చెన్నైలో సగం ఆస్తులు మావేనా? ఆర్థిక స్థితిని బయటపెట్టిన వరలక్ష్మి
టాలెంటెడ్ యాక్టర్ వరలక్ష్మి శరత్‌కుమార్ (Varalaxmi Sarathkumar)గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమిళ్, తెలుగు సినీ పరిశ్రమల్లో తనదైన నటనతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి వరలక్ష్మి. ఇప్పుడు మరో కొత్త అవతారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. హీరోయిన్‌గా కెరీర్ ప్రారంభించిన ఆమె తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా అనేక సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తూ బిజీగా మారారు. ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి దర్శకురాలిగా కూడా మారారు. ఆమె స్వయంగా దర్శకత్వం వహిస్తూ ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'సరస్వతి'. ఈ సినిమా మార్చి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది.
దర్శకురాలిగా వరలక్ష్మి కొత్త ప్రయాణం
'సరస్వతి' సినిమాతో వరలక్ష్మి శరత్‌కుమార్ దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు. దోశా డైరీస్ ఎల్ఎల్‌పీ బ్యానర్‌పై పూజా శరత్‌కుమార్,వరలక్ష్మి శరత్‌కుమార్ కలిసి ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాకు ఆంటోని ప్రవీణ్ డేనియల్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు. ఈ సినిమాలో ప్రియమణి, రాధిక శరత్‌కుమార్, రావు రమేష్, మురళీ శర్మ, ప్రకాశ్ రాజ్, కిషోర్, నాజర్, తులసి, సప్తగిరి, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.ఈ సినిమాకి ఎస్ థమన్ సంగీతం అందించారు. ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఆస్తులపై క్లారిటీ ఇచ్చిన వరలక్ష్మి
సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా వరలక్ష్మి ఇటీవల యాంకర్ వర్ష హోస్టింగ్ చేస్తున్న 'కిసిక్ టాక్'కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె తన వ్యక్తిగత జీవితం, ఆస్తులు, పెళ్లి, రాజకీయాలు వంటి అనేక అంశాలపై ఓపెన్‌గా మాట్లాడారు. ఇంటర్వ్యూలో యాంకర్ వర్ష ఒక ఆసక్తికరమైన ప్రశ్న అడిగింది. 'మీ ఫ్యామిలీ అంతా పెద్ద పెద్ద స్టార్స్ కదా.. మీకు కూడా చాలా ఆస్తులు ఉండి ఉంటాయి కదా?' అని అడగగా వరలక్ష్మి ఇచ్చిన సమాధానం అందరినీ ఆశ్చర్యపరిచింది. 'నాకు పెద్దగా ఆస్తులు ఏమీ లేవు. ఇప్పటికీ నేను రెంటెడ్ హౌస్‌లోనే ఉంటున్నాను. నా కష్టార్జితంతో ఒక కారు కొనుగోలు చేశాను. అలాగే ఒక చిన్న ఇల్లు కూడా కొనుక్కున్నాను' అని ఆమె చెప్పింది.
ఇండస్ట్రీలో చెన్నైలో సగం ఆస్తులు వరలక్ష్మి గారివేనని టాక్ ఉందని యాంకర్ ప్రస్తావించగా, ఆమె వ్యంగ్యంగా స్పందించింది. 'అంత ఆస్తులు ఉంటే నేను ఇక్కడ ఎందుకు ఉంటాను? ఎక్కడో వేరే లైఫ్ జీవించేదాన్ని కదా. కోట్ల రూపాయల ఆస్తులు ఉంటే నా జీవితం పూర్తిగా వేరేలా ఉండేది' అంటూ సెటైర్ వేసింది. ఇంటర్వ్యూలో వరలక్ష్మి తన వ్యక్తిగత జీవితంపై కూడా ఆసక్తికర విషయాలు వెల్లడించింది. మీది లవ్ మ్యారేజ్ లేదా అరేంజ్డ్ మ్యారేజ్? అనే ప్రశ్నకు ఆమె నవ్వుతూ '40 సంవత్సరాల వయసులో పెళ్లి చేసుకుంటే అది అరేంజ్డ్ మ్యారేజ్ ఎలా అవుతుంది? మాది లవ్ మ్యారేజ్' అని చెప్పింది. అలాగే తన భర్తే ముందుగా ప్రపోజ్ చేశారని తన లవ్ స్టోరీని కూడా చెప్పారు.
పెళ్లికి రూ.800 కోట్ల రూమర్
ఇటీవల నటి వరలక్ష్మి ఓ ఇంటర్య్వూలో తన పెళ్లి సమయంలో సోషల్ మీడియాలో తనపై వచ్చిన ఒక రూమర్ గురించి కూడా మాట్లాడింది. 'నా పెళ్లికి రూ.800 కోట్ల ఖర్చు చేశారని సోషల్ మీడియాలో రాశారు. అది చూసి నేను చాలా నవ్వుకున్నాను. నా దగ్గర అంత డబ్బు ఉంటే నేనెందుకు ఇలా ఉండాలి?' అంటూ సరదాగా స్పందించింది.


Click it and Unblock the Notifications











