వేలానికి శ్రీదేవి చీర.. రూ.1.30 లక్షలకు చేరిన బిడ్!
అతిలోక సుందరి శ్రీదేవి మరణ విషాదం నుంచి కోలుకోవడానికి అభిమానులకు, కుటుంబ సభ్యులకు చాలా సమయమే పట్టింది. గతేడాది దుబాయ్‌లో ఓ పెళ్లివేడుకలో పాల్గొనడానికి వెళ్లిన శ్రీదేవి ప్రమాద వశాత్తు మరణించిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 24న శ్రీదేవి తొలి వర్ధంతి సందర్భంగా బోనీ కపూర్ ఫ్యామిలీ సేవా కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించింది.
ఇందులో భాగంగా శ్రీదేవికి ఇష్టమైన 'కోటా' చీర 'పరిసెర' అనే ఆన్‌లైన్ వెబ్ సైట్లో వేలానికి పెట్టారు. రూ.40 వేలు కనీస ధరగా నిర్ణయించి బిడ్ ప్రారంభించారు. శ్రీదేవి అభిమానులు ఈ చీర దక్కించుకోవడానికి పోటీ పడుతుండటంతో ప్రస్తుతం బిడ్ రూ. 1.30 లక్షలకు చేరింది.
శ్రీదేవి వర్ధంతి అయిన ఫిబ్రవరి 24 వరకు ఈ చీర వేలంలో ఉంటుంది. ఈ లోగా ఎవరు ఎక్కువ బిడ్ వేస్తే వారికి ఈ చీర దక్కుతుంది. ఈ వేలం ద్వారా వచ్చిన మొత్తాన్ని మహిళా సాధికారత కోసం పని చేస్తున్న 'కన్సెర్న్ ఇండియా ఫౌండేషన్' అనే స్వచ్ఛంద సంస్థకు డొనేట్ చేయనున్నారు.

శ్రీదేవి మరణించినపుడు మీడియాలో పలు అనుమానాలు రేకెత్తిస్తూ రకరకాల ప్రచారం జరిగింది. ఆమె మరణం వెనక కుట్రకోణం ఉందనే డౌట్స్ అభిమానులను విస్మయ పరిచాయి. విచారణ అనంతరం దుబాయ్ పోలీసులు అలాంటిదేమీ లేదని, గుండె పోటు రావడంతో బాత్ టబ్‌లో పడిపోవడం వల్ల చనిపోయారని తేల్చారు. అయినప్పటికీ అభిమానుల్లో సమాధానం దొరకని ఎన్నో విషయాలు అలా ఉండిపోయాయి.


Click it and Unblock the Notifications











