Plane Crash: సముద్రంలో కూలిన విమానం.. ప్రముఖ నటుడు, ఇద్దరు కూతుళ్లు దుర్మరణం..!
హాలీవుడ్ నటుడు క్రిస్టియన్ ఓలివర్ ఇక లేరు. ఆయన ప్రయాణిస్తున్న ఫ్లయిట్ సముద్రంలో కూలిపోవడంతో ఆయనతోపాటు ఇద్దరు కూతుళ్లు కూడా దుర్మరణం చెందడం సినీ వర్గాలను తీవ్ర విషాదానికి గురిచేసింది. క్రిస్టియన్ ఓలివర్ ఇక లేరనే వార్తతో ఆయన అభిమానులు, సన్నిహితులు, శ్రేయోభిలాషులు, కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్బ్రాంతికి లోనయ్యారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకొంటూ సంతాపం తెలియజేస్తున్నారు. క్రిస్టియన్ ఓలివర్ ప్రమాద వార్తకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..
నటుడు క్రిస్టియన్ ఓలివర్ తన ఇద్దరు కూతుళ్లతో కలిసి విహార యాత్రకు బయలుదేరారు. జేఎఫ్ మిచెల్ ఎయిర్‌పోర్టు నుంచి సెయింట్ లూసియాకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కరేబియన్ దీవుల్లోని బుక్వా ప్రాంతంలో విమానం కుప్పకూలింది. ఆయనతోపాటు ఆయన ఇద్దరు కుమార్తెలు అక్కడికక్కడే మరణించారు. ఓలివర్ వయసు 51 సంవత్సరాలు. ఆయన ఒక కూతురు 10, మరో కూతురు వయసు 12 సంవత్సరాలు అని ఆయన వర్గీయులు తెలిపారు.

కరేబియన్ దీవుల్లో విమానం కుప్పకూలగానే ఆ ప్రాంతంలో ఉన్న మత్స్యకారులు వెంటనే ఆ ప్రాంతానికి వెళ్లి గాలించారు. ఆతర్వాత కోస్ట్ గార్డులు వెళ్లి గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో క్రిస్టియన్ ఓలివర్, కూతుళ్లు మాదితా, అన్నిక్, పైలెట్ రాబర్ట్ సచ్ మృతదేహాలను బయటకు తీశారు.
కోస్టల్ గార్డ్స్ విమాన ప్రమాదానికి కారణాలు తెలియజేస్తూ.. విమానం టేకాఫ్ జరిగిన వెంటనే సాంకేతిక లోపాలు తలెత్తాయి. వెంటనే సముద్రంలో కూలిపోయింది. వెంటనే బోట్ల సహాయంతో వారిని గాలించారు. కానీ వారి ప్రాణాలను కాపాడలేకపోయాం అని ఎస్‌వీజీ కోస్ట్ గార్డ్ టీమ్ చెప్పింది.
క్రిస్టియన్ ఓలివర్ విషయానికి వస్తే.. ఆయన అసలు పేరు క్రిస్టియన్ క్లెప్సర్. ఆయన జర్మన్ యాక్టర్. మార్చి 3, 1972లో జన్మించారు. టెలివిజన్ రంగంలోకి ప్రవేశించిన ఆయనకు కోబ్రా 11 టెలివిజన్ సీరిస్ మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. 1994లో సేవ్‌డ్ బై ది బెల్ సినిమా ద్వారా సినీ రంగంలోకి ప్రవేశించారు. ది బేబీ సిట్టర్స్ క్లబ్, స్పీడ్ రేసర్, ది గుడ్ జర్మన్, రెడీ ఆర్ నాట్, ట్రిబ్యూట్, హంటర్స్ చిత్రాల్లో నటించారు. ఆయన నటించిన చివరి చిత్రం ఇండియానా జోన్స్ అండ్ ది డయల్ ఆఫ్ డెస్టినీ.


Click it and Unblock the Notifications











