47 ఏళ్ల వయసులో OG నటి మార్షల్ ఆర్ట్స్ విన్యాసాలు.. టచ్ చేస్తే పీక తెగాల్సిందే!
మూడు గంటల పాటు మనకి వినోదం అందించడానికి నటీనటులు ఎంతో శ్రమిస్తారు. వర్కవుట్స్, డైట్, అందం ఇలా ప్రతిదాని విషయంలోనూ ఎంతో కేర్ తీసుకుంటారు. మారుతున్న పరిస్ధితులు, కథకు అనుగుణంగా హీరోయిన్లు కూడా హీరోల మాదిరిగానే సిక్స్ ప్యాక్‌లు, కండలు తిరిగిన దేహాల కోసం ప్రయత్నిస్తున్నారు. అలాగే కర్రసాము, కత్తి సాము, గుర్రపు స్వారీ సహా యాక్షన్ స్టంట్స్ ఎలా చేయాలో నేర్చుకుంటూ హీరోలకు ఏమాత్రం తీసిపోయేది లేదని నిరూపిస్తున్నారు. తాజాగా 47 ఏళ్ల వయసులో మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేస్తూ షాకిచ్చారు ఓ నటి. ఈ వివరాల్లోకి వెళితే..
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో వచ్చిన ఓజీ మూవీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. అభిమానులు ఎలా చూడాలని అనుకుంటున్నారో ఆ విధంగా పవన్ కళ్యాణ్‌ను చూపించి హిట్ కొట్టారు సుజిత్. హై ఎండ్ యాక్షన్, మాస్ మసాలా మూవీగా వచ్చిన ఓజీ ఏకంగా 300 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించి పవన్ కళ్యాణ్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాలో పవన్ సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటించగా.. బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మి విలన్‌గా నటించారు. ప్రకాశ్‌రాజ్, అర్జున్ దాస్, శ్రీయా రెడ్డి, సుదేవ్ నాయర్, శుభలేఖ సుధాకర్, రాహుల్ రవీంద్రన్ తదితరులు కీలకపాత్రలు పోషించారు.

ఈ చిత్రంలో గీతగా పవర్‌ఫుల్ రోల్‌లో కనిపించి మెప్పించారు శ్రియా రెడ్డి. ఒకప్పడు దక్షిణాదిలో హీరోయిన్‌గా సత్తా చాటారు ఈ ముద్దుగుమ్మ. సమురాయ్ మూవీతో తమిళ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన శ్రియా రెడ్డి.. అప్పుడప్పుడు మూవీతో తెలుగు వారిని పలకరించారు. తెలుగు, తమిళ, మలయాళం, ఇంగ్లీష్ భాషలలో పలు చిత్రాల్లో నటించినా ప్రాధాన్యం ఉన్న పాత్రలే పోషించేవారు. కెరీర్ పీక్స్‌లో ఉండగానే హీరో విశాల్ సోదరుడు, నిర్మాత విక్రమ్ కృష్ణను 2008లో పెళ్లాడారు శ్రియా రెడ్డి. ఈ దంపతులకు అమాలియా అనే కుమార్తె ఉంది.
పెళ్లి తర్వాత భర్త, కూతురి కోసం కొన్నాళ్లు సినిమాలకు బ్రేక్ ఇచ్చారు శ్రియారెడ్డి. తిరిగి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన ఆమె తన వయసు, ఇమేజ్‌కు తగ్గ పాత్రలు పోషిస్తున్నారు. ఎక్కువగా పవర్‌ఫుల్ రోల్స్‌నే ఎంచుకుంటున్నారు. సలార్‌లో రాధా రామ మన్నార్‌గా కనిపించి అలరించారు. ఆ వెంటనే ఓజీలో గీతగా నటించారు. ఈ సినిమాలో గన్ తీసుకుని నడుచుకుంటూ వస్తూ పోలీసులకే గురిపెట్టే సీన్‌లో ఉగ్రరూపం చూపించారు శ్రియారెడ్డి. ఓజీలో నటనకు గాను ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ చేత ప్రశంసలు దక్కించుకున్నారు.
శ్రియా రెడ్డి తండ్రి ప్రముఖ క్రికెటర్ భరత్ రెడ్డి కాగా.. తొలి నుంచి ఫిట్‌నెస్‌పై శ్రద్ధగా ఉంటూ వస్తున్నారు ఈ ముద్దుగుమ్మ. తన వర్కవుట్స్, జిమ్‌తో పాటు డైట్ ఇతర వివరాలను సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటారు. 47 ఏళ్ల వయసులోనూ చెక్కు చెదరని అందం, ఫిట్ బాడీతో కుర్ర హీరోయిన్లకు పోటీ ఇస్తున్నారు శ్రియా రెడ్డి. తాజాగా ఆమె షేర్ చేసిన వీడియో వైరల్ అవుతోంది. తనలోని మార్షల్ ఆర్ట్స్ ప్రావీణ్యాన్ని శ్రియా రెడ్డి బయటపెట్టారు. అంతేకాదు.. ఈ యుద్ధ విద్యలో ఉపయోగించే ఆయుధాలను కూడా అలవోకగా వాడేస్తున్నారు. ప్రత్యేకించి అత్యంత శక్తివంతమైన ఉరిమిని గిరగిరా తిప్పుతూ ఆమె చేస్తున్న విన్యాసాలు వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. ఆ సమయంలో శ్రియాను టచ్ చేస్తే ఖచ్చితంగా పీక తెగాల్సిందే అన్నట్లు స్పీడ్‌గా, ఫోకస్‌గా మార్షల్ ఆర్ట్స్‌ను సాధన చేస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియ వైరల్ అవుతుండగా.. ఫిమేల్ ఓజీ అంటూ అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు.


Click it and Unblock the Notifications

















