Happy Birthday Sreeleela శ్రీలీల కెరీర్ గాడిన పడేనా? ఫస్టాఫ్ హిట్.. సెకండాఫ్ డిజాస్టర్.. పవన్ గట్టెక్కిస్తాడా?
అందం, అభినయం కలబోసిన రూపం ఆమె సొంతం. అతి చిన్నవయస్సులోనే స్టార్ హీరోయిన్ హోదాకు చేరుకొని మిగతా హీరోయిన్లకు షాక్ ఇస్తున్న బ్యూటీ శ్రీలీల. మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల గుండెల్లో దేవతలా మారిపోయింది. గత మూడేళ్ళుగా ఈ చిన్నది ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేస్తోంది. నేడు ఈ చిన్నదాని 23 వ పుట్టినరోజు. దీంతో అమ్మడికి సోషల్ మీడియాలో పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువలా వచ్చి పడుతున్నాయి. అసలు ఈ చిన్నది తన కెరీర్ ను ఎలా మొదలుపెట్టింది అనేది ఈరోజు తెలుసుకుందాం.
2001 జూన్ 14న యునైటెడ్ స్టేట్స్‌లోని ఒక తెలుగు కుటుంబంలో శ్రీలీల జన్మించింది. ఆమె తల్లి స్వర్ణలత బెంగళూరులో గైనకాలజిస్ట్. పారిశ్రామికవేత్త సూరపనేని శుభాకరరావును వివాహం చేసుకున్న స్వర్ణలత కొన్ని విభేదాలతో విడిపోయారు. ఆ తరువాత కొన్ని నెలలకు శ్రీలీల జన్మించింది. అయితే ఇప్పటికి ఆమె తండ్రి వద్దకు వెళ్లదని, ఆయనకూడా శ్రీలీల తన కూతురు కాదని చెప్పినట్లు వార్తలు వినిపించాయి. అయినా వాటిని పట్టించుకోని స్వర్ణలత.. చిన్నతనంలోనే భరతనాట్యం నృత్యంలో శిక్షణ ఇప్పించింది. అందులో చిన్నతనంలోనే ప్రావీణ్యం అందుకున్న శ్రీలీల ఫోటోలను సోషల్ మీడియాలో చూసిన దర్శకుడు ఎ.పి.అర్జున్, ఆమెను తన దర్శకత్వం వహించిన కిస్ చిత్రంలో అవకాశమిచ్చాడు. అలా ఆమె 2019 లో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది.

తెలుగు చిత్ర పరిశ్రమలో పరిచయాలు ఉన్నప్పటికీ బెంగుళూరులో పెరిగినందున కన్నడ చిత్రాలలో తన కెరీర్‌ను ప్రారంభించాలని శ్రీలీల నిర్ణయించుకోవడం దీనికి కారణం అని చెప్పొచ్చు. కన్నడలోనే కొన్ని సినిమాలు చేస్తూ మెప్పించిన శ్రీలీల దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో వచ్చిన రొమాంటిక్ మ్యూజికల్ ఫిల్మ్ పెళ్లి సందడి సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.
ఇక్కడనుంచి తెలుగువాళ్ళకు అమ్మడి గురించి, ఆమె జీవితం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా రిలీజ్ కు ముందే శ్రీలీల అందానికి, డ్యాన్స్ కు ముగ్దులైన మేకర్స్.. వరుసగా ఆమెకు అవకాశాలు ఇచ్చేసారు. అలా పెళ్లి సందడి రిలీజ్ కు ముందే ధమాకా, స్కంద సినిమాలకు సైన్ చేసింది. పెళ్లి సందడి సినిమా ఆశించిన ఫలితాన్ని అందివ్వలేకపోయింది కానీ, శ్రీలీలకు ఛాన్స్ లు మాత్రం క్యూ కట్టాయి. ఆ తరువాత వెంటనే ధమాకాతో భారీ విజయాన్ని అందుకుంది.

రవితేజ సరసన ఈ చిన్నది చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఈ సినిమా తరువాత స్కంద, భగవంత్ కేసరి, ఆదికేశవ, ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్లాంటి సినిమాలు రిలీజ్ అయ్యాయి, కానీ, అవేమి ఆమెకు విజయాలను అందించలేకపోయాయి. ఇక మొదటి సినిమా చేసే సమయంలోనే తనకు మహేష్ బాబు అంటే ఇష్టమని, ఆయనతో నటించే ఛాన్స్ వస్తే చేస్తానని చెప్పడం ఆలస్యం.. గుంటూరు కారంలో అమ్మడికి ఛాన్స్ వచ్చింది.
ముందు సెకండ్ హీరోయిన్ గా అనుకున్నా.. శ్రీలీల అదృష్టం.. పూజా హగ్దే సినిమా నుంచి అవుట్ అవ్వడంతో ఆమె స్థానంలో శ్రీలీల మొదటి హీరోయిన్ గా మారింది. గుంటూరు కారంపై శ్రీలీల ఎన్నో ఆశలు పెట్టుకుంది. కానీ.. ఇది కూడా మిక్స్డ్ టాక్ అందుకోవడంతో ఈ చిన్నది ఢీలా పడిపోయింది. ఇలా వరుస సినిమాలను అందుకోవడం కాదు. కథలో తనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేస్తే బావుంటుందని భావించిన ఆమె.. ఆచితూచి అడుగులువేస్తోంది. ప్రస్తుతం ఈ చిన్నదాని చేతిలో నాలుగు సినిమాల వరకు ఉన్నాయి.రాబిన్ హుడ్ లో నితిన్ సరసన నటిస్తున్న శ్రీలీల.. తమిళ్ లో అజిత్ సరసన గుడ్ బ్యాడ్ అగ్లీలో నటిస్తోంది. ఇక ఇప్పటికే ఉస్తాద్ భగత్ సింగ్ లో పవన్ సరసన నటించబోతుంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ను పూర్తిచేసుకోనుంది. మరి ఈ సినిమాలతో అమ్మడు ఎలాంటి విజయాలను అందుకుంటుందో చూడాలి


Click it and Unblock the Notifications











