ఇది అన్యాయం, మా సినిమా ఆపండి: టీవీ ఛానల్‌కు త్రిష విన్నపం!
విజయ్ సేతుపతి, త్రిష ప్రధాన పాత్రల్లో సి ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన '96' అనే తమిళ చిత్రం అక్టోబర్ 4న విడుదలై బాక్సాఫీసు వద్ద మంచి విజయం అందుకుంది. విజయవంతంగా 4 వారాలు పూర్తి చేసుకుని 5వ వారంలోకి ఎంటరైన ఈ మూవీ ఇప్పటికీ మంచి వసూళ్లు రాబడుతూ దూసుకెళుతోంది.
అయితే '96' శాటిలైట్ రైట్స్ దక్కించుకున్న సన్ టీవీ దీపావళి సందర్భంగా టీవీ ప్రీమియర్ వేసేందుకు ప్లాన్ చేస్తోంది. ఈ నేపథ్యంలో హీరోయిన్ త్రిష తమ చిత్రాన్ని అప్పుడే టీవీలో వేయడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు.

80 శాతం ఆక్సుపెన్సీతో...
‘‘మా సినిమా తాజాగా 5వ వారంలోకి అడుగు పెట్టింది. ఇప్పటికీ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. సినిమా ప్రదర్శితం అవుతున్న అన్ని థియేటర్లలో 80శాతం ఆక్సుపెన్సీతో రన్ అవుతోంది.'' అని త్రిష తెలిపారు.

అప్పుడే టీవీలో వేయడం అన్యాయం
ఓ వైపు సినిమా థియేటర్లలో అద్భుతంగా రన్ అవుతోంది. ఇంత తొందరగా టీవీ ప్రీమియర్ వేయడం అన్యాయం అని ‘96' టీమ్ మొత్తం భావిస్తున్నాం. దీని వల్ల సినిమాకు కొంతమేర నష్టం కలుగుతుంది అని త్రిష ఆందోళన వ్యక్తం చేశారు.
సంక్రాంతికి వాయిదా వేయండి
‘96' చిత్రాన్ని దీపావళికి కాకుండా సంక్రాంతికి వాయిదా వేసుకోవాలని సన్ టీవీ వారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. మా విన్నపాన్ని మన్నిస్తారని భావిస్తున్నాం... అంటూ త్రిష ట్వీట్ చేశారు. చిత్ర బృందం కూడా త్రిష వ్యాఖ్యలను సమర్ధించారు.

96 తెలుగులో రీమేక్
‘96' చిత్రం తమిళనాడులో మంచి వసూళ్లు సాధించి సూపర్ హిట్ చిత్రంగా నిలిచింది. కేరళలోనూ చిత్రం భారీ విజయం సాధించింది. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి ట్రావెల్ ఫోటోగ్రాఫర్‌గా నటించారు. ఈ సినిమాను చూసిన టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు తెలుగు రీమేక్ హక్కులను దక్కించుకున్నారు. రానా హీరోగా తెలుగులో రీమేక్ చేస్తారని టాక్. త్రిషనే తెలుగులో కూడా తీసుకోవాలని నిర్మాత భావిస్తున్నారట.


Click it and Unblock the Notifications











