#మీటూ: వాళ్లు ఆత్మహత్య చేసుకున్నారు, నేను ఎలాగో బ్రతికాను: తనుశ్రీ దత్తా
మీటూ ఉద్యమంలో భాగంగా బాలీవుడ్ హీరోయిన్ తనుశ్రీ దత్తా ప్రముఖ నటుడు నానా పాటేకర్ మీద సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. 2008లో 'హార్న్ ఓకే ప్లీజ్' సినిమా షూటింగ్ సమయంలో పాటేకర్ తనను వేధించినట్లు ఆమె ఆరోపించారు. అయితే పదేళ్ల తర్వాత ఆమె ఆరోపణలు చేయడంపై రాఖీ సావంత్ లాంటి వారు ఆమెపై ఎదురు దాడి చేస్తూ విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మీలాంటి వారు ఇప్పటికైనా మారాలి అంటూ.... తనుశ్రీ దత్తా మరోసారి విరుచుకుపడింది. ఈ సందర్భంగా ఆమె జియా ఖాన్, ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్య సంఘటనలను కూడా గుర్తు చేశారు.

ఇంకా ఎంత మంది చావాలి?
ఈ దేశంలో ఎవరైనా తమకు జరిగిన అన్యాయాన్ని, దాడిని, బాధను చెప్పుకుంటుంటే వారిని అవమాన పరుస్తూ మరింత కృంగిపోయేలా చేయడం లాంటి ధోరణి పెరిగి పోతోంది. అలాంటి వారిని నేను ఒకటే అడుగుతున్నాను. మీ లాంటి వారి వల్ల ఇంకా ఎంత మంది జియా ఖాన్, ప్రత్యూష బెనర్జీ లాంటి టాలెంటెడ్ పీపుల్ బలికావాలి. ఇతరుల పట్ల మీరు ప్రవర్తించే తీరు మారడానికి ఇంకా ఎంత మంది చావాలి. మీ లాంటి వారు మారాల్సిన అవసరం ఉంది.... అని తనుశ్రీ దత్తా వ్యాఖ్యానించారు.

నాలోపల చచ్చిపోవాలన్నంత బాధ ఉండేది
2008లో ‘హార్న్ ఓకే ప్లీజ్' హరాస్మెంట్ ఇన్సిడెంట్, మోబ్ ఎటాక్ తర్వాత నేను చాలా డిప్రెషన్లోకి వెళ్లిపోయాను. ఆ సమయంలో నాలో ఎంత బాధ ఉన్నప్పటికీ ఇతర ప్రాజెక్టులు పూర్తి చేయడానికి మొహంపై చిరు నవ్వు చిందించాను. కానీ నా మనసులో ఆపుడు చచ్చిపోవాలన్నంత బాధ ఉండేది. వేధింపులు, మానిపులేషన్స్, బెదిరింపులు, నా గురించి దారుణంగా మాట్లాడుకోవడం లాంటివి చూసి నా మనసు తట్టుకోలేక పోయింది అని తనుశ్రీ దత్తా తెలిపారు.

జియా ఖాన్, ప్రత్యూష ఆత్మహత్య... నేను ఎలాగో బ్రతికాను
ఆ డిప్రెషన్ నుంచి బయట పడటానికి చాలా సమయం పట్టింది కానీ ఇంకా ఇక్కడ పరిస్థితులు మారలేదు. కొందరు ఇంకా తమ దారుణమైన స్వభావాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నారు. కొన్ని సంవత్సరాల క్రితం జియా, ప్రత్యూష ఆత్మహత్య చేసుకున్నారు. నేను ఎలాగో బ్రతికాను.... అని తనుశ్రీ దత్తా తన మనసులోని ఆవేదన బయట పెట్టింది.

రాఖీ సావంత్, గణేష్ ఆచార్యపై విమర్శలు
చాలా మంది మీటూ స్టోరీలు షేర్ చేసిన తర్వాత నాలో మరింత ధైర్యం వచ్చింది. పదేళ్లుగా నాలో ఉన్న బాధను, జరిగిన అవమానాన్ని బయటకు చెప్పుకున్నాను. కానీ రాఖీ సావంత్, గణేష్ ఆచార్య లాంటి వారు వేధింపులకు గురైన మా లాంటి వారిపై విషం చిమ్ముతూనే ఉన్నారు. అవమానకర వ్యాఖ్యలతో వేధిస్తున్నారు... అని తనుశ్రీ దత్తా ఆవేదన వ్యక్తం చేశారు.

నానా పాటేకర్
నానా పాటేకర్ తనపై తనుశ్రీ దత్తా చేసిన ఆరోపణలను గతంలోనే ఖండించిన సంగతి తెలిసిందే. ఆమె పట్ల తాను తప్పుగా ప్రవర్తించినట్లు వస్తున్న ఆరోపణల్లో నిజం లేదని తెలిపారు.


Click it and Unblock the Notifications











