Trisha Krishnan: త్రిషా కృష్ణన్‌కు ఘోర అవమానం.. హీరోయిన్ షాకింగ్ పోస్ట్
దక్షిణాదిలో అగ్రనటిగా వెలుగొందుతున్నారు త్రిషా కృష్ణన్. ఈ జనరేషన్‌లో నటిగా 25 ఏళ్లు పూర్తి చేసుకున్న అరుదైన ఘనత ఆమె సొంతం. 40 ఏళ్లు దాటినా ఇంకా చెక్కుచెదరని గ్లామర్‌తో కుర్ర హీరోయిన్లకు పోటీ ఇస్తున్నారు ఈ ముద్దుగుమ్మ. గత కొంతకాలంగా త్రిష.. సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారారు. అలాంటి త్రిషకు ఊహించని అవమానం జరిగింది. ఈ వివరాల్లోకి వెళితే..
కోలీవుడ్ సూపర్‌స్టార్, టీవీకే అధినేత విజయ్‌తో త్రిష ప్రేమాయణం సాగిస్తున్నారని.. అందుకే త్రిష 40 ఏళ్లు దాటినా పెళ్లి చేసుకోలేదని పుకార్లు వినిపిస్తున్నాయి. తమిళనాడు బీజేపీ నేత నైనార్ నాగేంద్రన్ వ్యాఖ్యలకు తోడు, విజయ్ సతీమణి తన విడాకుల పిటిషన్‌లో పరోక్షంగా ఓ హీరోయిన్‌ను ప్రస్తావించడంతో అన్ని వేళ్లూ త్రిషపైనే చూపిస్తున్నాయి. దాంతో ఆమె ఏం చేసినా? ఏం మాట్లాడినా? హాట్ టాపిక్‌గా మారుతోంది.

ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ హీరో సూర్య సరసన కరుప్పు, మెగాస్టార్ చిరంజీవితో విశ్వంభర, మలయాళంలో మోహన్‌లాల్ సరసన రామ్ అనే సినిమాలలో త్రిష నటిస్తున్నారు. ఇవన్నీ భారీ బడ్జెట్ చిత్రాలు కావడంతో పాటు సూపర్‌స్టార్లు హీరోలు కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. వీటిలో కరుప్పు సినిమా విడుదలకు సిద్ధమైంది. ఆర్జే బాలాజీ దర్శకత్వం వహించిన కరుప్పు మూవీని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్ఆర్ ప్రభు, ఎస్ఆర్ ప్రకాష్ బాబులు సంయుక్తంగా నిర్మించారు.
ఆర్జే బాలాజీ, ఇంద్రన్స్, నట్టి సుబ్రహ్మణ్యం, శ్వాసిక, శివద, సుప్రీత్ రెడ్డి, యోగా బాబు, మన్సూర్ అలీఖాన్‌లు నటిస్తున్నారు. జీకే విష్ణు సినిమాటోగ్రాఫర్‌గా, ఆర్ కలైవనన్ ఎడిటర్‌గా వ్యవహరిస్తుండగా.. సాయి అభ్యాంకర్ సంగీత దర్శకత్వం అందిస్తున్నారు. సమ్మర్ కానుకగా మే 14న కరుప్పు మూవీ వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది.
రిలీజ్ డేట్ దగ్గరపడటంతో చిత్ర యూనిట్ ప్రమోషనల్ కార్యక్రమాలను వేగవంతం చేసింది. దీనిలో భాగంగా కరుప్పులో త్రిష పాత్రకు సంబంధించి 37 సెకన్ల నిడివి ఉన్న ఓ వీడియోను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. దీనిలో ప్రీతి అనే లాయర్‌గా నటిస్తున్నారు త్రిష. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా.. త్రిష అందంపై ఆమె అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. ఈ సినిమాలో మీరు ఉన్నారని కూడా నేను మరిచిపోయా.. త్రిష వయసు రివర్స్‌లో వెళ్తోందని ఓ అభిమాని కామెంట్స్ చేశాడు.
దీనికి త్రిష స్పందిస్తూ.. సదరు అభిమానికి థ్యాంక్స్ చెప్పారు. నేను కూడా ఈ విషయాన్ని మరిచిపోయా, కనీసం కరుప్పు మేకర్స్ రిమైండర్ సెట్ చేశారని కామెంట్ చేసింది. అయితే ఇది కొంచెం సెటైరికల్‌గా ఉండటంతో దాని వెనుక ఏదో కారణం ఉందని అంతా అనుకున్నారు. దానికి తగినట్లుగానే ఓ అభిమాని.. కరుప్పు ఆడియో లాంచ్‌కు రాకుండా ఈ కబుర్లు ఏంటీ అంటూ ప్రశ్నించాడు. దానికి త్రిష సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు. నా ఆహ్వానం బహుశా మెయిల్‌లో ఎక్కడో పోయిందే అంటూ కౌంటర్ వేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. చిత్ర నిర్మాతలకు, త్రిషకు మధ్య ఏదో జరుగుతోందని కోలీవుడ్ వర్గాలు భావిస్తున్నాయి.


Click it and Unblock the Notifications