2012 వీక్ స్క్రీన్ ప్లే తో వచ్చిన ఓ సాంకేతిక అద్భుతం
ఎన్నో రోజులుగా ఊరిస్తున్న హాలీవుడ్ సినిమా 2012 ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు గ్రాండ్ ఎంట్రీని ఇచ్చింది. 'ఇండిపెండెన్స్ డే', 'ది డే ఆఫ్టర్ టుమారో' వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలకు దర్శకత్వం వహించిన రొనాల్డ్ ఎమ్రిచ్ దర్శకత్వం లో ఈ సినిమా రూపుదిద్దుకోవడం తో ఈ సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దీనికి తోడు మాయన్ క్యాలెండర్ ప్రకారం 2012లో ప్రపంచం అంతం అయిపోతుందనే వార్తలు వినిపిస్తుండటం, దీనిని జోతిష్కులు సమర్థిస్తుండం, ఇదే కథాంశాన్ని ఇతివృత్తంగా చేసుకుని ఈ సినిమా రూపుదిద్దుకోవడం తో ఈ సినిమా పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆ తర్వాత విడుదలయిన ట్రెయిలర్లు అద్భుతంగా వుండి సినిమా పై అంచనాలను మరింత పెంచాయి. ఇన్ని అంచనాల మధ్య థియేటర్లకు వచ్చిన ఈ సినిమా అంచానలను ఏమేరకు అందుకుందో తెలుసుకోవాలంటే ఈ వార్త చదవాల్సిందే...
ఇండిపెండెన్స్ డే, ది డే ఆఫ్టర్ టుమారో వంటి సినిమాలను తీసిన రొనాల్డ్ ఎమ్రిచ్ ఊహాశక్తి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాలో కూడా ఆయన ఊహా ప్రతిభ కనిపిస్తుంది.. 2012 లో జరగబోయే ప్రళయవిశ్వరూపం ఏవిధంగా వుండబోతోందోనని ఆయన ఊహించి సృష్టించిన ఈ సాంకేతిక అద్భుతాన్ని ప్రశంసించకుండా వుండలేరు. ముఖ్యంగా వాటికన్ సిటీ, రయోలో వున్న ప్రసిద్ధ జీసస్ స్టాచ్యు, హిమాలయాలు సముద్రంలోకి కరిగిపోవడం వంటి సన్నివేశాలు ప్రేక్షకుడిని కన్నురెప్పవెయ్యనీకుండా చేస్తాయి. ఇంత అద్భుతంగా రూపొందిన ఈ సినిమా వీక్ స్క్రీన్ ప్లే వల్ల ఇండిపెండెన్స్ డే, ది డే ఆఫ్టర్ టుమారో లాంటి సినిమాల మధ్య నిలవడం కష్టమే... ఇక నటీనటుల విషయానికి వస్తే తేలిపోయిన స్క్రీన్ ప్లే వల్ల వారికి ప్రేక్షకుడిని మెప్పించడానికి అవకాశం దొరకలేదు. ఉన్నంతలో జాన్ సుసాక్ బాగాచేసాడు. రొనాల్డ్ ఎమ్రిచ్ నుండీ ఆశించే సాంకేతిక మాయాజాలం వదిలి మరేవిధంగానూ ఇది ఎమ్రిచ్ ప్రతిభకు సరితూగే సినిమా కాదు. కానీ ఈ సినిమాలో సృష్టించిన సాంకేతిక మాయాజాలాన్ని ఎవ్వరూ మిస్ అవకండి...


Click it and Unblock the Notifications











