అలా నా జీవితం నాశనం... సూపర్‌స్టార్ రాసలీలలు బయటపెట్టిన నటి
సినిమా పరిశ్రమ అనేది ఒక రంగుల ప్రపంచం. వెలుగు జిలుగులు, భారీ ఫాలోయింగ్, పాపులారిటీ మాత్రమే అందరికీ పైకి కనిపిస్తాయి. కానీ చీకటి కోణాలు, రాజకీయాలు, నెపోటిజం, పగలు, ప్రతీకారాలు ఇలా ఒక సినిమాకు కావాల్సిన ఎలిమెంట్స్ అన్ని ఇండస్ట్రీలోనే ఉన్నాయి. తారల క్రేజ్ చూసి ఎందరో సామాన్యులు తాము కూడా స్టార్స్ అనిపించుకోవాలని ఇక్కడ అడుగుపెడతారు. తీరా ఇక్కడికి వస్తేనే కానీ, వారికి అసలు విషయం బోధపడదు. అవకాశాలు అంతగా తేలికగా రావని.. కమిట్‌మెంట్, రాజీ, అడ్జెస్ట్, పడక సుఖం.. ఇలా విషయం ఏదైనా కీలక స్థానాల్లో ఉన్న వ్యక్తులు తమ అధికారాన్ని, హోదాను అడ్డుపెట్టుకుని అమ్మాయిల జీవితాలను నాశనం చేస్తూనే ఉన్నారు.
ప్రతినిత్యం ఎవరో ఒక హీరోయిన్, మహిళా నటి తమ జీవితంలో ఎదుర్కొన్న క్యాస్టింగ్ కౌచ్, లైంగిక వేధింపులను బయటపెడుతూనే ఉన్నారు. పైకి పెద్ద మనషులుగా చెలామణి అయ్యేవారి చీకటి కోణాలను వెలుగులోకి తీసుకొస్తూనే ఉన్నారు. మీటూ ఉద్యమంతో పాటు గతేడాది కేరళలో వెలుగు చూసిన హేమ కమిటీ రిపోర్ట్ వంటివి సంచలనం సృష్టించాయి. సినీ పరిశ్రమలో అదునుచూసి కాటు వేసే మగాళ్లు ఉన్నారని ఇవన్నీ హెచ్చరిస్తూనే ఉన్నాయి. కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చే వారే కాదు.. స్టార్ హీరోయిన్లు కూడా ఈ క్యాస్టింగ్ కౌచ్‌ను ఎదుర్కొంటూనే ఉన్నారు. తాజాగా ఓ సీనియర్ నటి.. కోరిక తీర్చలేదని ఓ సూపర్‌స్టార్ తన కెరీర్‌ను నాశనం చేశారని సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ వివరాల్లోకి వెళితే..
ఆ నటి ఎవరో కాదు.. వైష్ణవి మెక్‌డొనాల్డ్ అలియాస్ వైష్ణవి మహంత్. ముంబైకి చెందిన ఈ నటి శక్తిమాన్ సీరియల్‌తో పాపులారిటీ సంపాదించారు. 1988లో వీరణ సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చిన వైష్ణవి.. ఆ తర్వాత లాడ్లా, మైదాన్ ఈ జంగ్, బాంభాయి కా బాబు, బాబుల్, మమ్మీ పంజాబీ, సూపర్ నానీ, తదితర సినిమాలలో నటించారు. 1988 నుంచి 2000వ సంవత్సరం వరకు ఏకధాటిగా సాగిన ఆమె కెరీర్... ఆ తర్వాత అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంది. నాలుగేళ్లకు ఒక సినిమా చేస్తూ ఉనికిని చాటుకున్నారు. 2019లో హన్సా ఏక్ సన్యోగ్ మూవీ తర్వాత ఏ సినిమాలోనూ వైష్ణవి నటించలేదు.

అయితే 1998 నుంచి 2005 వరకు దూరదర్శన్‌లో టెలికాస్ట్ అయిన శక్తిమాన్ ధారావాహికలో గీతా విశ్వాస్ రోల్‌లో ఆమె దేశప్రజలకు బాగా దగ్గరయ్యారు. ఇప్పటికీ శక్తిమాన్ సీరిస్ ద్వారానే వైష్ణవిని జనం గుర్తుపెట్టుకుంటున్నారంటే అతిశయోక్తి కాదు. వెండితెరపై దూరమైనా వరుసపెట్టి సీరియల్స్‌తో అలరించారు వైష్ణవి. 1998 నుంచి నేటి వరకు దాదాపు 28 ఏళ్లుగా బుల్లితెరపై మహారాణిగా వెలుగొందుతున్నారు. అయితే వెండితెర నుంచి బుల్లితెరకు ఆమె ఎందుకు వెళ్లారు? మధ్యలో ఏం జరిగింది? ఈ నిర్ణయానికి దారితీసిన కారణాలు ఏంటీ? అనేది ఇండస్ట్రీలో చర్చనీయాంశం అయ్యింది. తాజాగా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వైష్ణవి తన కెరీర్, ఎదుర్కొన్న సమస్యల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.
ఓ పెద్ద హీరో పక్కన మెయిన్ రోల్ కోసం నన్ను తీసుకున్నారు. సినిమా కోసం పోస్టర్స్, బ్యానర్స్ కూడా సిద్ధమయ్యాయి. అయితే నేను ఎక్కడికి వెళ్లినా మా అమ్మను తోడుగా తీసుకెళ్లడం అలవాటు. అయితే ఓ రోజున సాయంత్రం హోటల్‌లో ఓ మీటింగ్ ఉంది, అందరూ మగాళ్లే ఉంటారు.. అక్కడికి ఒంటరిగా రమ్మన్నారు. నాకు తేడాగా అనిపించడంతో పాటు మందు తాగొచ్చని చెప్పడం వెళ్లలేదు. దానికి తోడు ఎప్పుడూ అమ్మ నా వెంటే ఉండటం కూడా వాళ్లకు అదోలా ఉండేది. ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్‌ని స్విట్జర్లాండ్‌లో ప్లాన్ చేశారు. ఇందుకోసం నిర్మాతలు నా కోసం పాస్‌పోర్ట్ సిద్ధం చేసింది.. కానీ ఎప్పుడూ వెంట ఉండే మా అమ్మను మాత్రం కావాలని పక్కనపెట్టారు. దీనికి తోడు ఈ సినిమాలో నటిస్తున్న హీరోకు ... నా మీదే కన్ను. ఆయన ప్రపోజల్‌ను తిరస్కరించడంతో నాపై పగబట్టాడు. హీరో, నిర్మాత, దర్శకుడు ఒక్కటై నన్ను ప్రాజెక్ట్ నుంచి తప్పించారు అని వైష్ణవి తెలిపారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశం అవుతుండగా.. వైష్ణవిని తప్పించిన ఆ హీరో ఎవరు? ఆ సినిమా ఏంటీ? అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.


Click it and Unblock the Notifications











