16 ఏళ్ల తర్వాత ప్రభాస్‌తో త్రిష.. అలాంటి పాత్రతో సందీప్ రెడ్డి భారీ స్కెచ్
టాలీవుడ్ స్టార్ హీరోలలో రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు ఫుల్ స్వింగ్‌లో ఉన్నారు. సలార్, కల్కి 2898 ఏడీల ఘన విజయాలతో ఆయన రేంజ్ మరింత పెరిగింది. కుదిరితే ఏడాదికి రెండు సినిమాలు, లేదంటే కనీసం ఒక్క మూవీనైనా రిలీజ్ చేయాలనే టార్గెట్‌తో పనిచేసుకుంటూ వెళ్తున్నారు. మారుతి దర్శకత్వంలో ది రాజా సాబ్‌ను వేగంగా కంప్లీట్ చేసే పనిలో బిజీగా ఉన్న ప్రభాస్.. సలార్ -2, కల్కి -2 వర్క్స్‌పై ఫోకస్ పెట్టారు. ఇటీవలే సీతారామం ఫేమ్ హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ పీరియాడికల్ మూవీని సెట్స్‌పైకి తీసుకెళ్లారు డార్లింగ్.
వీటితో పాటు ఇప్పటికే అనౌన్స్ అయిన ప్రభాస్ - సందీప్ రెడ్డి వంగా మూవీపైనా భారీ అంచనాలున్నాయి. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ , యానిమల్ సినిమాలతో టాలీవుడ్, బాలీవుడ్‌లలో తన జెండా బలంగా పాతారు సందీప్. యూత్‌కి కనెక్ట్ అయ్యే ఎలిమెంట్స్‌తో సినిమాలు టేకప్ చేస్తూ తాను డిఫరెంట్ డైరెక్టర్‌నని ఆయన ప్రూవ్ చేసుకున్నారు. కెరీర్‌లో తీసిన మూడు సినిమాలు భారీ బ్లాక్‌బస్టర్స్ కావడం, అపజయమన్నది లేకపోవడంతో సందీప్ నెక్ట్స్ ప్రాజెక్ట్‌పై ఉత్కంఠ నెలకొంది.

సందీప్ సినిమాల్లో హీరో ఎలా ఉంటాడో, కోపంతో ఎలా ఊగిపోతాడో, ఆ పిచ్చి ఆవేశంలో ఎలాంటి మాటలు మాట్లాడతాడో ప్రేక్షకులు చూశారు. అలాంటిది సాఫ్ట్‌గా, నోట్లో నుంచి మాటే రావడం కష్టంగా సిగ్గుపడే ప్రభాస్‌ను ఎలాంటి గెటప్‌లో చూపిస్తాడోనని డార్లింగ్ ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. సందీప్ రెడ్డి ఇటీవల ముంబైలో ప్రభాస్‌ను కలిసి స్పిరిట్ మూవీకి సంబంధించిన లుక్ గురించి వివరించారట. ఫిలింనగర్ వర్గాల ప్రకారం ఈ మూవీలో ప్రభాస్ పోలిస్ గెటప్‌లో కనిపించనున్నారట. ఇందుకోసం కాస్త లీన్ లుక్ మెయింటైన్ చేయాలని ప్రభాస్‌కి సందీప్ సూచించారట. ఇప్పుడున్న దానిని మించి మరింత ఫిట్‌గా ఉండాలని.. అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పాడట.
ప్రభాస్- సందీప్ రెడ్డి వంగా మూవీ దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కనుందని టాక్. దాదాపు 60 శాతం స్క్రిప్ట్ వర్క్ పూర్తయ్యిందని , డిసెంబర్‌లో మూవీని సెట్స్ పైకి తీసుకెళ్తామన్నారు. శాటిలైట్, డిజిటల్ రైట్స్ నుంచే సినిమాకు అయిన ఖర్చును రికవరీ చేస్తామన్న సందీప్.. స్పిరిట్ తొలిరోజే రూ.150 కోట్ల వసూళ్లు సాధిస్తుందని ధీమాగా చెబుతున్నారు. డార్లింగ్‌ను ఇంత వరకు ఎవరూ చూపించని విధంగా చూపిస్తానని చెప్పడంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
అంతాబాగానే ఉంది కానీ ఇన్ని అంచనాలున్న మూవీలో హీరోయిన్ ఎవరు అనే డిస్కషన్ ఎప్పటి నుంచో నడుస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న సమాచారాన్ని బట్టి స్పిరిట్‌లో త్రిష కృష్ణన్ హీరోయిన్‌గా నటించనున్నారట. ఇందులో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేయనున్నారని.. ఒకటి హీరోగా, మరొకటి విలన్ రోల్‌లో ఆయన కనిపిస్తారని సమాచారం. విలన్ క్యారెక్టర్ పోషించే ప్రభాస్‌తో త్రిష రొమాన్స్ చేస్తుందని పుకార్లు షికారు చేస్తున్నాయి. గతంలో ప్రభాస్‌తో వర్షం, పౌర్ణమి, బుజ్జిగాడు సినిమాలలో త్రిష హీరోయిన్‌గా నటించారు. స్పిరిట్‌పై వస్తున్న వార్తలు నిజమైతే దాదాపు 16 ఏళ్ల తర్వాత తిరిగి ప్రభాస్‌తో ఆమె జోడికట్టినట్లు. అయితే ఈ వార్తలపై చిత్ర యూనిట్ అధికారికంగా స్పందించాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











