50 సెకన్ల సీన్‌కి 5 కోట్ల రెమ్యునరేషన్ .. రికార్డు రెమ్యునరేషన్ అందుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా?
సినీ పరిశ్రమ అంటేనే మేల్ డామినేషన్. అంతా హీరోలదే రాజ్యం.. పైకి మాత్రమే దర్శకుడు, నిర్మాత.. జరిగేదంతా కథానాయకుల కనుసన్నల్లోనే. ఇక హీరోయిన్ల గురించి చెప్పడానికి కూడా ఏం లేదు. ఒకప్పుడు హీరోలతో సమానంగా ,అవసరమైతే వారి కంటే ఎక్కువగానే హీరోయిన్ల క్యారెక్టర్లు ఉండేవి. కానీ ఇప్పుడు అందాల ఆరబోతకి, హీరోల పక్కన ఆడిపాడటానికే అన్నట్లుగా హీరోయిన్‌ల పాత్రలు తీర్చిదిద్దుతున్నారు. అలాంటి చోట స్టార్స్‌కే పోటీ ఇస్తూ దూసుకెళ్తున్నారు లేడీ సూపర్‌స్టార్ నయనతార.
ఒకప్పుడు కెరీర్‌లో ఎదురుదెబ్బలు, విఫల ప్రేమగాథలు, ఇతర ట్రాజెడీలు ఎదురైనా తట్టుకుని నిలబడి తన పేరు మీద కోట్ల వ్యాపారం జరిగే స్థాయికి చేరుకున్నారు నయన్. సౌతిండియాలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్‌గా వెలుగొందుతున్నారు. ఎంత పెద్ద హీరోలు అయినా సరే ఆమె కాల్షీట్ల కోసం వెయిట్ చేస్తున్నారంటే నయనతార స్టామినా ఏంటో అర్ధం చేసుకోవచ్చు.

హీరోయిన్ల కెరీర్ స్పాన్ ఇప్పుడు బాగా తగ్గిపోయింది.. మూడేళ్లు, సినిమాలు హిట్టయితే మరో రెండేళ్లు ఎక్స్‌టెన్షన్. అలాంటిది ఏకంగా రెండు దశాబ్ధాలుగా కెరీర్‌ను కంటిన్యూ చేస్తున్నారు నయనతార. అది కూడా ఏదో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానో, మరొకటో కాదు.. హీరోయిన్‌గానే. స్టార్టింగ్‌లో ఎంత బిజీగా ఉన్నారో ఇప్పుడు అంతకుమించి వరుసగా ఆఫర్లు అందుకుంటున్నారు.
శింబు, ప్రభుదేవాలతో ప్రేమాయణం బెడిసికొట్టడంతో డిప్రెషన్‌లోకి వెళ్లిన నయనతార తిరిగి కోలుకున్నారు. అలాంటిది ఆమె జీవితంలోకి యువ దర్శకుడు విఘ్నేష్ శివన్ ఎంట్రీ ఇచ్చాడు. 2015లో నేను రౌడీనే సినిమా షూటింగ్ సమయంలో నయనతార, విఘ్నేష్ శివన్‌ల మధ్య పరిచయం ఏర్పడి ఆ తర్వాత అది ప్రేమగా మారింది. దాదాపు ఏడేళ్ల పాటు ఈ జంట ప్రేమాయణం సాగించింది. 2022 జూన్ 9న చెన్నైలో వీరి పెళ్లి ఘనంగా జరిగింది.

తన మనసులో ఏమున్నా దాచుకోకుండా ఉన్నది ఉన్నట్లుగా కుండబద్ధలు కొడతారు నయనతార. ఇటీవల నయనతార - ధనుష్ మధ్య జరిగిన కాంట్రవర్సీ కోర్టు వరకు వెళ్లి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయిన సంగతి తెలిసిందే. చాలా మంది నయనతారకు పొగరని, యాటిట్యూడ్ చూపిస్తుందన్న విమర్శలు ఉన్నాయి. నిన్నగాక మొన్న ఓ కార్యక్రమానికి ఆరు గంటలకు పైగా ఆలస్యంగా వచ్చిన నయనతార కనీసం నిర్వాహకులకు క్షమాపణలు చెప్పకపోవడం పెద్ద దుమారం రేపింది.
తాజాగా నయనతార గురించి మరో ఆసక్తికర కథనం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటంటే ఇటీవల ఓ 50 సెకన్ల ప్రకటన కోసం అక్షరాలా రూ. 5 కోట్లు వసూలు చేసి షాకిచ్చింది లేడీ సూపర్‌స్టార్. టాటా స్కై సంస్థకు చెందిన వాణిజ్య ప్రకటనలో నటించినందుకు గాను నయనతార రూ.5 కోట్లు ఛార్జ్ చేశారట. ప్రస్తుతం లేడీ సూపర్‌స్టార్ చేతుల్లో 8 సినిమాలు ఉన్నాయి. హిందీలో సికిందర్, తని ఒరువన్ 2, గుడ్ బ్యాడ్ అగ్లీ, టాక్సీక్, ముక్తి అమ్మన్ 2, మహారాణి తదితర చిత్రాలున్నాయి. మరి ఆమె క్రేజ్ అలా ఉంది మరి.


Click it and Unblock the Notifications











