర్గ్ డైరెక్షన్‌లో. 1993లో స్పిల్‌బర్గ్ దర్శకత్వంలో వచ్చిన జూరాసిక్ పార్క్ ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమాలో ఓ కీలకపాత్ర కోసం శ్రీదేవిని స్వయంగా సంప్రదించారట స్పిల్‌బర్గ్. అయితే ఆ సమయంలో బిజీగా ఉండటంతో జురాసిక్ పార్క్‌లో ఆఫర్‌ను తిరస్కరించారట శ్రీదేవి. ఒకవేళ ఆమె కనుక ఆ పాత్ర చేసుంటే హాలీవుడ్‌లో టాప్ రేంజ్‌కు వెళ్లేవారేనని విశ్లేషకులు చెబుతున్న మాట. ఫిబ్రవరి 24న శ్రీదేవి వర్ధంతి సందర్భంగా ఆ మహానటికి నివాళులర్పిస్తోంది ఫిల్మీబీట్.


Click it and Unblock the Notifications











