ఆ చేదు అనుభవంతో రాజకీయాలకు దూరమైన విజయ నిర్మల!
ప్రముఖ నటి, దర్శకురాలు, సూపర్‌స్టార్ కృష్ణ సతీమణి విజయ నిర్మల మరణం తెలుగు సినీ పరిశ్రమను విషాదంలోకి నెట్టివేసింది. ఆమె వయసు 73 సంవత్సరాలు. పలువురు తెలుగు సినీ ప్రముఖులు ఈ సినీ ప్రముఖురాలి మరణం పట్ల సంతాపం ప్రకటించారు.
హీరోయిన్‌గా 50కిపైగా చిత్రాల్లో నటించిన విజయ నిర్మల.... దర్శకత్వంలోనూ తన ప్రతిభ చాటారు. 44 చిత్రాలకు దర్శకత్వం వహించి అత్యధిక చిత్రాలు డైరెక్ట్ చేసిన మహిళా దర్శకురాలిగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం దక్కించుకుని ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు.

సినిమా రంగానికి చెందిన వారు రాజకీయాల్లోనూ అడుగు పెట్టి ప్రజా సేవ చేయడం ఎప్పటి నుంచో కొనసాగుతోంది. ఈ క్రమంలో విజయ నిర్మల కూడా రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చారు. 1999లో తెలుగుదేశం పార్టీలో చేరి కైకలూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అయితే ఎర్నేని రాజా రామచందర్ చేతిలో ఓటమి పాలవ్వడంతో ఆమె రాజకీయాలు తనకు అచ్చిరావని అర్థం చేసుకుని వైదొలగారు.
విజయ నిర్మల నట ప్రస్థానం 7 ఏళ్ల వయసులోనే మొదలైంది. కృష్ణ, విజయ నిర్మల కలిసి నటించిన తొలి చిత్రం 'సాక్షి'. 1967లో వచ్చిన ఈ చిత్రానికి బాపు దర్శకత్వం వహించారు. ఈ సినిమా సమయంలోనే ఇద్దరూ ప్రేమలో పడ్డారు. ఈ షూటింగ్ జరిగిన రెండేళ్లకు 1969లో కృష్ణ, విజయ నిర్మల పెళ్లి చేసుకున్నారు.


Click it and Unblock the Notifications











