అందలమెక్కించిన వారే నిందిస్తున్నారు... ఇదెక్కడి న్యాయం- కరీనా కపూర్
బాలీవుడ్ లో బంధుప్రీతిపై ఎడతెగని చర్చ నడుస్తున్న నేపథ్యంలో నెపోటిజానికి నిలువెత్తు రూపమైన కరీనా కపూర్ ఖాన్ ఎట్టకేలకు పెదవి విప్పింది. ఇండస్ట్రీలో అడుగు పెట్టి 20ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మీడియాతో ముచ్చటించిన కరీనా, ఇబ్బందులు ఎదుర్కోకుండా తాను ఇక్కడివరకూ వచ్చేయలేదని చెప్పుకొచ్చింది.
ఒకటి రెండు సినిమాలకే పెట్టే బేడా సర్దేస్తున్న సూపర్ స్టార్ ల పిల్లలు జాబితా కూడా చాలా పెద్దదే ఉందని చెప్పిన కరీనా, తాను కూడా చాలానే స్ట్రగుల్ అయ్యానని వెల్లడించింది. అయితే, అవకాశాల కోసం చిన్న పట్టణాల నుంచి ట్రైన్లలో వస్తున్న వారి కష్టాలతో పోల్చుకుంటే తనవి భిన్నంగా ఉంటాయని తెలిపింది. ప్రేక్షకులే తమని అందలమెక్కించారని, ఈరోజు వాళ్లే తమని నిందిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.

ఈరోజు తమని నిందిస్తున్న వారికి అంతగా ఇబ్బందిగా ఉన్నప్పుడు తమ సినిమాలకు రావాల్సిన అవసరం లేదని కరీనా స్పష్టం చేసింది. వారిని ఎవరూ బలవంతపెట్టడంలేదు కదా అని ప్రశ్నించింది. షారుఖ్, అక్షయ్ కుమార్, రాజ్ కుమార్ రావ్, ఆయుష్మాన్ ఖురానా వంటి ఔట్ సైడర్స్ లాగానే తానూ, ఆలియా కూడా కష్టపడుతున్నామని చెప్పుకొచ్చిన కరీనా, ఓ స్టార్ ని నిలబెట్టాలన్నా, పతనం చేయాలన్నా ప్రేక్షకుల చేతిలోనే ఉందని వివరించింది.


Click it and Unblock the Notifications











