‘ప్రతి డైరెక్టరూ అలా ఉండాలన్నారు.. అందుకే అవకాశాలు కోల్పోయా'
Taapsee Pannu: టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న హీరోయిన్ తాప్సీ పన్ను (Taapsee Pannu) మరోసారి వార్తల్లో నిలిచారు. వైవిధ్యమైన పాత్రలు, లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న ఈ భామ, తాజాగా తన సినీ కెరీర్ ప్రారంభ దశలో ఎదుర్కొన్న చేదు అనుభవాలను ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.ఆ విషయంలో తాను మానసికంగా కూడా తీవ్ర ఆందోళనకు లోనయ్యాయననీ, ఆమె చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఏం జరిగిందంటే?
హీరోయిన్ తాప్సీ .. 2010లో ఝుమ్మంది నాదం సినిమాతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. తొలి సినిమాతోనే అందం, అభినయం పరంగా మంచి మార్కులు సంపాదించుకుంది. ఆ తర్వాత మిస్టర్ పర్‌ఫెక్ట్, గుండెల్లో గోదారి, సాహసం, ఆనందో బ్రహ్మ వంటి సినిమాలతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకుంది. టాలీవుడ్‌లో బిజీగా ఉన్న సమయంలోనే బాలీవుడ్‌కు వెళ్లిన తాప్సీ, అక్కడ కూడా తన సత్తా చాటింది. పింక్, బేబీ, ది ఘాజీ అటాక్, నామ్ షబానా, ముల్క్, బద్లా, మిషన్ మంగళ్, తప్పడ్, సాండ్ ఖీ ఆంఖ్, హసీనా దిల్ రుబా, డుంకీ వంటి హిట్ సినిమాలతో బాలీవుడ్‌లో లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్‌గా మారింది.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న హీరోయిన్ తాప్సీ తన కెరీర్ ప్రారంభ దశలో ఎదురైన కష్టాలను, అవమానాలను వెల్లడించింది. తాను కెరీర్ ప్రారంభంలో చేదు అనుభవాన్ని బయటపెట్టారు. 'ప్రారంభ రోజుల్లో దాదాపు ప్రతి దర్శకుడు నా జుట్టును స్ట్రైట్ చేయించుకోవాలని, అలా స్టైల్ గా ఉండాలని చెప్పేవారు. అప్పట్లో గ్లామర్, సెక్స్ అప్పీల్ అంటే స్ట్రైట్ హెయిర్‌నే అన్న భావన ఎక్కువగా ఉండేది' అని ఆమె తెలిపారు.
అంతేకాదు, కర్లీ హెయిర్ ఉంటే తిరుగుబాటు చేసే లేదా యాక్షన్ పాత్రలకే సరిపోతుందని, సంప్రదాయ 'మంచి అమ్మాయి' పాత్రలకు మాత్రం పనికిరాదనే ఆలోచన బలంగా ఉండేదని చెప్పారు. ఆ సమయంలో తనకు పెద్దగా అవగాహన లేకపోవడంతో దర్శకుల విజన్‌కు తలొగ్గాల్సి వచ్చిందని, అవకాశాలు కోల్పోయిన సందర్భాలు కూడా ఉన్నాయని తాప్సీ షాకింగ్ విషయాలను బయటపెట్టింది.
కాలక్రమేణా తన జుట్టును ఎలా హ్యాండిల్ చేయాలి, ఎలా కేర్ తీసుకోవాలి అనే విషయాలు నేర్చుకున్నానని తాప్సీ తెలిపారు. 'నేను నా జుట్టును అర్థం చేసుకోవడం మొదలుపెట్టిన తర్వాత, అది కూడా నాకు ప్రేమ చూపించడం మొదలుపెట్టింది. నేను దాన్ని ఎలా క్యారీ చేస్తున్నానో చూసి, చాలామంది దర్శకులు ఇది ఒక ప్రత్యేకమైన వరమని గ్రహించారు. ఇప్పుడు నేను చేసే పాత్రల్లో నా సహజ కర్లీ హెయిర్‌ను అలాగే ఉంచమని కోరుతున్నారు'అని ఆమె అన్నారు.
సినిమాలే కాకుండా బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్ విషయంలో కూడా తాప్సీకి నిరాశే ఎదురైంది. 'ఏళ్ల తరబడి నా జుట్టుతో కలిసి పనిచేయాలనుకునే బ్రాండ్ కోసం ఎదురుచూశాను. కానీ నన్ను కావాలనుకున్నారు గానీ, నా కర్లీ హెయిర్‌ను మాత్రం వద్దనుకున్నారు. షూట్‌కు ముందు జుట్టును స్ట్రైట్ చేయాలని కోరేవారు' అని ఆమె వాపోయారు.
భారతదేశంలో అందమైన జుట్టు అంటే కర్లీ హెయిర్ కాదనే భావన వల్ల చాలా కాలం నిరాశకు గురయ్యానని చెప్పారు. అయితే చివరకు డవ్ (Dove) బ్రాండ్‌తో 'రెక్లెయిమ్ యువర్ కర్ల్స్' క్యాంపెయిన్‌లో భాగస్వామ్యం కావడం తనకు ఎంతో ప్రత్యేకమని తెలిపారు. ఈ అసోసియేషన్ కోసం తానే ఆ బ్రాండ్‌ను సంప్రదించానని స్పష్టం చేశారు.
తన కర్లీ హెయిర్‌ను అంగీకరించడం అంత ఈజీ కాదని తాప్సీ చెప్పారు. 'నా బాల్యంలో చుట్టూ కర్లీ హెయిర్ ఉన్నవాళ్లు చాలా తక్కువగా ఉండేవారు. అందుకే అది అసాధారణమనే భావన నాలో ఉండేది. అప్పట్లో కర్లీ హెయిర్ కేర్ గురించి సరైన అవగాహన లేక చాలా ఇబ్బందులు పడ్డాను'అని గుర్తు చేసుకున్నారు. చివరకు తన జుట్టును అర్థం చేసుకుని, సరైన ప్రొడక్ట్స్ ఉపయోగించడం నేర్చుకున్న తర్వాతే అది ఒక వరమని తెలుసుకున్నానని చెప్పారు. ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే, ఆ ప్రయాణం అంతా విలువైనదే అనిపిస్తోందని తాప్సీ తెలిపారు.


Click it and Unblock the Notifications











