ఎన్టీఆర్ బయోపిక్‌లో మిల్కీ బ్యూటీ.. ఎవరి పాత్ర కోసమో తెలుసా!
నందమూరి బాలకృష్ణ నటిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ ప్రతిష్టాత్మకంగా రూపొందుతోంది. ఎన్టీఆర్ పాత్రలో స్వయంగా బాలకృష్ణ నటిస్తున్నాడు. ఈ చిత్రం రెండు భాగాలుగా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ సినీరంగ విశేషాలతో ఎన్టీఆర్ కథానాయకుడు, రాజకీయ విశేషాలతో ఎన్టీఆర్ మహానాయకుడుగా రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు. ఎన్టీఆర్ తెలుగు ప్రేక్షకుల అభిమాన నటుడిగా అలరించాడు. ఆ తరువాత ఆరాధ్య నాయకుడిగా మారాడు. ఎన్టీఆర్ జీవితం చాలా మంది ప్రముఖులతో ముడిపడి ఉంది. తాజాగా ఈ చిత్రంలో మరో కీలక పాత్రలో మిల్కీ బ్యూటీ తమన్నా నటించబోతున్నట్లు తెలుస్తోంది.

మిల్కీ బ్యూటీ తమన్నా
ఎన్టీఆర్ తన నటజీవితంలో చాలా మంది హీరోయిన్లతో కలసి నటించారు. సావిత్రి, శ్రీదేవి, జయప్రద వంటి ప్రముఖ హీరోయిన్లతో కలసి ఎన్నో చిత్రాల్లో నటించారు. శ్రీదేవి పాత్రలో స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పటికే నటిస్తోంది. ఈ చిత్రం నుంచి రకుల్ ప్రీత్ సింగ్ ఫస్ట్ లుక్ కూడా విడుదలయింది.

జయప్రద పాత్రలో
జయప్రద పాత్రలో తమన్నా నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎన్టీఆర్, జయప్రద కాంబినేషన్ లో యమగోల, అడవిరాముడు వంటి సూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి. దీనితో జయప్రద పాత్రకు తమన్నా సరిపోతుందనే ఉద్దేశంతో ఆమెని ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది.

అంతా స్టార్స్ మయం
ఎన్టీఆర్ బయోపిక్ మొత్తం స్టార్స్ మయంగా మారిపోతోంది. ముఖ్యంగా మొదటి భాగం ఎన్టీఆర్ కథానాయకుడులో స్టార్ హీరోలు, హీరోయిన్లు నటిస్తున్నారు. ఏఎన్నార్ పాత్రలో సుమంత్ నటిస్తున్న సంగతి తెలిసిందే. చంద్రబాబు పాత్రలో రానా నటిస్తున్నాడు. శ్రీదేవి పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్, ఎన్టీఆర్ సతీమణి బసవతారకం పాత్రలో విద్యాబాలన్ నటిస్తోంది.

భారీ అంచనాలతో
ఎన్టీఆర్ బయోపిక్ పై భారీ అంచనాలు నెలకొంటున్నాయి. ఎన్టీఆర్ జీవితం సినీ రాజకీయ అంశాలతో ముడిపడి ఉంది కాబట్టి దర్శకుడు క్రిష్ ఈ చిత్రాన్ని ఎలా తెరకెక్కించాడో అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తొలి భాగం ఎన్టీఆర్ కథానాయకుడు జనవరి 9 న ప్రేక్షకుల ముందుకు రానుంది.


Click it and Unblock the Notifications











