ఆ 15 రోజులు నరకం చూశా.. బతుకుతానని అనుకోలేదు
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఆర్టిస్టుగా గుర్తింపు తెచ్చుకున్న నటి సురేఖ వాణి గురించి అందరికీ పరిచయమే. ఇప్పటికీ ఇండస్ట్రీలో కొనసాగుతూ సహాయ పాత్రలలో మెప్పిస్తుంది. ఇక ఆమె కూతురు సుప్రిత (Supritha) గురించి కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ అమ్మడు కూడా వెండితెరపై హీరోయిన్ గా అడుగుపెట్టిన విషయం తెలిసిందే. వాస్తవానికి ఇండస్ట్రీలో అడుగుపెట్టక ముందు సోషల్ మీడియాలో గ్లామర్, రీల్స్‌తో మంచి క్రేజ్ సంపాదించిన ఈ యంగ్ బ్యూటీ. ఆ ఫేమ్ తో సినిమా అవకాశాలు అందుకుని హీరోయిన్‌గా తన కెరీర్‌ను ప్రారంభించింది. ఇటీవల సుప్రితకి సంబంధించిన ఓ పాత ఇంటర్వ్యూ వైరల్ అవుతుంది. ఇందులో తన ఆరోగ్య సమస్యల గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి గురైంది.
ఆ ఇంటర్య్వూలో హీరోయిన్ సుప్రిత మాట్లాడుతూ.. కొంతకాలం క్రితం తాను బరువు పెరగడంతో, సోషల్ మీడియాలో వచ్చిన కామెంట్స్ కారణంగా మానసికంగా చాలా ప్రెషర్‌కు లోనయ్యానని తెలిపింది. ఆ ఒత్తిడిలోనే తినే అలవాట్లు పూర్తిగా మారిపోయాయని, ఒకవైపు ఎక్కువగా తినడం, మరోవైపు వెంటనే బరువు తగ్గాలని ఆహారం పూర్తిగా తగ్గించడం వంటి తప్పులు చేశానని చెప్పింది. రోజుకు 12 నుంచి 15 గంటల పాటు ఏమీ తినకుండా ఉండి, ఒక్క పూట మాత్రమే తినేదాన్నని, ఆ సమయంలో కూడా ఎక్కువగా బిర్యానీ వంటి హెవీ ఫుడ్ తీసుకోవడంతో ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిన్నదని వెల్లడించింది.

ఈ అలవాట్ల కారణంగా తన పరిస్థితి ఒక్కసారిగా విషమించిందని సుప్రిత తెలిపింది. తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరాల్సి వచ్చిందని, అక్కడ దాదాపు 15 రోజుల పాటు చాలా కష్టాలు అనుభవించానని చెప్పింది. "నీళ్లు తాగినా వాంతులు అయ్యేవి... రోజుకు 15 సార్లు వాంతులు అయ్యేవి... 20 రోజుల పాటు అన్నం తినలేకపోయాను" అంటూ ఆ రోజులను గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ అయింది. ఒక దశలో తాను బతకనేమో అనిపించిందని, ఆ నరకాన్ని భరించలేక 'ఏదైనా మందు ఇచ్చి చంపేస్తే బాగుంటుంది' అనిపించిన సందర్భాలు కూడా ఉన్నాయని షాకింగ్‌గా వెల్లడించింది.
తన వల్ల తల్లి సురేఖ వాణితో పాటు ఇంట్లో వాళ్లు ఇబ్బంది పడటం చూసి మరింత బాధపడ్డానని చెప్పింది. అయితే దేవుడి దయతో ఆ పరిస్థితి నుంచి బయటపడి ఇప్పుడు పూర్తిగా కోలుకున్నానని తెలిపింది. ఇక తన సినీ కెరీర్ గురించి మాట్లాడుతూ, తాను కేవలం హీరోయిన్ పాత్రలకే పరిమితం కావాలని లేదని, మంచి స్క్రిప్ట్ వస్తే క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కూడా నటించడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పింది. ముఖ్యంగా పెద్ద హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఉందని తెలిపింది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ లకు సిస్టర్ పాత్ర వచ్చినా వదులుకోనని స్పష్టం చేసింది. ఇక విజయ్ దేవరకొండ, అఖిల్ అక్కినేని అంటే తనకు చాలా ఇష్టమని, వారితో సిస్టర్ పాత్ర చేయడం మాత్రం కష్టమని చెప్పింది. చిన్నప్పుడు పదో తరగతి పాస్ అయితే అఖిల్‌తో డిన్నర్‌కు తీసుకెళ్తానని తన తల్లి మాట ఇచ్చిందని, కానీ ఆ కోరిక ఇప్పటికీ నెరవేరలేదని సరదాగా చెప్పుకొచ్చింది. వారిని దగ్గరగా చూసినా షాక్ అవుతానేమో అని నవ్వుతూ తెలిపింది. మరోసారి ఈ యంగ్ హీరోయిన్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications