SSMB29లో ప్రియాంక చోప్రా లుక్ ఇదే... చీరలో శివంగిలా గ్లోబల్ బ్యూటీ!
ఆర్ఆర్ఆర్ తర్వాత దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో సూపర్‌స్టార్ మహేశ్ బాబు హీరోగా తెరకెక్కుతోన్న మూవీ ఎస్ఎస్ఎంబీ 29. భారతీయ చిత్ర పరిశ్రమలో గతంలో ఎన్నడూ లేని విధంగా దాదాపు 1000 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు జక్కన్న. భారత్ నుంచి తొలి పాన్ వరల్డ్ మూవీగా ఎస్ఎస్ఎంబీ 29 చరిత్ర సృష్టించనుంది. భారతీయ భాషలతో పాటు పలు విదేశీ భాషల్లోనూ ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు టాక్.
పృథ్వీరాజ్ లుక్ వదిలిన జక్కన్న
అయితే ఈ సినిమాపై హైప్ పెంచేలా రాజమౌళీ తన మార్క్ వ్యూహాలను అమలు చేస్తున్నారు. ఇప్పటికే ఎస్ఎస్ఎంబీ 29లో విలన్ రోల్ పోషిస్తోన్న మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ పాత్రను, లుక్‌ను విడుదల చేసి షాకిచ్చారు జక్కన్న. వీల్ చైర్‌లో కూర్చొని రొబోటిక్ చేతులతో భారీ యాక్షన్స్ సీక్వెన్స్‌లో పాల్గొన్న పృథ్వీ లుక్ అంచనాలను పెంచేసింది. ఈ పాత్రకు కుంభ అని పరిచయం చేశారు రాజమౌళి. అలాగే స్టార్ హీరోయిన్ శృతిహాసన్ ఆలపించిన సంచారి సాంగ్ టాప్‌లో ట్రెండ్ అవుతోంది.

ఎస్ఎస్ఎంబీ 29 తారాగణం
శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై పీఎల్ నారాయణ ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇందులో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా, మలయాళ సూపర్‌స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. అలాగే భారతీయ చిత్ర పరిశ్రమతో పాటు హాలీవుడ్‌కు చెందిన సాంకేతిక నిపుణలు ఈ సినిమా కోసం పనిచేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే నటీనటుల పేర్లు, ఇతర వివరాలు బయటకు రాకుండా జక్కన్న గోప్యంగా ఉంచుతున్నారు. ఎంఎం కీరవాణి సంగీత దర్శకత్వం వహిస్తుండగా.. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథను అందించారు.
రామోజీ ఫిలింసిటీలో టైటిల్ లాంచ్ వేడుక
ఎస్ఎస్ఎంబీ 29 టైటిల్ ఏంటీ? మహేశ్ లుక్ ఎలా ఉండబోతోంది? అని మొత్తం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. మహేశ్ లుక్ ఇలా ఉండబోతోంది అంటూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో డిజైన్ చేసిన పోస్టర్లు, ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. గతంలో మహేశ్ మెడలో త్రిశూలం, ఎద్దు, డమరుకం, శివుని నామాలతో ఉన్న పోస్టర్‌ను వదిలి పూనకాలు తెప్పించారు జక్కన్న. ఇక ఈ చిత్రానికి వారణాసి, సంజీవని, గ్లోబ్ ట్రాట్టర్, సంచారి, వారణాసి వంటి పేర్లు తెరపైకి వచ్చాయి.
ప్రియాంక చోప్రా లుక్ రిలీజ్
ఈ సస్పెన్స్‌కు తెరదించుతూ నవంబర్ 15న ఎస్ఎస్ఎంబీ 29 టైటిల్‌ను రీవిల్ చేస్తామని రాజమౌళి ప్రకటించారు. హైదరాబాద్ రామోజీ ఫిలింసిటీలో గ్లోబ్ ట్రాట్టర్ పేరుతో భారీ ఈవెంట్ జరుగుతుందని తెలిపారు. జియో హాట్‌స్టార్‌కు ఈ ఈవెంట్ ప్రసార హక్కులు విక్రయించి కొత్త ట్రెండ్ సెట్ చేశారు రాజమౌళి. ఈ ఈవెంట్ కోసం ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇంతలో రాజమౌళి మరో ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోన్న ప్రియాంక చోప్రా లుక్ రిలీజ్ చేశారు.
మందాకినిగా ప్రియాంక చోప్రా
ఈ చిత్రంలో ప్రియాంక పేరు మందాకిని అని తెలిపారు రాజమౌళి. పసుపు రంగు చీరలో గన్ పేలుస్తూ గ్లామర్‌తో పాటు యాక్షన్‌పరంగానూ దుమ్మురేపుతున్నారు. విశ్వ వేదికపై భారతీయ సినిమాను పునర్నిర్వచించిన మహిళ.. దేశీ గర్ల్ తిరిగొచ్చేసింది. మందాకినిలోని డిఫరెంట్ షేడ్స్‌ను చూడటానికి ప్రపంచం ఉత్కంఠగా ఎదురుచూస్తోందని రాజమౌళి రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ అవుతుండగా.. విలన్, హీరోయిన్ లుక్స్‌ను వదిలిన జక్కన్న.. మహేశ్ బాబుని ఎలా చూపిస్తాడోనని అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.


Click it and Unblock the Notifications











