సాంప్రదాయాల పుట్టినిల్లు భారత దేశం: ఓఫ్రా విన్‌ఫ్రే
జైపూర్: డాక్యుమెంటరీ షూటింగ్ కోసం ఇండియాకు వచ్చిన 57 సంవత్సరాల అమెరికన్ టీవీ మొఘల్, టాక్ షో క్వీన్ ఓఫ్రా విన్‌ఫ్రే ఆదివారం జైపూర్ సాహిత్య ఉత్సవంలో పాల్గోన్నారు. ఈ సందర్బంలో ఓఫ్రా విన్‌ఫ్రే మాట్లాడుతూ భారత్‌లో ఉన్న కుటుంబ సంస్కృతి తనకు ఎంతగానో నచ్చిందని, కుటుంబ వ్యవస్దపై ప్రశంసలు కురిపించారు.
సాధారణంగా భారత దేశం పేరు చెప్పగానే పేదరికం దేశంగా అందరూ తలచినప్పటికీ, ఎంతో చక్కనైన కుటుంబ సంస్కృతికి పెట్టింది పేరని అన్నారు.
అంతేకాకుండా నాలుగు తరాల వ్యక్తులు ఒకే కుటుంబంలో కలిసి జీవించడం అద్భుత విషయంగా కొనియాడారు. భారత్‌లో ఉన్న ఈ కుటుంబ సంస్కృతికి మురిసిపోతూ, మళ్లీ తప్పకుండా ఇక్కడకు వస్తానని అన్నారు. ఐతే భారత్‌లో ఉన్న ట్రాఫిక్ వ్యవస్థపై ఆమె అసంతృప్తి వ్యక్తంచేశారు. 'రెడ్ సిగ్నల్ పడినా జనం ఎవరి దారిన వారు వెళ్లిపోతున్నారని అన్నారు. ఓఫ్రా విన్‌ఫ్రే జైపూర్ రావడానికి ముందు ముంబైలోని ఓ వితంతు ఆశ్రమాన్ని సందర్శించారు. మీరు మీ కుటుంబంలోని పెద్దలను ఎంతగానో ప్రేమిస్తారు. అదే సమయంలో భర్తను కోల్పోయిన స్త్రీ బాగోగులు సరిగా పట్టించుకోవడం లేదని వాపోయారు.
ఇక అంతక ముందు ముంబైలో విన్‌ఫ్రేకు పరమేశ్వర్ గోద్రేజ్ విలాసవంతమైన విందును ముంబైలో ఏర్పాటు చేశారు. ఈ విందులో బాలీవుడ్ తారలు అమితాబ్, అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్, షారుఖ్‌ఖాన్, ప్రియాంక చోప్రా, ప్రీతి జింటా, లారా దత్తా, శిల్పాశెట్టి, అనిల్ కపూర్, ఇమ్రాన్ ఖాన్, నేహా దూపియా, సమీరారెడ్డి, డినో మారియా, ప్రముఖ రచయిత్రి శోభా డే, జ్యువెలరీ డిజైనర్ ఫరా ఖాన్ ఆలీలతో పాటు ఫిల్మ్ మేకర్స్ రాజ్ కుమార్ హీరాణి, అశుతోష్ గోవార్కిర్ హాజరయ్యారు. ఆరంజ్ రంగు చీరను ధరించి విన్‌ఫ్రే పార్టీలో హల్‌చల్ చేశారు. ఓఫ్రా విన్‌ఫ్రే కలిసిన తర్వాత బాలీవుడ్ నటులు వారి యొక్క అనుభూతిని ట్విట్టర్‌లో పంచుకున్న విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











